logo

భవిత..ప్రశ్నార్థకం?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సమగ్రశిక్ష పథకంలో సహిత విద్యావిభాగం కాకినాడ కేంద్రంగా ఒక్కటిగానే కొనసాగిస్తున్నారు. మానసిక, శారీరక వైకల్యంతో పుట్టిన పిల్లలను సాధారణ విద్యార్థుల మాదిరి తీర్చిదిద్దేలా ‘భవిత’ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

Published : 17 Aug 2022 06:14 IST

బిక్కవోలు కేంద్రానికి ట్రైసైకిల్‌పై తీసుకొస్తున్న కుటుంబసభ్యులు

న్యూస్‌టుడే, సీతానగరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సమగ్రశిక్ష పథకంలో సహిత విద్యావిభాగం కాకినాడ కేంద్రంగా ఒక్కటిగానే కొనసాగిస్తున్నారు. మానసిక, శారీరక వైకల్యంతో పుట్టిన పిల్లలను సాధారణ విద్యార్థుల మాదిరి తీర్చిదిద్దేలా ‘భవిత’ కేంద్రాలను ఏర్పాటుచేశారు. గత రెండేళ్లుగా నిధుల లేమితో ఇవి నిర్వీర్యం అయ్యాయి. కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఇచ్చే పోషక నగదు ఇవ్వడం లేదు. పిల్లలకు సమీప పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తెచ్చి పెట్టే రవాణా ఛార్జీలూ లేవు. వేతనాలు లేక ఆయాలు పని మానేశారు. వెరసి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన దయనీయమిది.

ఎలాగంటే..
మానసిక, శారీరక వైకల్య పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్చాలి. వీరికి నెలకు రవాణా ఛార్జీలు రూ.300, ఎస్కార్ట్‌ అలవెన్సు రూ.300 ఇవ్వాలి. పిల్లలను వేర్వేరు గ్రామాల నుంచి తెచ్చే తల్లిదండ్రుల ఖాతాల్లో నగదు జమచేయాలి. మండల కేంద్రంలో భవిత కేంద్రానికి కొందరు 20-25 కి.మీ. నుంచి ప్రయాసలతో పిల్లలను తెస్తారు. బాలికలకు నెలకు రూ.200 స్టయిఫండ్‌ ఇవ్వాలి. కేంద్రాలకు రాలేని పిల్లల ఇళ్లకు ప్రతి శనివారం ఐఈఆర్టీ వెళ్లి బోధించాలి. వీరికి రూ.300 ఇవ్వాలి. అంధ పిల్లలకు బోధించే సహాయకులకు రూ.300 ఇవ్వాలి. సహిత విద్య అయిదు విభాగాల్లో అందించే ఈ సేవలకు రెండేళ్లుగా పైసా రాక.. రూ.77.65 లక్షల బకాయిలు పేరుకున్నాయి.

ఫిజియోథెరపీ అంతంతే..
64 కేంద్రాల్లో 21 మంది ఫిజియోథెరపిస్టులను నియమిస్తే... ఉమ్మడి జిల్లాలో 14 మంది మిగిలారు. ప్రతి కేంద్రంలో వారానికో ఒక శిబిరం పెట్టాలి. ఫిజియోథెరపిస్టుకు రూ.950 ఇవ్వాలి. నెలలో నాలుగు శిబిరాలు తప్పనిసరి. వీరికి కూడా వేతనాలు రాక శిబిరాలు మొక్కుబడిగా మారాయి. ఒక్కో ఆయాకు నెలకు రూ.6,000 మేర ఏడాదిగా రాలేదు. రెండేళ్ల కిందట కరోనా వేళ కేంద్రాలు తెరవకపోయినా వేతనాలు తీసుకున్నారని వాటిని గతేడాదికి సర్దుబాటు చేయడంతో రెండు నెలల వేతనాలే ఆయాలకు వస్తాయని అధికారులు చెప్పడంతో వారు పని మానేశారు.అసలు విషయం చెప్పకుండా ఆయాలు సెలవుల్లో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గడంతో భవిత కేంద్రాల పర్యవేక్షణను ఎంఈవోలు, సీఆర్పీలకు అప్పగించారు.

తీసుకురాలేకపోతున్నాం
ఒక్కడే బిడ్డ. పిల్లాడికి ఆరేళ్లు. మెదడులో లోపంతో మానసికంగా బాధపడుతున్నాడు. దీనికితోడు ఫిట్స్‌. నెలకు రూ.2 వేలకు పైగా మందులకు వెచ్చిస్తున్నాం. నా భర్త వ్యవసాయ కూలీ. 13 కి.మీ. దూరంలో భవిత కేంద్రానికి బిడ్డను తేవడానికి అష్టకష్టాలు పడుతున్నాం. రవాణా ఛార్జీలు, ఎస్కార్ట్‌ అలవెన్సులు రావడం లేదు. అడిగితే పలికే వారే లేరు. బస్సులు, ఆటోలు పట్టుకుని వస్తున్నాం. కొన్నిసార్లు వాహనాలు దొరక్క బిడ్డను ఎత్తుకుని తీసుకొస్తున్నాం. వైకల్య పరీక్షలు చేయలేదు. ఒక్క పరికరమూ ఇవ్వలేదు. - జి.శైలజ, వంగలపూడి

పరికరాలు రావండి...
పిల్లలకు అవసరమైన పరికరాలు ఆరునెలలకు ఒకసారి ఇవ్వాలి. ప్రధానంగా సేఫ్టీఛైర్‌, ట్రైసైకిళ్లు, వాకర్స్‌, క్లచ్ఛర్స్‌, ఎంఆర్‌ కిట్స్‌, బధిరత్వాన్ని, మూగ అధిగమించే 12 రకాల పరికరాలు ఇవ్వాలి. గతంలో ఆట వస్తువులు ఇచ్చేవారు. రెండేళ్లుగా ఒక్క పరికరమూ లేదు. ఇప్పటికే ఇచ్చినవన్నీ పాడయ్యాయి. కొత్తవి కొనేందుకు తల్లిదండ్రులకు స్థోమత లేదు. ఇప్పటికే పిల్లలకు మందులుకొని.. రాను పోనూ ఛార్జీలు భరించడం కష్టంగా మారిందంటున్నారు.

నిధులు రాగానే చెల్లిస్తాం..
భవిత కేంద్రాల్లో ఉండే పిల్లలతో పాటు బయట ఉండే వారికి ఇవ్వాల్సిన సొమ్ముకు అవసరమైన బిల్లులు పెట్టాం. బడ్జెట్‌ రాగానే తల్లుల ఖాతాల్లో వేస్తాం. అవసరమైన పరికరాలు ఇచ్చేలా నివేదికలు పంపించాం. అన్నిచోట్ల ఫిజియోథెరపీ శిబిరాలు నిర్వహిస్తాం. భవిత కేంద్రాలకు దగ్గరుండే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వీరికి అమలుచేస్తున్నాం. - జె.స్నేహలత, సహిత విద్యావిభాగం, ఉమ్మడి జిల్లా  


కాకినాడ అర్బన్‌లో కేంద్రానికి ఆటోలో చేరుతున్న విద్యార్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని