logo

మళ్లీ వాయిదానే

‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. ఫలితంగానే సామూహిక గృహ ప్రవేశాల ముహూర్తం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది.

Published : 22 Mar 2023 04:40 IST

మారిన సామూహిక గృహ ప్రవేశాల ముహూర్తం
ఈనాడు, తిరుపతి, ఈనాడు డిజిటల్‌, చిత్తూరు, న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

ఈ చిత్రంలో కనిపిస్తున్నది శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు లేఔట్‌. తిరుపతి నగరంతోపాటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పేదలకు ఇక్కడ పట్టాలు ఇచ్చారు. 2020 డిసెంబరు 28న పక్కా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ చేశారు. ఇక్కడ మంజూరైన 5,116 ఇళ్లలో ఉగాది నాటికి 1,200 పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి గుత్తేదారులకు బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపేశారు. ఉగాది నుంచి ఏప్రిల్‌ 15కు ముహూర్తాన్ని వాయిదా వేసినా.. అప్పటికైనా నిర్మాణాలు పూర్తవుతాయా? అంటే సందేహమే.

‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. ఫలితంగానే సామూహిక గృహ ప్రవేశాల ముహూర్తం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మూడోసారీ వాయిదా వేస్తున్నట్టు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో 50 శాతం ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తికాగా చిత్తూరు జిల్లాలో లక్ష్యానికి మించి పూర్తయినా మౌలిక సదుపాయాల లేమి వెంటాడుతోంది.

తిరుపతి నగరానికి 20- 25 కి.మీ దూరంలో ఉండటంతో

రాష్ట్రంలోని పేదలందరికీ సొంత గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం 2020- 21 ఆర్థిక సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో 72,225, తిరుపతి జిల్లాలో 71,867 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబరు 21 నాటికి రెండు జిల్లాల్లో కలిపి కేవలం 34.29 శాతం ఇళ్లు అంటే 49,415 పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇళ్ల స్థలాలు దూరంగా ఉండటం, అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇసుక కొరత, నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరగడంతో నిర్మాణాలకు పేదలు పెద్దగా ముందుకు రాలేదు. తిరుపతి నగరంలోని ప్రజలకు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు, ఏర్పేడు మండలం చిందేపల్లిలో ఇళ్లు ఇచ్చారు. సుమారు 20- 25 కిలోమీటర్ల దూరంలో ఇవ్వడం అది కూడా ఒక్క సెంటు మాత్రమే ఉండటంతో నగరంలోని పేదలు పెద్దగా ఆసక్తి చూపలేదు. చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి- ఎం.కొత్తపల్లి మార్గంలోని గుట్టల్లోనూ స్థలాలు ఇచ్చారు. ఈ ప్రాంతం  22- 30 కి.మీ దూరంలో ఉంది. రోజూ ఆటో లకే రూ.300- రూ.400 ఖర్చవుతోందని, పునాదులు తీసేందుకే రూ.లక్షల్లో ఖర్చయ్యే పరిస్థితి ఉన్నందున నిర్మాణాలకు సుముఖత చూపడంలేదు. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని కొన్ని లేఔట్లలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించలేదు.

జిల్లాలో మంజూరైన ఇళ్లు 71,867
ఉగాది నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినవి 24,756
పూర్తయినవి 12,974

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని