logo

ప్రతి గొంతూ జేజేలు

నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి.  జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి.

Published : 25 Apr 2024 06:03 IST

జనసేనాని రోడ్‌షోలో పోటెత్తిన అభిమానం
కూటమిలో జోష్‌

ఉదయ్‌ శ్రీనివాస్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న జనసేనాని

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌: నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి.  జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. కాకినాడ లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ నామినేషన్‌ ప్రక్రియ సందర్భంగా కాకినాడ నగరంలో బుధవారం కనిపించిన దృశ్యమిది.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హాజరవడం.. అభిమానుల డప్పుల దరువుకు ఉత్సాహంగా స్టెప్పులేయడంతో.. అభ్యర్థులతోపాటు అభిమానులకూ ఊపొచ్చింది. నగరంలోని విద్యుత్తునగర్‌ నుంచి బయల్దేరిన ర్యాలీ.. జేఎన్‌టీయూ, భానుగుడి కూడలి, మెయిన్‌రోడ్డులోకి చేరింది. పవన్‌.. అక్కడి ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి ర్యాలీలో పాల్గొన్నారు. బాలాజీ చెరువు, జీజీహెచ్‌ మీదుగా జడ్పీ కూడలి వరకు సాగింది. అనంతరం నామినేషన్‌ పత్రాల సమర్పణకు అభ్యర్థితో కలిసి కలెక్టరేట్‌లోకి వెళ్లారు.

కాకినాడలో నిర్వహించిన రోడ్‌షోలో పవన్‌ కల్యాణ్‌, అభ్యర్థులు

అంతర్జాతీయ గుర్తింపు తెస్తారు

‘కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌ గెలిస్తే కాకినాడ పరిధిలోని ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తారని పవన్‌ భరోసా ఇచ్చారు. ఉదయ్‌శ్రీనివాస్‌, కాకినాడ సిటీ తెదేపా అభ్యర్థి కొండబాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, ప్రత్తిపాడు జనసేన ఇన్‌ఛార్జి తమ్మయ్యబాబు, తెదేపా నాయకులు బోళ్ల కృష్ణమోహన్‌, ఉండవల్లి వీర్రాజు పాల్గొన్నారు.


వారిని కొనుక్కుంటున్నారు

‘‘వైకాపా అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ కాకినాడ పార్లమెంటుకు సరైన వ్యక్తికాదు. వైకాపాలోకి వెళ్లే నాయకులు ఎవరైనా వారి వెంట పది మంది ఓటర్లు కూడా లేరు. అలాంటి వాళ్లను కొనుక్కుంటున్నార’ని పవన్‌ అన్నారు.


బ్రోకర్‌ మాటలేం పట్టించుకుంటామండీ..

సజ్జల విమర్శలపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు పవన్‌ స్పందించారు. బ్రోకర్‌ మాటలేం పట్టించుకుంటామండీ.. అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు