logo

మా సాత్విక్‌.. బంగారం

కామన్‌వెల్త్‌ క్రీడల్లో అమలాపురానికి చెందిన షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్‌ రాయిరాజ్‌ ముంబయికి చెందిన చిరాగ్‌శెట్టితో కలిసి భారత్‌కు బంగారు పతకం అందించడంతో క్రీడాభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. గతంలో జరిగిన ఇదే పోటీల్లో వెండి పతకం సాధించిన ఈ జోడీ ప్రస్తుతం

Published : 09 Aug 2022 06:49 IST

గడియార స్తంభం: కామన్‌వెల్త్‌ క్రీడల్లో అమలాపురానికి చెందిన షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్‌ రాయిరాజ్‌ ముంబయికి చెందిన చిరాగ్‌శెట్టితో కలిసి భారత్‌కు బంగారు పతకం అందించడంతో క్రీడాభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. గతంలో జరిగిన ఇదే పోటీల్లో వెండి పతకం సాధించిన ఈ జోడీ ప్రస్తుతం స్వర్ణం సాధించి దేశం, రాష్ట్రంతోపాటు అమలాపురం కీర్తిని చాటడంతో సాత్విక్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి జోరువాన కురవడంతో క్రీడాభిమానులు వీధుల్లోకి రాలేకపోయారు. పలువురు తమ ఇళ్ల వద్దే సంబరాలు జరుపుకొని మిఠాయిలు పంచుకున్నారు. మంత్రి విశ్వరూప్‌, ఎంపీ అనురాధ, కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, ఆర్డీవో వసంతరాయుడు, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మెట్ల సూర్యనారాయణ, కోనసీమ షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, ఉపాధ్యక్షుడు అల్లాడ శరత్‌బాబు, నాగేంద్ర, కోనసీమ ఐకాస సభ్యులు వీఎస్‌ దివాకర్‌, బండారు రామమోహనరావు తదితరులు అభినందనలు తెలిపారు.
గోపీచంద్‌ కల నెరవేరింది: భారత్‌కు బంగారు పతకం అందించాలన్న లక్ష్యంతోనే సాత్విక్‌, చిరాగ్‌ జోడీకి పుల్లెల గోపీచంద్‌ ఇచ్చిన శిక్షణ వెలకట్టలేం. గత కామెన్‌వెల్త్‌ పోటీల్లో వెండి పతకం సాధించినపుడే ఈసారి పోటీల్లో కచ్చితంగా బంగారు పతకం సాధిస్తారన్న నమ్మకం కలిగింది. భారత ప్రజల నమ్మకాన్ని వారిద్దరూ గోపీచంద్‌ సహకారంతో సాధించారు. రానున్న ఒలింపిక్‌ క్రీడల్లో బంగారు పతకం సాధిస్తారనే నమ్మకం కలుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగల క్రీడాకారులు ఎంతో మందిఉన్నా, ప్రోత్సాహం లేక జిల్లాస్థాయిని దాటలేకపోతున్నారు. అలాంటివారిని తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే దేశానికి మరిన్ని పతకాలు సాధించిపెడతారు. క్రీడల అభివృద్ధికి మౌలిక వసతులు పెంచాలి. చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్రం ఖేలో ఇండియాలో క్రీడలకు ఇస్తున్నట్లుగా.. రాష్ట్రాలు కూడా ప్రోత్సాహం అందిస్తే పతకాల పంట ఖాయం. - కాశీవిశ్వనాథ్‌


సాత్విక్‌ తల్లి రంగమణికి మిఠాయి తినిపిస్తున్న తండ్రి కాశీవిశ్వనాథ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని