logo

సిఫార్సు దర్శనాలే అధికం

దేశవిదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దర్శనార్థం వస్తుంటారు. ఇందులో సాధారణ, ప్రముఖులతో పాటు సిఫార్సు లేఖలపై దర్శనం కోసం వస్తారు.

Updated : 09 Jun 2023 06:11 IST

సాధారణ భక్తులకు  తప్పని కష్టాలు

వీఐపీ ద్వారం వద్ద వేచి ఉన్న ప్రముఖులు

కాణిపాకం, న్యూస్‌టుడే: దేశవిదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దర్శనార్థం వస్తుంటారు. ఇందులో సాధారణ, ప్రముఖులతో పాటు సిఫార్సు లేఖలపై దర్శనం కోసం వస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. సాధారణ భక్తుల కంటే సిఫార్సులపై వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా సాధారణ భక్తులకు స్వామి దర్శనానికి తిప్పలు తప్పడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాణిపాకం ఆలయానికి శని, ఆదివారాల్లో 15 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. వెయ్యి మందికి పైగా భక్తులు సిఫార్సులతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇందులో కేవలం వంద నుంచి రెండు వందల టికెట్లు మాత్రం కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన వారు ఉచితంగా దర్శనం చేసుకోవడంతో ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. సిఫార్సులతో వస్తున్న ప్రముఖులు స్వామివారిని నిమిషాల వ్యవధిలో దర్శనం చేసుకుంటుండగా... సాధారణ భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. గత వారం వీఐపీ ద్వారం వద్ద భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో గేట్లను తోసుకొని భక్తులు వెళ్లడం గమనార్హం.

మూడు నెలల నుంచే అధికం...

అతిశీఘ్రం, శీఘ్ర, సాధారణ క్యూలైన్లలో భక్తులు వెళ్లి గతంలో స్వామివారిని దర్శించుకునేవారు. కొందరు దళారులు వారివారి దారుల్లో భక్తులకు తీసుకెళ్లేవారు. దీనిని అధిగమించేందుకు ఆలయ సమీపంలో మూడు నెలల క్రితం పీఆర్వో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అనుమతి పొంది వీఐపీ ద్వారంలో స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలుగా అదనపు క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.


ఇబ్బందులు లేకుండా చర్యలు

సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొంటాం. సిఫార్సు దర్శనాలపై తగిన నిఘా ఉంచి, ప్రత్యేకంగా ఓ కమిటీని వేసి చర్యలు తీసుకొంటాం. వారం రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తాం

ఎ.మోహన్‌రెడ్డి, పాలకమండలి ఛైర్మన్‌, కాణిపాకం ఆలయం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని