logo

కోడ్‌ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!

ఎన్నికల కోడ్‌ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు.

Published : 18 Apr 2024 04:07 IST

అనంతపురం ఆర్టీసీ, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. ఇటీవల ఆలస్యంగా వెలుగు చూసిన ఓ నియామకంలో వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ఆర్టీసీ నామినేటెడ్‌ పదవిలో అత్యున్నత స్థాయి వ్యక్తి చక్రం తిప్పినట్లు చర్చ నడుస్తోంది. అనంతపురం ఆర్టీసీ రీజినల్‌ కార్యాలయంలో జూనియర్‌ స్కేల్‌ ఆఫీసరు (డిపో మేనేజరు హోదా)లో ఉన్న ఓ అధికారి గత నెల 31న పదవీ విరమణ చేశారు. ఆయనే లా ఆఫీసరుగా విధులు నిర్వహించేవారు. రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పడంతో మళ్లీ ఆయననే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్‌ ఉండే సమయంలో ఈ ఉత్తర్వులు వచ్చాయంటే పైరవీ ఏ స్థాయిలో ఉందన్నది స్పష్టం అవుతోంది. ఎన్నికల కోడ్‌ వచ్చే ఒకరోజు ముందుగా మార్చి 15న ఎండీ కార్యాలయంలో ఆమోదం పొందినట్లు రెఫరెన్సు పెట్టారు. వాస్తవానికి ఆయన మార్చి 31న పదవీ విరమణ చేస్తే ఆయనే ఉంటారని పదవీ విరమణ కంటే 15 రోజుల ముందుగానే ఎలా ఆమోదిస్తారన్నది మరో ప్రశ్న. లా ఆఫీసరుగా నియమిస్తూ ఏప్రిల్‌ 1న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏకంగా రెండేళ్లపాటు ఆయన లేబర్‌ ఆఫీసరుగా ఉంటారని నియామకపు ఉత్తర్వులను ఆర్‌ఎం జారీ చేశారు. సాధారణంగా పొరుగు సేవల ద్వారా నియామకం ఒక్కరినే ప్రామాణికంగా ఎలా తీసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ఇప్పటికే పదవీ విరమణకు దగ్గరలో ఉన్న వారికి కూడా రెండేళ్లపాటు ఈ పోస్టుకు రాకుండా గండి కొట్టినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని