logo

వైకాపాలో బీసీలకు అన్యాయం.. కూటమికే మద్దతిస్తాం

జనాభా ప్రాతిపదికన బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నాం. బీసీ ఓటర్లతోనే జగన్మోహన్‌రెడ్డి గద్దెనెక్కారు. నమ్మిన బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 30 Apr 2024 05:06 IST

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు

 

 రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, దగ్గుపాటి ప్రసాద్‌లను సన్మానిస్తున్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు

అనంతపురం(వ్యవసాయం), న్యూస్‌టుడే: జనాభా ప్రాతిపదికన బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నాం. బీసీ ఓటర్లతోనే జగన్మోహన్‌రెడ్డి గద్దెనెక్కారు. నమ్మిన బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చే ఎన్నికల్లో తాము కూటమికే మద్దతునిస్తామని స్పష్టం చేశారు. సోమవారం జిల్లాకు వచ్చిన ఆయన తెదేపా అనంతపురం అర్బన్‌ కార్యాలయంలో దగ్గుపాటి ప్రసాద్‌, జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసమే తాము కూటమికి మద్దతు తెలిపామన్నారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రవిచంద్రకు ఏడు నెలలుగా పోస్టింగ్‌ ఇవ్వలేదు. మరో సీనియర్‌ అధికారి రాజశేఖర్‌కు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా పోస్టింగ్‌ ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం సతాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీలు, పదోన్నతుల్లో బీసీలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లలో తీరని అన్యాయం చేశారని, తద్వారా పదవులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం పేదలందరికీ అందాలంటే సమర్థవంతమైన నాయకుడు ఒక్క చంద్రబాబేనన్నారు. తెదేపా, భాజపా, జనసేన పార్టీలు కలుసుకోవడం శుభపరిణామమన్నారు. దగ్గుపాటి ప్రసాద్‌ మాట్లాడుతూ.. తెదేపా అధికారంలోకి రాగానే అనంత నగరంలోని పెద్ద గడియార స్తంభం వంతెనకు జ్యోతిరావుఫులె పేరు పెడతామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికుమార్‌, జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని