logo

లోడెత్తేలోగా కాటేసిన మృత్యువు

మరి కాసేపట్లో వారు లారీలో శీతల పానీయాల సీసాల లోడుతో బయలు దేరాల్సి ఉంది. అందుకు సన్నద్ధమవుతుండగా విద్యుత్తు తీగ రూపంలో మృత్యువు కాటేయండతో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. శంఖవరం మండలం కత్తిపూడిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుం

Published : 24 Jan 2022 05:04 IST

విద్యుదాఘాతంతో విగతలైన లారీ డ్రైవర్‌, క్లీనర్‌


ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సి.ఐ కిశోర్‌బాబు, ఎస్సై రవికుమార్‌లు

శంఖవరం, న్యూస్‌టుడే: మరి కాసేపట్లో వారు లారీలో శీతల పానీయాల సీసాల లోడుతో బయలు దేరాల్సి ఉంది. అందుకు సన్నద్ధమవుతుండగా విద్యుత్తు తీగ రూపంలో మృత్యువు కాటేయండతో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. శంఖవరం మండలం కత్తిపూడిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి అన్నవరం ఎస్సై రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ మేడపోతుల శివ(38), క్లీనర్‌ ఆకుల రామ్‌కుమార్‌(35) కూల్‌ డ్రింకుల సీసాల లోడు తీసుకెళ్లేందుకు కత్తిపూడికి లారీ తీసుకొచ్చారు. లారీపైకెక్కి క్లీనర్‌ బరకం(టార్పాలిన్‌) తీస్తుండగా పైనున్న విద్యుత్తు తీగలు తగిలాయి. దీంతో రామ్‌కుమార్‌తోపాటు, లారీని తాకి ఉన్న డ్రైవర్‌ శివ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వారు ఈ లోడును శ్రీకాకుళం జిల్లా టెక్కలి దగ్గర చాపర తీసుకెళ్లాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని ఎస్సైతోపాటు సీఐ కిశోర్‌బాబు పరిశీలించారు. మృతదేహాలను తునిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధి కోసం వెళ్లి..

డ్రైవర్‌ శివతో పాటు క్లీనర్‌ రామ్‌కుమార్‌ ఉపాధి కోసం లారీకి వెళ్తుంటారు. శివకు ఇద్దరు కుమారులు ఉండగా, రామ్‌కుమార్‌కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు వ్యవసాయ పనులతో పాటు, అప్పుడప్పుడు ఇలా లారీపై పనికి వెళుతుంటారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని