logo

కొత్త పాలన.. కొండంత వేదన

పునర్విభజన అనంతరం కొత్త జిల్లా ఏర్పాటై మూడు నెలలు కావస్తున్నా కలెక్టరేట్‌లోని ఆయా విభాగాలు, ఇక్కడ ఏర్పాటైన వివిధ శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాల్లో గందరగోళ పరిస్థితి ఇంకా తొలగలేదు. ఇంకా కొన్ని శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలు

Published : 02 Jul 2022 03:33 IST

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం, ధవళేశ్వరం

జిల్లా హౌసింగ్‌ అధికారి కార్యాలయంలో అరకొర సిబ్బంది

పునర్విభజన అనంతరం కొత్త జిల్లా ఏర్పాటై మూడు నెలలు కావస్తున్నా కలెక్టరేట్‌లోని ఆయా విభాగాలు, ఇక్కడ ఏర్పాటైన వివిధ శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాల్లో గందరగోళ పరిస్థితి ఇంకా తొలగలేదు. ఇంకా కొన్ని శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు కాలేదు. మరికొన్ని శాఖల  కార్యాలయాలు మొక్కుబడిగా ఏర్పాటు చేశారే తప్ప పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగడంలేదు. ఇంకొన్ని కార్యాలయాలు అరకొర సిబ్బంది, సౌకర్యాల లేమి మధ్య కొనసాగుతున్నాయి. స్పందన రోజున మినహా మిగతా రోజుల్లో వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చే ప్రజలకు సమాధానం చెప్పేవారేలేరు.

తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌ బొమ్మూరు న్యాక్‌ భవనంలోని పైఅంతస్తులో ఏప్రిల్‌ 4న ఏర్పాటైంది. ఇక్కడి కలెక్టరేట్‌లోని పరిపాలన విభాగంతోపాటు కోఆర్డినేషన్‌, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెజిస్టీరియల్‌ తదితర సెక్షన్‌లతోపాటు జిల్లా అర్ధగణాంకాధికారి(సీపీవో), రెవెన్యూ, వ్యవసాయం, హౌసింగ్‌, పౌర సరఫరాలు, సర్వే, భూమి రికార్డులు, హౌసింగ్‌ అధికారి కార్యాలయాలు కొనసాగుతున్నాయి. మిగతా శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలకు సమీపంలోని గిరిజన యువత శిక్షణ కేంద్రం(వైటీసీ) భవనాన్ని కేటాయించినప్పటికీ ఇక్కడి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.

వైటీసీ భవనంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి అధికారి కార్యాలయంలో కుర్చీ మినహా కనిపించని సౌకర్యాలు

ఇదీ పరిస్థితి...
కొన్ని శాఖల కార్యాలయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. గదుల బయట బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కార్యాలయాలకు మాత్రం ఎప్పుడూ తాళాలు వేసి ఉంటున్నాయి. మరికొన్ని కార్యాలయాలు ఇరుకు గదులు, అరకొర సిబ్బంది, అసౌకర్యాల నడుమ మొక్కుబడిగా కొనసాగుతున్నాయి.

ఆడిట్‌ శాఖ, బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్ల కార్యాలయాలు ఇప్పటికీ రాలేదు.

ఆంధ్రప్రదేశ్‌ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి అధికారి కార్యాలయానికి బయట బోర్డు, లోపల ఒక కుర్చీ తప్ప ఏమీలేవు. ఈ కార్యాలయం ప్రస్తుతం తాళం వేసి ఉంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయం పరిస్థితి కూడా ఇంతే.

అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి, డ్వామా పీడీ, మార్క్‌ఫెడ్‌ డీఎం, ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజ్‌, జిల్లా పట్టుపరిశ్రమల శాఖ, ఏపీ సీడ్స్‌, నెడ్‌క్యాప్‌, మైక్రో ఇరిగేషన్‌, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసినా కొందరు కిందిస్థాయి సిబ్బంది తప్ప జిల్లాస్థాయి అధికారులు కన్పించడం లేదు. ఈ కార్యాలయాల్లో పరిపాలన స్తబ్దుగానే సాగుతోంది.  

న్యాక్‌ భవనంలో కొనసాగుతున్న కలెక్టరేట్‌లోని ఆయా విభాగాలు, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలకు కొంతవరకు సౌకర్యాలు సమకూర్చినప్పటికీ సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. పరిపాలన విభాగంలోని కార్యకలాపాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో జరగడం లేదు. కొన్ని అంశాలకు సంబంధించి కార్యకలాపాలు కాకినాడ నుంచే నిర్వహించే పరిస్థితి ఉంది.

తాళం వేసి ఉన్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయం

సిబ్బంది అంతంతమాత్రమే...

ఆయా శాఖల జిల్లా కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో వివిధ అభివృద్ధి పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో 12 మంది సిబ్బందికి గాను ఏడుగురే ఉన్నారు. సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు ఆఫీసు సబార్డినేటర్ల అవసరం ఉంది.

పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయంలో ఎనిమిది మంది సిబ్బంది ఉండగా ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు అవసరం ఉంది.

సీపీవో హౌసింగ్‌ కార్యాలయంలో సిబ్బంది అరకొరగా ఉండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

వైటీసీ భవనంలో కొనసాగుతున్న కార్యాలయాల్లోనూ అదే పరిస్థితి. మైక్రోఇరిగేషన్‌ కార్యాలయంలో డీఎంఐవో, సూపరింటెండెంట్‌ తప్పా మిగతా అయిదుగురు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందే. ఇక్కడ రెండు కంప్యూటర్లు మాత్రమే ఉండగా అందులో ఒకటి పనిచేయడంలేదు. మరో రెండు కంప్యూటర్లు, స్కానర్‌, ప్రింటర్‌, ఫర్నీచర్‌ అవసరం ఉంది.

జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలోనూ అదే పరిస్థితి. ఇక్కడ 11 మంది సిబ్బందికి ప్రస్తుతం ఏడుగురే ఉన్నారు. పూర్తిగా సౌకర్యాలు ఇంకా సమకూరలేదు.


దశలవారీగా సౌకర్యాలు సమకూరుస్తున్నాం
- సుబ్బారావు, డీఆర్వో

కలెక్టరేట్‌లోని ఆయా విభాగాలు, వివిధ శాఖల జిల్లా కార్యాలయాలకు దశలవారీగా సౌకర్యాలు సమకూరుతున్నాయి. ఇప్పటికే ఇక్కడి ఆయా విభాగాలతోపాటు పలు శాఖల కార్యాలయాలకు కుర్చీలు, టేబుల్స్‌, ర్యాక్‌లు కంప్యూటర్లు, బీరువాలు, ఫ్యాన్లు, ఏసీలు వంటివి ఏర్పాటు చేశాం. వైటీసీ భవనంలో కొనసాగుతున్న ఆయా శాఖల జిల్లా కార్యాలయాలకు కూడా ఒక్కొక్కటిగా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. సిబ్బంది సమస్య ప్రస్తుతం ఏమీ లేదు. అవసరాన్ని బట్టి ఇక్కడి ఆయా విభాగాలకు మండలాల నుంచి డిప్యూటేషన్‌పై సిబ్బందిని తీసుకుంటున్నాం. బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్లు తప్ప దాదాపు అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని