logo

పింఛను చేతికిస్తారా ప్రాణాలు తీస్తారా?

సామాజిక పింఛను సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్న పండుటాకులకు చెడు జరిగితేనే ఎన్నికల్లో తన పార్టీకి మంచి జరుగుతుందని జగన్‌ భావిస్తున్నారు.

Updated : 30 Apr 2024 06:42 IST

పండుటాకులపై అధికార వైకాపా పగ

లబ్ధిదారుల భుజాలపై తుపాకీ పెట్టి..రాజకీయం

 జగన్నాటకంలో ఉన్నతాధికారులు పాత్రదారులు

 ప్రతిపక్షాలను దోషులుగా నిలబెట్టేందుకు కుట్ర

అన్నింటికీ సిద్ధమంటివి..అందరినీ కష్టపెడితివి

సామాజిక పింఛను సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్న పండుటాకులకు చెడు జరిగితేనే ఎన్నికల్లో తన పార్టీకి మంచి జరుగుతుందని జగన్‌ భావిస్తున్నారు. ఇందుకోసం లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. పింఛనుదారుల భుజాలపై తుపాకీ పెట్టి... ప్రతిపక్షాలపై గురిపెట్టారు. కుట్ర చేసి.. నెపాన్ని కూటమిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏప్రిల్‌ పింఛన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేయడం ద్వారా ప్రతిపక్షాలను బూచిగా చూపి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేశారు. ఈ క్రమంలో మళ్లీ వృద్ధులను మరింత ఇబ్బంది పెట్టేందుకు సన్నద్ధమయ్యారు. మే నెల పింఛన్‌ను బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ చావుకబురు చల్లగా చెప్పారు. సొమ్ము కోసం లబ్ధిదారులు మండేఎండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేలా చేసి.. ఈ నెపాన్ని ప్రతిపక్ష పార్టీల మీదకు నెట్టే వ్యూహానికి పదును పెట్టారు.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, అనంతపురం(రాణినగర్‌): ‘ఎంత ఎక్కువ మంది చనిపోతే మనకు అంత ఎక్కువ లాభం’ అని ఓ తెలుగు సినిమాలో డైలాగు చెప్పే విలన్‌ పాత్రకు జగన్‌ సరిగ్గా సరిపోతారు. అవకాశం ఇస్తే అంతకు మించిన నటనాచాతుర్యాన్ని ప్రదర్శిస్తారేమో అనేంతలా ఆయన ప్రవర్తిస్తున్నారు. శవాలతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగన్‌.. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇప్పటికే 32 మంది పింఛనుదారుల ప్రాణాలు బలిగొన్నారు. ఆయన దాహం తీరినట్టు లేదు. మరింత మంది ప్రాణాలు బలి తీసుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏప్రిల్‌లో పింఛన్ల కోసం పండుటాకులను సచివాలయాల వద్ద నిరీక్షించేలా చేశారు. మే నెల పింఛన్ల సొమ్మును బ్యాంకు ఖాతాలో వేస్తాం.. అక్కడికెళ్లి తెచ్చుకోండని సెలవిస్తున్నారు. దీంతో వృద్ధుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది. ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా.. వృద్ధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా యంత్రాంగం పెడచెవిన పెడుతోంది. ఎన్నికల్లో జగన్‌కు లబ్ధి చేకూర్చడానికి కొందరు ఉన్నతాధికారులు వికృత రాజకీయ క్రీడకు తెరతీశారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇంటింటికీ సులభమే..

గతంలో మాదిరి 30వ తేదీన బ్యాంకుల్లో సొమ్ము జమ అయితే సచివాలయ సిబ్బంది ద్వారా 1, 2 తేదీల్లోనే ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉంది. రాజకీయ కుట్రలో భాగంగా ఉన్నతాధికారులు ఇంటింటి పంపిణీకి మోకాలడ్డుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,61,898 లక్షల మంది పింఛనుదారులు, సచివాలయాలు 1,207,  సచివాలయ సిబ్బంది 10,460 మంది ఉన్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో సగటున 465 పింఛన్లు ఉన్నాయి. ఒక్కరోజులోనే ప్రక్రియ పూర్తిచేసే సత్తా సచివాలయ సిబ్బందికి ఉంది. వాస్తవానికి వాలంటీర్ల కంటే సచివాలయ సిబ్బందికి విద్యార్హతతో పాటు అనుభవం ఎక్కువగా ఉంది. గతంలో వాలంటీర్లకు ఒక రోజు ముందుగానే పింఛను సొమ్ము అందజేస్తే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సమయం ఇచ్చే వారు. మే నెల సామాజిక పింఛన్ల సొమ్ము మొత్తాన్ని ఏప్రిల్‌ 30 తేదీన సచివాలయం ఖాతాల్లో జమచేయగలిగితే 1వ తేదీ పూర్తయ్యే సరికి కనీసం 80 నుంచి 90శాతం వరకు పంపిణీ చేసే సత్తా సచివాలయ ఉద్యోగులకు ఉంది. ప్రతిపక్షాలను దోషులుగా చిత్రీకరించే కుట్రలో భాగంగా ప్రక్రియకు అడ్డుపుల్ల వేస్తున్నారు.

ఖాతాల పరిస్థితి ఏమిటి?

  •  ఐదేళ్లలో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయడంతో చాలామంది పింఛనుదారులు బ్యాంకు ఖాతాలు వినియోగించడం లేదు.
  •  అత్యధికశాతం మంది ఖాతాలు యాక్టివ్‌లో లేవు. ఇలాంటి ఖాతాలకు పింఛను సొమ్ము ఎలా జమచేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
  •  ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునే అవగాహన వృద్ధులకు ఉంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
  • తమకు బ్యాంకు ఖాతా ఉందో లేదో కూడా చాలామందికి తెలియదు.

కుట్ర కాక మరేంటి..?

బ్యాంకు ఖాతాలు లేని పింఛనుదారులకు సొమ్ము ఇంటివద్దే సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు కనీసం ఒక్కరోజు సమయం పడుతుంది. సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేస్తే ఒక్కరోజులోనే బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండా 90 శాతం మందికి పంపిణీ చేయవచ్చు. ఈ కోణంలో అధికారులు ఎందుకు ఆలోచించడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికితోడు 1వ తేదీ మేడే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 2వ తేదీ నుంచే సొమ్ము డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేడే గురించి వృద్ధులకు అవగాహన ఉంటుందా అంటే ప్రశ్నార్థకమే. బ్యాంకులకు వెళ్లి తిరిగి వచ్చే లబ్ధిదారులు తెదేపాపై విషప్రచారం చేసేలా కుట్రకు తెరతీశారు. ఇంటివద్దే పంపిణీ చేయడానికి అన్ని అవకాశాలున్నా.. పరిస్థితిని మరింత జటిలం చేయడానికి అధికారపార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.


నడవలేని పరిస్థితి..
- రామన్న, సిద్ధార్థనగర్‌

గుంతకల్లు: పక్షవాతంతో కాళ్లు నడవడానికి సహకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు ఖాతాకు పింఛను సొమ్ము వేస్తే ఎలా తెచ్చుకోవాలి. ఈ ఎండలకు ఆటోలో వెళ్లి బ్యాంకు వద్ద నిలబడలేనయ్యా. ఆటో ఛార్జీలు అదనపు భారం. పింఛనుదారుల పట్ల దయలేకుండా ప్రభుత్వం ఇలా చేయడం మంచిదికాదు. సచివాలయ ఉద్యోగులతో ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేసేలా చూడాలి.


ఖాతా వినియోగించలేదు

ఏపీజీబీ బ్యాంకులో ఖాతా ఉంది. దాన్ని కొన్నేళ్లుగా వినియోగించ లేదు. ఆ నంబరు కూడా తెలియదు. ప్రభుత్వం పింఛన్‌ మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు జమ చేస్తామంటే, డబ్బులు తీసుకోవడం కష్టమే. జరిమానా కింద పింఛన్‌ మొత్తం కోతకు గురయ్యే అవకాశమూ లేకపోలేదు. మాలాంటి వారిని ప్రభుత్వం ఇబ్బందికి గురి చేయడం తగదు.
- శ్రీరాములు, ఉరవకొండ


బ్యాంకునే చూడలేదు

ఇప్పటి వరకు బ్యాంకు ముఖమే ఎరుగను. నాకు ఖాతా లేదు. మోరేపల్లి గ్రామం నుంచి కొత్తూరు సచివాలయానికి రెండు కిలోమీటర్ల దూరం ఆటోల్లో వెళ్లి ఏప్రిల్‌ నెల పింఛన్‌ తీసుకొచ్చాను. ఇప్పుడు కొత్త నిబంధనలు పెట్టి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటే ఎలా. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే వయసు సహకరించడం లేదు. పింఛన్‌ కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవాలా. ఈ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం.
- మారెక్క, మోరేపల్లి, కళ్యాణదుర్గం మండలం


అయిదు కిలోమీటర్లు వెళ్లాల్సిందే
- వెంకటనరసమ్మ, దేవగిరి, బొమ్మనహాళ్‌

బొమ్మనహాళ్‌: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాను. ప్రతినెలా రూ.10 వేలు పింఛన్‌ అందుతోంది. ప్రభుత్వం ఈనెల బ్యాంకులో వేస్తామని చెప్పడంతో 5 కి.మీ. దూరం వెళ్లాలి. నడవలేనందున తప్పకుండా కారు తీసుకుని వెళ్లాలి. కారు బాడుగ కూడా అందులోనే వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇంటికే పింఛన్‌ అందిస్తే నాకీ పాట్లు ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని