logo

యువగళం.. జనబలం

యువగళం పాదయాత్రకు జన బలం తోడైంది. వైకాపా ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడ్డవారు బాధలు చెప్పుకోవడానికి వేదికైంది. కులవృత్తులవారు.. మైనార్టీలు ఇలా అన్ని వర్గాల వారు గోడు వెళ్లబోసుకోగా.. అండగా ఉంటానంటూ నారా లోకేశ్‌ పాదయాత్ర భరోసా ఇచ్చారు.

Published : 06 Feb 2023 02:32 IST

యువగళం పాదయాత్రకు జన బలం తోడైంది. వైకాపా ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడ్డవారు బాధలు చెప్పుకోవడానికి వేదికైంది. కులవృత్తులవారు.. మైనార్టీలు ఇలా అన్ని వర్గాల వారు గోడు వెళ్లబోసుకోగా.. అండగా ఉంటానంటూ నారా లోకేశ్‌ పాదయాత్ర భరోసా ఇచ్చారు. ‘యువగళం’ పాదయాత్ర పదోరోజైన ఆదివారం చిత్తూరు జిల్లా తవణంపల్లె, ఐరాల మండలాల్లో సాగింది. జన సమస్యలు వింటూ.. పరిష్కారానికి హామీ ఇస్తూ.. వారితో మమేకమై ముందుకు సాగారు.

ముస్లిం మైనార్టీలకు జగన్‌ వెన్నుపోటు

ఐరాల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలకు జగన్‌ వెన్నుపోటు పొడిచారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. యువగళం పాదయాత్రలో భాగంగా కాణిపాకంలో ముస్లిం మైనారిటీ సోదరులతో ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు నిలిపివేశారన్నారు. తెదేపా ప్రభుత్వ పథకాలైన దుల్హన్‌, రంజాన్‌ తోఫా, విదేశీ విద్యను రద్దు చేసి కష్టాల్లోకి నెట్టారన్నారు. ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు ఏమైందని ప్రశ్నించారు. ముస్లిం విద్యార్థులపై వైకాపా నాయకులు తప్పుడు కేసులు పెట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. తెదేపా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో కేసులు మాఫీ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. తప్పుడు కేసులపై న్యాయ విచారణ చేస్తామన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన పథకాలను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.


అభివృద్ధి వికేంద్రీకరణ తెదేపా లక్ష్యం

పూతలపట్టు: ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ తెదేపా లక్ష్యమని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఆదివారం తవణంపల్లె మండలం ఐరాల క్రాస్‌లోని సీడీఎం కల్యాణ మండపంలో యువతతో ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. పరిపాలన ఒకే చోట ఉండాలి.. అభివృద్ధిలో వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెదేపా పాలనలో రాష్ట్రానికి 13 పరిశ్రమలు తీసుకొచ్చామని, వైకాపా  పాలనలో పరిశ్రమలన్నీ పారిపోయాయన్నారు. కియా పరిశ్రమ ఒక విత్తనం మాత్రమే. ఈ పరిశ్రమకు అనుగుణంగా మరిన్ని పరిశ్రమలు తెప్పించి తద్వారా యువత పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలైన ఓసీలకు కూడా విదేశాల్లో చదువుకునే అవకాశం చంద్రబాబు కల్పించారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు సిలబస్‌లో మార్పులు తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు.  హంద్రీనీవా, పోలవరం ప్రాజెక్టులు ప్రారంభించింది తామేనని, పూర్తిచేసేది మేమేనని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ జాబ్‌ క్యాపిటల్‌గా ఉండేది..జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్‌ క్యాపిటల్‌గా మారిందన్నారు.


రూ.5 వేలు, రూ.10 వేలకు పనిచేస్తున్నాం

 -అజయ్‌, యువకుడు

సార్‌.. చదివిన చదువులకు, చేస్తున్న ఉద్యోగాలకు పొంతన లేదు. తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో చాలా మంది పక్క రాష్ట్రాలకు వెళ్లి రూ.5 వేలు, రూ.10 వేలకు పని చేస్తున్నాం. మీరు పాదయాత్ర చేస్తున్నారని తెలిసి మా బాధలు చెప్పుకొందామని వచ్చాం. మీరైనా రాష్ట్రంలోని నిరుద్యోగులను గుర్తించి పరిశ్రమలు తీసుకొస్తారని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాం. రాష్ట్రంలో పేరుకుపోయిన కుళ్లు, కుతంత్రాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. 


10 టన్నుల పుష్పాలు.. 3 కి.మీ తివాచీ

ద్దిపట్లపల్లెకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు నాగేశ్వరచౌదరి ఆయన కుమారుడు ప్రణీత్‌చౌదరి 10 టన్నుల పుష్పాలతో కాణిపాకం నుంచి ఐరాల క్రాస్‌ వరకు సుమారు 3 కి.మీ. పొడవునా లోకేశ్‌కు పూల తివాచీ పరిచారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చారు.


వైకాపా పాలనలో నిధులు రాలేదన్న గాండ్ల కులస్థులు

ఐరాల, న్యూస్‌టుడే: తవణంపల్లె మండలంలో సుమారు రెండు వేల మంది ఉన్నామని, వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి నిధులు రాలేదని గాండ్ల కులస్థులు లోకేశ్‌ ఎదుట ఆవేదన చెందారు. మహిళలకు కార్పొరేషన్‌ ద్వారా కుట్టు మిషన్లు అందించాలని కోరారు. కులవృత్తికి సంబంధించి నూనె మిల్లులు పెట్టుకోవడానికి రాయితీ కింద నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు.

లోకేశ్‌: రాష్ట్రంలో గాండ్ల కులస్థులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. ఆర్భాటంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినా కనీసం ఒక్క రూపాయి రుణంగా ఇవ్వలేదు. తెదేపా ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. నూనె మిల్లులు ఏర్పాటు చేస్తాం.


ప్రార్థనలకు వెళ్లనీయడం లేదు..

 -జె.బాషా, 14 కండ్రిగ

యాదమరి మండలం 14 కండ్రిగ ముస్లింవాడలో ఉన్న ముస్లింలను ప్రార్థనలకు వెళ్లనీయకుండా వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారు. వారి దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. షాదీమహల్‌ నిర్మాణాన్ని నిలిపివేశారు. మసీదు స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అడిగితే కొట్టేందుకు వస్తున్నారు. మా ప్రాణాలకు రక్షణ కల్పించండి.   


ప్రసంగంలో విశేషాలు..

తవణంపల్లె, న్యూస్‌టుడే: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఆదివారం తవణంపల్లె మండలంలో ముగిసింది. మారేడుపల్లి రహదారి వద్ద సమావేశం నిర్వహించారు. ఆయన ప్రసంగంలో విశేషాలు

ట్రైలర్‌ మాత్రమే అయింది.. అసలు సినిమా ముందుంది.. పాదయాత్ర అయింది 10 రోజులే.. ఇంకా 390 రోజులుంది.

2019 ఎన్నికల్లో జగన్‌ అవ్వ.. తాత.. అక్క.. చెల్లి... అని ముద్దులు పెట్టారు.. ఇప్పుడు పన్నుల పేరుతో బాదుతున్నాడు.

నా మీద 175 కేసులు పెట్టండి.. కానీ ఏ1గా నన్ను పెట్టండి.. జగన్‌.. నీ కేసులకు ఎవరూ భయపడరు.

బాబాయ్‌ని చంపింది ఎవరు.. అబ్బాయ్‌...

సీఎం పరదాలు పెట్టుకుని బయటకెళ్తారు. ప్రజలంటే భయం.. సీబీఐ అంటే ఇంకా భయం..

ఇదే ఉత్సాహం.. ఇదే ఉత్తేజంతో పనిచేస్తే 175 నియోజక వర్గాలు కైవసం చేసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని