logo

జిల్లా పాలన.. వసతులకు విజ్క్షాపన

ప్రజలకు పాలన సౌలభ్యం.. సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో కోనసీమ జిల్లా ఏర్పాటుచేసి మూడు నెలలు కావస్తోంది. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఏప్రిల్‌ నాలుగో తేదీన యుద్ధ

Published : 02 Jul 2022 03:29 IST

న్యూస్‌టుడే, ముమ్మిడివరం, అమలాపురం పట్టణం, అల్లవరం

ప్రజలకు పాలన సౌలభ్యం.. సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో కోనసీమ జిల్లా ఏర్పాటుచేసి మూడు నెలలు కావస్తోంది. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఏప్రిల్‌ నాలుగో తేదీన యుద్ధ ప్రాతిపదికన.. కార్యాలయాలను కొత్త జిల్లాలకు మార్చారు. కోనసీమ జిల్లాలో అమలాపురం కేంద్రంగా కలెక్టరేట్‌తోపాటు జిల్లా పోలీసు, ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేయగా, ముమ్మిడివరంలోని ఎయిమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో పలు జిల్లాస్థాయి విభాగాల పరిపాలనా శాఖలను కొలువుదీర్చారు. కార్యాలయాల్లో సిబ్బంది విధుల నిర్వహణకు పూర్తి స్థాయిలో మౌలిక వసతుల్లేక.. పాలన ఇంకా కుదురుకోలేదు.

కలెక్టరేట్‌లో ఒకే గదిలోనే అన్ని సెక్షన్ల ఉద్యోగుల విధులు..

కొన్ని కార్యాలయాల్లో..
జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఐసీడీఎస్‌, జిల్లా పౌరసరఫరాల సంస్థ, పౌరసరఫరాల శాఖ, ఖజానా, విద్యాశాఖ, వ్యవసాయం, మత్స్యశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, అగ్నిమాపక, పరిశ్రమల శాఖలు, ఏపీ రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య, ఏపీఈడబ్ల్యూఐడీసీ, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో కొంతవరకు పాలన జరుగుతున్నా.. ఇంకా వసతులు కల్పించాల్సిఉంది. ఈ కార్యాలయాల్లో విభాగాధిపతులకు ప్రత్యేక క్యాబిన్‌లు ఏర్పాటు చేశారు. సిబ్బందికి పూర్తిస్థాయిలో ఫర్నిచర్‌ అందుబాటులో లేదు. దస్త్రాలు భద్రపర్చుకోవడానికి బీరువాలుసైతం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయని పరిస్థితి కనిపిస్తోంది. అటవీశాఖ కార్యాలయంలో ఇంకా కళాశాల జిమ్‌కు సంబంధించిన వస్తువులు మాత్రమే ఉన్నాయి. డీఆర్‌డీఏ కార్యాలయంలో పూర్తిస్థాయిలో ఫర్నిచర్‌ అందుబాటులోకి రాలేదు. సర్వే-భూరికార్డుల శాఖ కార్యాలయలోనూ ఇదే పరిస్థితి. ముమ్మిడివరం నుంచి జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి కార్యాలయాన్ని ఇటీవల అమలాపురానికి తరలించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన జిల్లా గృహ నిర్మాణశాఖ పీడీ అమలాపురంలోని ఆ శాఖ ఈఈ కార్యాలయంలో, డ్వామా పీడీ అమలాపురంలోని మరో క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

డ్వామా కార్యాలయంలో రెండు కుర్చీల ఆసరాతో విధుల్లో ఏవో సత్యనారాయణ


నిధులు ఏవండి..?

కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులకు వసతుల్లేని తీరు..

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త జిల్లాల్లో పాలన అందించడానికి ఏర్పాటుచేసే నూతన కార్యాలయాల ఏర్పాటు.. అక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. ముమ్మిడివరంలో ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు, కార్యాలయాల్లో క్యాబిన్‌లు, ఫ్యాన్లు వంటివి ఏర్పాటు చేయడానికి ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్‌ అధికారులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల పర్యవేక్షణలో పనులు జరిగాయి. ఇక్కడ పనులు చేసినా, నిధులు ఇంకా విడుదల కావాల్సిఉంది.


బోర్డులు ఏర్పాటు చేసి..

ఇంకా తెరుచుకోని షెడ్యూల్డు కులాలు, సహకార సంఘం లిమిటెడ్‌ కార్యాలయం

భూగర్భ వనరులు, గృహ నిర్మాణం, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, మార్క్‌ఫెడ్‌, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌, జిల్లా ఉపాధి కార్యాలయం, వయోజన విద్య, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ తదితర కార్యాలయాలకు బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఏ విధమైన పాలన జరగడం లేదు. ఈ కార్యాలయాల్లో నియమించిన సిబ్బందికి కనీసం కుర్చీలు కూడా లేని పరిస్థితి.


క్యాబిన్‌లలో కానరాని కంప్యూటర్లు..

జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయంలో అసంపూర్తి ఏర్పాట్లు

సాంకేతిక వినియోగం పెరిగిన నేపధ్యంలో సమాచారమంతా కంప్యూటర్‌లలోనే నిక్షిప్తం అవుతోంది. ఆన్‌లైన్‌ విధానం, ఎప్పటికప్పుడు వివిధ పథకాలకు సంబంధించి పురోగతి, జీవోలు.. ఇలా ఏది కావాలన్నా కంప్యూటర్‌తోనే పని. చాలా కార్యాలయాల్లో కంప్యూటర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన క్యాబిన్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా) కార్యాలయంలో ఫర్నిచర్‌ లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు.


అమలాపురంలో..

మలాపురంలోని కలెక్టరేట్‌లో వివిధ సెక్షన్‌ల కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారు. కలెక్టరేట్‌లో అన్ని సెక్షన్‌ల ఉద్యోగులు ఒకే గదిలో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి, పరిపాలనాధికారి ఛాంబర్లు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు సరైన వసతుల్లేవు. భవనం బయటకూర్చుని అర్జీలు పూర్తి చేస్తున్నారు. తాగునీటికి సంబంధించి తాత్కాలిక ఏర్పాట్లు మినహా శాశ్వత ఏర్పాట్లు కనిపించడం లేదు. జిల్లా ప్రజారోగ్య సాంకేతికశాఖ కార్యాలయంలో ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కనీస వసతులు కనిపించడంలేదు. చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో పాములు చేరుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. పెద్ద పాము తిరగడం చూశామని, తమకు భయంగా ఉందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సామగ్రి సమకూరుస్తున్నాం..
- హిమాన్షుశుక్లా, కలెక్టర్‌

కోనసీమ జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు రూ.50లక్షల నిధులతో సామగ్రి, కంప్యూటర్లు సమకూర్చి, పనులు పూర్తి చేయిస్తున్నాం. ఏమైనా లోటుపాట్లుంటే ఈ వారంలో సమీక్ష సమావేశం నిర్వహించి మిగిలిన సదుపాయాలు కల్పిస్తాం. అమలాపురం కలెక్టరేట్‌లో వివిధ సెక్షన్‌ల కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాం. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని