logo

శవాగారాల్లోనూ దోపిడీ

అనంత సర్వజనాసుపత్రిలో అనాథ, గుర్తుతెలియని మృతదేహాలను నిలవ చేయడం గగనంగా మారుతోంది. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో పైసా ఇవ్వని పరిస్థితుల్లో ఈ దుస్థితి దాపురించింది.

Published : 30 Apr 2024 04:56 IST

మార్చురీలో ప్రమాదకంగా ప్యూజు బాక్సు
అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: అనంత సర్వజనాసుపత్రిలో అనాథ, గుర్తుతెలియని మృతదేహాలను నిలవ చేయడం గగనంగా మారుతోంది. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో పైసా ఇవ్వని పరిస్థితుల్లో ఈ దుస్థితి దాపురించింది. వీటన్నింటిని మార్చురీలో ఉన్న ఫ్రీజర్‌ బాక్సుల్లో నిలవ ఉంచాల్సి ఉంటుంది. అనాథ, గుర్తుతెలియని మృతదేహాల వివరాలను పోలీసులకు సమాచారం ఇస్తారు. వారు దర్యాప్తు చేసి ఇచ్చే నివేదిక ఆధారంగానే 72 గంటల్లో మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తారు. కొన్నిసార్లు పోలీసుల దర్యాప్తులో జాప్యం అవుతుండటంతో నాలుగు రోజులపాటు శవాలను మార్చురీలో భద్రపరచాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మార్చురీలో ఫ్రీజర్‌ బాక్సులు ఖాళీగా లేక మృతదేహాలను బయటనే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకే రోజు ఎక్కువ మృతదేహాలు మార్చురీకి వచ్చిన సమయాల్లోనూ కొన్నింటిని బాక్సుల్లో ఉంచలేకపోతున్నామని ఈ క్రమంలో దుర్వాసన వస్తుండటంతో తాము ఇబ్బందులు పడుతున్నామని వైద్యులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురంలోని సర్వజన వైద్యశాలలో ఉన్న మార్చురీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు రూ.12.60 లక్షలు మంజూరు చేశారు. మిగిలిన మొత్తంతో మార్చురీకి రంగులు వేయటం, ఎలక్ట్రికల్‌ వర్క్‌లు పూర్తిచేయటం, కాంపౌండ్‌వాల్‌, ఫ్రీజర్‌ బాక్సులు మరమ్మతులు చేయాల్సి ఉండగా సదరు గుత్తేదారు తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు పెట్టుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా ఫీజర్‌ బాక్సులు మరమ్మతులు చేయకనే చేసినట్లు బిల్లులు పెట్టి దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేపడితే పలు వాస్తవాలు వెలుగులోకి రావటంతో అక్రమార్కులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆ విభాగంలోని ఉద్యోగులు కోరుతున్నారు.

 ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం (హెచ్‌డీఎస్‌)ను 2020,22,23 సంవత్సరాల్లో మొత్తంగా మూడుసార్లు మాత్రమే నిర్వహించారు. హెచ్‌డీఎస్‌ సమావేశం నిర్వహిస్తే జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌, ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఆసుపత్రి పర్యవేక్షకుడితో పాటు పలువురు సభ్యులు, వైద్యవిభాగాల హెచ్‌వోడీలు పాల్గొంటారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు కమిటీ ఆమోదంతో ఆసుపత్రి అభివృద్ధి కోసం నిధులను వెచ్చించాలి. సమావేశాలే నిర్వహించకపోవటంతో పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోని పరిస్థితి నెలకొంది.

 సర్వజన వైద్యశాలతో పాటు తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్లు, హిందూపురం, పెనుకొండ, కదిరి, ఉరవకొండ, గుత్తి, పామిడి, కళ్యాణదుర్గం ఏరియా ఆసుపత్రుల్లో పంచనామా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 సీహెచ్‌సీ కేంద్రాల్లో పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా పదికి పైగా కేంద్రాల్లో వైద్యుల నియామకం ఉన్నా శవపరీక్షలు చేసేందుకు అవసరమైన వైద్య సామగ్రి లేక శవ పరీక్షలు నిర్వహించటం లేదు.

తెల్ల వస్త్రాన్ని ఇవ్వలేరా?

మార్చురీలో పోస్టుమార్టం చేసిన మృతదేహాలకు తెల్లటి వస్త్రం అవసరం అవుతుందని ఇందుకోసం వస్త్రాన్ని మంజూరు చేయాలని కోరుతూ ఫోరెన్సిక్‌ విభాగం వైద్యులు పలుమార్లు ఆసుపత్రి ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. లేఖలను చూసిన అధికారులు వస్త్రాన్ని మంజూరు చేయటం లేదని ఫోరెన్సిక్‌ వైద్యులు చెబుతున్నారు. తెల్లటి గుడ్డను మాత్రం ఆసుపత్రి ఉన్నతాధికారులు మంజూరు చేయకపోవటంతోనే మృతుల బందువులకు గుడ్డ తెచ్చుకోమని చెబుతున్నామని ఫోరెన్సిక్‌ విభాగం ఉద్యోగులు తెలుపుతున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని