logo

అధికారం అండతో.. తరిమేశారు

జిల్లాలో తోతాపురి, బేనీషా రకాలతో పాటు ఇతర రకాల మామిడికాయల కోతలు ఊపందుకు న్నాయి.. అయితే ధరలు మాత్రం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి..

Updated : 10 Jun 2023 04:08 IST

ఇష్టారాజ్యంగా ధరలు
మదనపడుతున్న మామిడి రైతు
ఓదార్పు ఇవ్వని అధికారుల ప్రకటనలు

చిత్తూరు మార్కెట్‌ యార్డుకు వచ్చిన తోతాపురి కాయలు

న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు):జిల్లాలో తోతాపురి, బేనీషా రకాలతో పాటు ఇతర రకాల మామిడి కాయల కోతలు ఊపందుకు న్నాయి.. అయితే ధరలు మాత్రం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.. దిగుబడులు తగ్గాయని, ఆశించిన ధర లభిస్తుందని సంబర పడిన వారి ఆశలు అడియాసలయ్యాయి.. అధికార పార్టీ నాయకుల అండతోనే ధరలు ఖరారవుతున్నాయని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెతున్నాయి.. ఏరోజు ఎంత ధర ఉంటుందో.. ధర ఎవరు నిర్ణయిస్తారో తెలియని పరిస్థితి.. కలెక్టర్‌ ప్రకటించిన మద్దతు ధర రైతులకు దక్కడం లేదంటే పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది.. గుజ్జు పరిశ్రమలు నడుపుతున్న అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల ప్రమేయంతోనే జిల్లాలో మామిడి ధరలు నిత్యం ఖరారవు తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

పతనమవుతున్న బేనీషా..

తోతాపురి ధరలు హెచ్చుతగ్గుల నడుమ కొనసాగుతుండగా బేన్నీషా ధరలు మాత్రం పతనమవుతు న్నాయి. జిల్లాలోని గుజ్జు పరిశ్రమలు తోతాపురి కాయల కొనుగోలు ప్రారంభించాయి. ఇవి టన్ను రూ.19వేలకే సేకరించాలని గత నెల 10న కలెక్టర్‌ ప్రకటించినప్పటికీ.. ఆ ధరతో ఎక్కడా కొనుగోలు జరగలేదు. తాజాగా ఈ నెల ఆరో తేదీన కలెక్టర్‌ మరోమారు వీటికి టన్ను రూ.15,500 మద్దతు ధర ప్రకటించారు. ఈ ధరను గుజ్జు పరిశ్రమలు రైతులకు చెల్లించకపోవడం శోచనీయం. కొన్ని గుజ్జు పరిశ్రమలు తోతాపురి టన్ను రూ.14-15 వేలు చెల్లిస్తుండగా.. మరికొన్ని రూ.11-13 వేలే ఇస్తున్నాయని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు స్పందిస్తే తప్ప మామిడికి గిట్టు బాటు ధర దక్కే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మామిడి రైతులు తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సిందే.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని..

ఏటా గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు సీజన్‌ మొదలు కాగానే చిత్తూరు, బంగారుపాళ్యం తదితర ప్రాంతాలకు చేరుకుని బేనీషా, తోతాపురి(లైన్‌ రకం కాయలు) కొనుగోలు చేసి ఎగుమతి చేస్తారు. వారు జిల్లాకు విచ్చేయడంతో మామిడికి డిమాండ్‌ పెరిగి రైతుకు మంచి ధర వచ్చేది. ఈ ఏడాది జిల్లాకు విచ్చేసిన ఇతర రాష్ట్రాల వ్యాపారులను.. జిల్లాకు చెందిన కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తరిమేసినట్లు సమాచారం. దీంతోనే ధరలు మరింత పతనానికి కారణమని పలువురు పేర్కొంటున్నారు.

ధరలు ఇలా..

చిత్తూరు మార్కెట్‌ యార్డులో శుక్రవారం తోతాపురి టన్ను రూ.15-16 వేలు ఉంది. కలర్‌ తోతాపురి(లైన్‌) రూ.20 వేలు పలికింది. బేన్నీషా 15-20వేలు, కాదర్‌ రూ.35-40వేలు, మలగూబ రూ.55-60వేలు, కాలేపాడు రూ.40-45వేలు, పులేరా రూ.12-13 వేలు పలికాయి.* బంగారుపాళ్యం యార్డులో బేనీషా టన్ను రూ.20-24 వేలు, మలగూబా 50-60 వేలు, కాలేపాడు రూ.40-60వేలు పలికింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని