logo

కొండలు, గుట్టల దోపిడీ.. జగనెరిగిన సత్యం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నాయకులకు ప్రకృతి వనరులు ఆదాయ మార్గాలుగా మారాయి. నాడు కొండలను చూస్తే వామ్మో కొండలు అనేవారు

Updated : 30 Apr 2024 06:44 IST

వైకాపా నాయకుల ఆదాయ మార్గాలుగా ప్రకృతి వనరులు

ఆగడాలపై నోరు మెదపని ముఖ్యమంత్రి

 

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నాయకులకు ప్రకృతి వనరులు ఆదాయ మార్గాలుగా మారాయి. నాడు కొండలను చూస్తే వామ్మో కొండలు అనేవారు. నేడు పొక్లెయిన్లు పెట్టి యంత్రాల సాయంతో దోచేస్తున్నారు. మట్టి, రాళ్లను ట్రాక్టర్లలో తరలించి పట్టణాలు, మండల కేంద్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఎన్నడూ లేనంతగా ఈ ఐదేళ్లలో కొండలు, గుట్టలు భారీగా కరిగిపోయాయి. నాయకుల జేబుల్లో నిధులు చేరాయి. కొన్నిచోట్ల అనుమతి తీసుకున్నది కొంతైంతే.. దోచుకున్నది కొండంత ఉంటుంది. సంబంధితశాఖల ఉన్నతాధికారులు, పార్టీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అంతులేకుండాపోయింది.      

- న్యూస్‌టుడే బృందం


ఇళ్ల నిర్మాణానికి తరలించి..

ధర్మవరం పట్టణం: పట్టణ పరిసర ప్రాంతాల్లోని కొండలు వైకాపా నాయకులకు రూ.కోట్లు కురిపించాయి. పోతులనాగేపల్లి వద్ద జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు నాయకులు కొండల్ని కరిగించి మట్టిని తవ్వి విక్రయించారు. కేతిరెడ్డికాలనీలోనూ ఇదే దందా కొనసాగుతోంది. అక్కడ నిర్మిస్తున్న ఇళ్లకు రేగాటిపల్లి సమీపంలోని కొండలను కరిగించేశారు.


కోడ్‌ అమలులోకి వచ్చినా..

పుట్టపర్తి: నల్లమాడ నుంచి కదిరికి వెళ్లే రహదారిలో ఎద్దులవారిపల్లి తండా వద్ద ఉన్న గుట్టల నుంచి మట్టిని యథేచ్ఛగా లేవుట్లు, వ్యవసాయ పొలాలు, ఇంటి నిర్మాణాలకు తరలిస్తున్నారు. అధికార పార్టీ నాయకుడు ట్రాక్టరు మట్టి రూ.500 నుంచి రూ.700 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినా రాత్రి సమయంలో బరితెగించి తరలించేస్తున్నారు.

మట్టి తరలించి.. నిధులు మూటకట్టి

మామిళ్లపల్లిలో ఎర్రగుడ్డం కొండ తీరు..

కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో ఉన్న ఎర్రగుడ్డం కొండ 45 ఎకరాలకు పైగానే ఉంటుంది. అందులో ఆరు ఎకరాల్లో కొండ చుట్టూ మట్టిని తొలిచిన వైకాపా నాయకులు బయటి ప్రాంతాల్లో విక్రయించి రూ.లక్షలు ఆర్జించారు. ఫలితంగా ప్రకృతి వనరులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.


ఆదాయమే మార్గంగా..

ఎ.కొండాపురం వద్ద కొండమట్టి తరలింపు

పుట్లూరు: మండలంలోని ఎ.కొండాపురంలో సర్వేనంబరు 1లో సుమారు 120 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో గాలిమరల ఉత్పత్తి కేంద్రాలు స్థాపించారు. మూడేళ్లుగా ఈ పరిసరాల్లోని మట్టిని స్థానిక వైకాపా నాయకుడొకరు ట్రిప్పు ట్రాక్టరు మట్టి రూ.300 చొప్పున అమ్ముకున్నాడు. తర్వాత యర్రగుంటపల్లికి చెందిన మరో నాయకుడు సచివాలయ నిర్మాణానికి అంటూ టిప్పర్లతో మట్టిని కొల్లగొట్టాడు.

ఇష్టారాజ్యంగా..

బొమ్మనహాళ్‌: వైకాపా ఐదేళ్ల పాలనలో నేమకల్లు కొండలు కరిగిపోతున్నాయి. ఈ కొండల్లో 23 కంకరమిషన్లు ఉండేవి. 2019లో అధికార పార్టీ నాయకుడి కుటుంబ సభ్యుల పేరుమీదనే క్వారీలకు అనుమతి ఇవ్వడంతో లక్షలాది క్యూబిక్‌ మీటర్ల మేర కొండలోని తెల్లరాయి తరలి వెళ్లింది. మోతాదుకు మించి మందుగుండు సామగ్రితో బ్లాస్టింగ్‌ చేస్తుండటంతో భారీ శబ్దానికి నేమకల్లు, ఉంతకల్లు గ్రామాల్లో ఇళ్లు సైతం చీలికలు వస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని