logo

జురాసిక్‌ లోకాన్నిచూసొద్దాం

భూమిపై దాదాపు వేల సంవత్సరాల క్రితం మనుగడ సాగించినట్లు  చెప్పుకొనే అతిపెద్ద జీవరాసి అయిన డైనోసార్స్‌ చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఆసక్తే.

Published : 10 Jun 2023 02:58 IST

ఆకట్టుకుంటున్న జంతువుల బొమ్మలు

సైన్స్‌ సెంటర్‌లో ప్రీహిస్టారిక్‌ పార్కు ప్రవేశద్వారం

న్యూస్‌టుడే, జీవకోన(తిరుపతి): భూమిపై దాదాపు వేల సంవత్సరాల క్రితం మనుగడ సాగించినట్లు  చెప్పుకొనే అతిపెద్ద జీవరాసి అయిన డైనోసార్స్‌ చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఆసక్తే. భారీ ఆకారాలతో మాంసాహార, శాఖాహార జంతువులుగా భూమిపై సంచరించాయని చరిత్ర, చలన చిత్రాల ద్వారా తెలుసుకున్నాం. డైనోసార్లు, రిహనోసార్స్‌, రాకాసి బల్లులు, ఎగిరే జంతువులు, మొసళ్లు వంటి జంతువుల చిత్రాలు, బొమ్మలు చూసేందుకు ఇప్పటికీ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడుతుంటారు. పెద్ద నగరాల్లో హోటళ్ల వద్ద, షాపింగ్‌ కాంప్లెక్సుల్లో భారీ ఆకారంతో ఉండే వాటి బొమ్మలను పెట్టి ఆకర్షిస్తుంటారు. అలాంటి ఆకారాలతో జురాసిక్‌ వరల్డ్‌ను తలపించేలా తీర్చిదిద్దిన ఫ్రీహిస్టారిక్‌ పార్కు తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేశారు.

డైనోసార్ల లోకం

డైనోసార్

ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం సైన్స్‌ పరమైన ప్రదర్శనలతో మానవ శరీర నిర్మాణం నుంచి ఖగోళశాస్త్ర రహస్యాలు, నక్షత్ర మండలాల లోగుట్టును, రాకెట్ల తయారీ నుంచి అంతరిక్షంలోకి నడిపే సాంకేతికత వరకు అన్నింటినీ ఔత్సాహికులకు విడమరచి చెబుతుంది. పిల్లలను విజ్ఞానవంతులుగా, శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు సహకరిస్తోంది. అలాగే మనిషి పుట్టుక ముందు భూమిపై సంచరించిన జీవరాసుల గురించీ వివరిస్తోంది. మన పూర్వీకులుగా చెప్పుకొనే ఆదిమానవుల గురించీ చెబుతుంది. ఇందుకోసం సైన్స్‌ సెంటర్‌ ప్రాంగణంలో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో డైనోసార్స్‌ కాలంలో జీవించిన జంతువుల బొమ్మలను ఏర్పాటు చేశారు. డైనోసార్స్‌, రిహనోసార్స్‌, రాకాసి పక్షులు, మైక్రోరాఫ్టర్స్‌, అపటోసారస్‌ లూసీ, ఎడ్మాంట్ సారస్‌, స్టెగోసారస్‌, పినాకోసార్‌, పారాలిథెరి జినోసారస్‌ వంటి జంతువుల బొమ్మలు పెద్ద ఎత్తున కనిపిస్తూ, కదులుతూ, అరుస్తూ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. యంత్ర సాంకేతికతతో ప్రత్యేకంగా రూపొందించిన బొమ్మలు  ఆకట్టుకుంటున్నాయి. ఆయా బొమ్మల వద్ద వాటి చరిత్రను నోటీస్‌ బోర్డుపై సైన్స్‌ సెంటర్‌ అధికారులు అర్థమయ్యేలా ఏర్పాటు చేశారు. చూసి ఆనందించడంతో పాటు వాటి చరిత్ర తెలుసుకునే వెసులుబాటును కల్పించారు. సైన్స్‌ సెంటర్‌ను సందర్శించే సందర్శకులు ఫ్రీహిస్టారిక్‌ పార్కును తప్పనిసరిగా సందర్శించేలా అధికారులు దిశానిర్దేశం చేస్తుంటారు. వేసవి సెలవులు కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, సందర్శకులు ఓ సారి ఫ్రీహిస్టారిక్‌ పార్కును చూసిరావొచ్చు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని