logo

తేలని సిమెంట్‌ లెక్కలు

సచివాలయ భవన నిర్మాణాలకు కేటాయించిన సిమెంట్‌కు ఎంతకూ లెక్కలు తేలడం లేదు. గుత్తేదారులు పలుచోట్ల సొంత అవసరాలకు వినియోగించగా మరికొందరు వేరొకరికి విక్రయించిన సందర్భాలున్నాయి.

Published : 31 Mar 2023 02:32 IST

పూర్తికాని సచివాలయ భవనాలు

దొరవారి సత్రం మండలం ఏకొల్లులో ఇలా..

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: సచివాలయ భవన నిర్మాణాలకు కేటాయించిన సిమెంట్‌కు ఎంతకూ లెక్కలు తేలడం లేదు. గుత్తేదారులు పలుచోట్ల సొంత అవసరాలకు వినియోగించగా మరికొందరు వేరొకరికి విక్రయించిన సందర్భాలున్నాయి. దీనిపై పలుచోట్ల వివాదం ఎంతకూ తేలని పరిస్థితి నెలకొంది. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.

వైకాపా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మించాల్సి ఉంది. భవనానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వమే సిమెంట్‌ సరఫరా చేసింది. అయితే సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో పలుచోట్ల సిమెంట్‌ మాయమైంది. విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.

సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో 69 సచివాలయాలు ఉన్నాయి. ఇందులో ఓజిలి మండలంలో 10, దొరవారిసత్రంలో 11,నాయుడుపేటలో 11, పెళ్లకూరులో 13, సూళ్లూరుపేటలో 8, తడలో 16 సచివాలయాలు ఉండగా సచివాలయాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, ఆర్బీకేలకు వచ్చిన సిమెంటులో గోల్‌మాల్‌ జరిగింది.


కొన్నింటిని పరిశీలిస్తే..

దొరవారిసత్రం మండలంలోని వేణుంబాక, కల్లూరు, సూళ్లూరుపేట మండలంలోని దామానెల్లూరు, కేసీఎన్‌గుంట, తదితర పంచాయతీల్లో నేటి వరకు భవనాలు పూర్తిస్థాయిలో నిర్మించలేదు. వెల్‌నెస్‌ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు సైతం అరకొరగానే చేపట్టారు. అయితే ఇక్కడకు ప్రభుత్వం రెండేళ్ల కిందట సరఫరా చేసిన సిమెంట్‌ మాత్రం మాయమైంది. దీనిపై పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. కొద్దిరోజుల కిందట వేణుంబాక, కల్లూరు సచివాలయ భవనాల నిర్మాణ విషయమై అధికారుల వద్ద ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా సిమెంటు పక్కదారి పట్టిన విషయమై వివాదం సైతం నెలకొంది. బిల్లులు రానప్పుడు తామేం చేయగలం.. సిమెంటును అమ్ముకున్నామని పలువురు తెలిపినట్లు తెలిసింది. ఇదే పరిస్థితి పలుచోట్ల జరిగిన దాఖలాలు ఉన్నాయి. దీనిపై అధికారులు లోతుగా విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.


బిల్లులు ఆగడం లేదు

-బి.రమణయ్య, పీఆర్‌ డీఈ

సచివాలయ భవనాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి సిమెంటు సరఫరా చేసిన లెక్కలు మావద్ద ఉన్నాయి. వాటి ప్రకారం సంబంధిత గుత్తేదారు లెక్క చెప్పాల్సిందే. ప్రస్తుతం ఎక్కడా బిల్లులు ఆగడం లేదు. వెంటనే చెల్లిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని