logo

ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్‌ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 25 Apr 2024 05:36 IST

పంచాయతీలపై ఇదో ఆర్థిక భారమంటున్న సర్పంచులు

కడియం, ధవళేశ్వరం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్‌ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట మార్కెట్‌లో రూ.3వేలు పలికే వీల్‌ఛైర్లకు రూ.5 వేలు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) డి.రాంబాబు ఆదేశాలిచ్చారని పేర్కొంటున్నారు. కేంద్రాల వద్ద పాతవి ఉన్నా లేకున్నా కొత్తవి కొనుగోలు చేయాలని సూచించారని వారు ఆరోపిస్తున్నారు. కడియం ఎంపీడీవో కార్యాలయం వద్ద సిద్ధం చేసిన వీల్‌ఛైర్లను కొనుగోలు చేసి బిల్లులు చెల్లించాలని చెబుతున్నారన్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్‌ దృష్టికి జేగురుపాడు సర్పంచి యాదల సతీశ్‌చంద్ర తీసుకెళ్లగా వీల్‌ఛైర్లు ఎక్కడైనా తక్కువ ధరకు అందుబాటులో ఉంటే పంచాయతీలు వాటిని కొనుగోలు చేసుకోవచ్చన్నట్లు తెలిపారన్నారు. అవసరం ఉన్నంత మేరకు మాత్రమే వాటిని కొనుగోలు చేయాలని సూచించారని వివరించారు.


ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు...
- జిల్లా పంచాయతీ అధికారి, రాంబాబు

పోలింగ్‌ కేంద్రాలలో వీల్‌ఛైర్‌లు కొనుగోలు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు ఆదేశాలు జారీ చేశాం. ఒక్కో కేంద్రానికి ఒక వీల్‌ఛైర్‌ని రూ. 5 వేలలోపు ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నాం. పంచాయతీలలో అవకతవకలపై తనిఖీలు చేస్తున్నాం. అధిక ధర చెల్లించాలని డిమాండు చేయడం అవాస్తవం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని