logo

గ్రామంలో ఎలా తిరుగుతావో చూస్తా..

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరులు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు అంతులేకుండా పోతోంది.

Published : 30 Apr 2024 04:59 IST

తెదేపాలో చేరిన వారిపై ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులు  

కనగానపల్లి, న్యూస్‌టుడే: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరులు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు అంతులేకుండా పోతోంది. అర్ధరాత్రి పూట వాహనాల్లో మందీ మార్బలాన్ని వెంట వేసుకొని వైకాపా నుంచి తెదేపాలో చేరిన వారిపై బెదిరింపులకు పాల్పడిన ఘటనలు వరుసగా శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కనగానపల్లి మండలం వేపకుంట వైకాపా నాయకుడు తలారి పుల్లప్ప అతని బంధువులు, శ్రేయోభిలాసులతో కలిసి ఈ నెల 28న రామగిరి మండలం వెంకటాపురంలో పరిటాల సునీత సమక్షంలో తెదేపాలో చేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి తన అనుచరులతో మామిళ్లపల్లి అమరనాథ్‌రెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డితోపాటు మరో 25 మందితో కలిసి 8 వాహనాల్లో వేపకుంటకు అర్ధరాత్రి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు శ్రీరాములు ఇంటిలో ఎమ్మెల్యే సోదరుడు కూర్చొని తలారి పుల్లప్పను పిల్చుకొని రావాలని అతని అనుచరులకు చెప్పాడు. ఇంటి బయట నిద్రిస్తున్న తలారి పుల్లప్పను పిల్చుకొని శ్రీరాముల ఇంటి వద్దకు వెళ్లారు. ఇన్ని రోజులు మా పార్టీలో తిరిగి ఇప్పుడు తెదేపాలో ఎలా చేరావు? అంటూ తలారి పుల్లప్పపై దుర్భాషలాడాడు. గ్రామంలో నీవు ఎలా తిరుగుతావో నేను చూస్తా.. మా అనుచరులతో వచ్చి నీవు, నీ బంధువులు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో వైకాపా కండువా వేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు పడుతావు.. అంటూ బెదిరించి అక్కడ నుంచి వారు వెళ్లిపోయారు. ఈ నెల 27న రామగిరి మండలానికి చెందిన సంపత్‌ను, ఈనెల 28న తోపుదుర్తి గ్రామానికి చెందిన బోయ సామాజిక వర్గానికి చెందిన లింగమయ్య, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వన్నూరప్పలపై ఎమ్మెల్యే మరో సోదరుడు రాజశేఖర్‌రెడ్డి దాడి చేసి పార్టీ మారాలని బెదిరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని