logo

కొవ్వూరు వైకాపాలో రగడ

కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది.

Published : 25 Apr 2024 05:42 IST

తాళ్లపూడి, న్యూస్‌టుడే: కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. దీనికితోడు మండల స్థాయిలో వేర్వేరు గ్రూపులు, ఆధిపత్య పోరుతో చుక్కాని లేని నావలా మారుతోంది. ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకున్న ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా ఫ్యాను వీడి సైకిల్‌ ఎక్కుతున్నారు.

రచ్చకెక్కిన వర్గపోరు..

నియోజకవర్గ పరిశీలకుడి పదవి కోసం రెండు సామాజిక వర్గాల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. సీఎం పర్యటనకు ముందు కొవ్వూరులో జరిగిన సమావేశంలో ఓ వర్గం నాయకుడిపై వేరే వర్గం వారు మూకుమ్మడి దాడి చేశారు. అనంతరం జిల్లా పార్టీ పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలో పదవులు కన్నా తమ సామాజిక వర్గమే ముఖ్యమని కొంతమంది బహిరంగంగానే చెబుతున్నారు.

గ్రామాల్లో గ్రూపు రాజకీయం

15 రోజుల కిందట వైకాపా రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌ తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టలో ప్రచారం చేశారు. అందులో ఓ గ్రామ నాయకుడు.. శ్రీనివాస్‌తో మాట్లాడుతూ తమ గ్రామంలో రెండు గ్రూపులు ఉన్నాయని, కలిసి పనిచేయమని తేల్చి చెప్పారు. ఆయన ఎదురుగానే రెండు గ్రూపుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరితో మరొకరు సహకరించమని తెగేసి చెప్పడం విభేదాలకు అద్దం పడుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్‌ సమయంలో జనసమీకరణలోనూ ఇదే ధోరణి కనిపించింది.

ఆమే కారణమా..!

వైకాపాలో గ్రూపుల పోరు ఎప్పటి నుంచో ఉంది. హోంమంత్రి తానేటి వనితే వీటిని పోషించారనే విమర్శలూ ఉన్నాయి. కొంతమందికి కావాలనే ప్రాధాన్యం ఇస్తూ మరికొంత మందిని దూరం పెట్టారని సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమై మలకపల్లికి చెందిన ఓ ముఖ్య నాయకుడు బహిరంగంగానే దుయ్యబట్టారు. తలారి వెంకట్రావు సమక్షంలో ఇటీవల కొంతమంది పార్టీలో చేరారు. ఆ కార్యక్రమానికి వచ్చిన నియోజకవర్గ నేతలను ఉద్దేశించి ఓ నాయకుడు మాట్లాడుతూ హోంమంత్రి ఇక్కడున్న సమయంలో వ్యతిరేకంగా ఉన్నవారు, ఇప్పుడు గ్రామానికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

శ్రేణుల్లో అయోమయం..

కొవ్వూరు ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ, సర్పంచి గెల్లా ప్రసాద్‌, ఇద్దరు ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు ఇటీవల  తెదేపాలో చేరారు. పార్టీ కోసం ఎంత పనిచేసినా తగిన గౌరవం లేదని చాగల్లుకు చెందిన కొఠారు ఆశోక్‌బాబా పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఓవైపు పార్టీలో విభేదాలు, మరోవైపు తెదేపాలో చేరికలతో శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు