logo

ఫెసిలిటేషన్‌ కేంద్రం మూసివేత

పోస్టల్‌ బ్యాలెట్‌లో ఉద్యోగులంతా తెదేపాకే మొగ్గు చూపడంతో వైకాపా నాయకులు కుట్రలకు తెరలేపారని, గురువారం గడువు ఉన్నప్పటికీ ఫెసిలిటేషన్‌ కేంద్రం మూసేశారని అనంతపురం అర్బన్‌ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 10 May 2024 03:56 IST

ఓడిపోతామనే భయంతోనే వైకాపా కుట్ర: దగ్గుపాటి ప్రసాద్‌  

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), శ్రీనివాస్‌నగర్‌, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్‌లో ఉద్యోగులంతా తెదేపాకే మొగ్గు చూపడంతో వైకాపా నాయకులు కుట్రలకు తెరలేపారని, గురువారం గడువు ఉన్నప్పటికీ ఫెసిలిటేషన్‌ కేంద్రం మూసేశారని అనంతపురం అర్బన్‌ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుటాహుటిన కేంద్రం వద్దకు వెళ్లి.. ఆయన అధికారులతో వాదనకు దిగారు. గడువు ఉండగానే కేంద్రం ఎలా మూసేస్తారని ప్రశ్నించారు. కేంద్రాల గడువు బుధవారంతో ముగిసినా.. ఉద్యోగుల అభ్యర్థనతో మరోరోజు ఎన్నికల సంఘం గడువు పొడిగించిందని, ఎందుకు మూసేశారని ఆయన నిలదీశారు.

ఓటర్లు రాలేదనే మూసేస్తున్నామని అక్కడ అధికారులు చెప్పడంతో అనంతపురం అర్బన్‌ ఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించగా, మళ్లీ హడావుడిగా ఫెసిలిటేషన్‌ కేంద్రాలను తెరిచారు. తొలిరోజు నుంచి తెదేపాకు ఉద్యోగులంతా అనుకూలంగా ఓట్లు పడుతున్నాయని, భారీ మెజారిటీ వస్తోందని గ్రహించిన వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ వైకాపా నాయకులకు కుట్రల, కుతంత్రాలకు పాల్పడడంపై ఆయన ఆగ్రహించారు. జిల్లా ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని