logo

సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్‌ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది.

Updated : 25 Apr 2024 06:36 IST

అయిదేళ్లుగా సంక్షోభంలో తాడితోట వస్త్రమార్కెట్‌
న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం

మ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్‌ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. కొవిడ్‌ నుంచి మరింతగా కుదేలైన వ్యాపారులు నేటికీ తేరుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు. నిర్వహణ భారంతో ఇప్పటికే కొందరు దుకాణాలను మూసివేశారు. ఏటా రూ.కోట్లలోనే వివిధ పన్నులు చెల్లిస్తున్నప్పటికీ ప్రభుత్వపరంగా గత అయిదేళ్లుగా ఎటువంటి సహకారం లేదు. మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. పారిశుద్ధ్యం నుంచి వీధిదీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా వరకు అంతా వ్యాపారులే నిర్వహించుకుంటున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. బెంగళూర్‌, దిల్లీ, ముంబయి, సూరత్‌, అహ్మదాబాద్‌, జబల్‌పూర్‌, తిరుపూర్‌, బెనారస్‌ తదితర ప్రాంతాల నుంచి వస్త్రాలు, రెడీమేడ్‌ దుస్తులను కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారులు విక్రయించుకునేవారు. గతంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచేగాక విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజూ పదివేల మంది వినియోగదారులు వచ్చి కొనుగోలు చేసేవారు. రవాణా ఛార్జీలు పెరిగిపోవడం, మాల్స్‌, ఆన్‌లైన్‌ వ్యాపారం పెరగడం వంటి వాటి కారణంగా వీరిసంఖ్య క్రమేణా తగ్గిపోయింది.

పలు దుకాణాల మూత

ప్రస్తుతం మహాత్మాగాంధీ క్లాత్‌ కాంప్లెక్సులో 25 దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో రూ.25 వేలు అద్దె అయినా దుకాణం దొరకని పరిస్థితి ఉండగా ఇప్పుడు రూ.10 వేలకు కూడా ఎవరూ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. మరికొందరు సిబ్బందిని తగ్గించుకుని దుకాణాలు నడుపుతున్నారు.

క్లాత్‌ కాంప్లెక్సులో నిర్వహణ భారంతో మూతపడిన దుకాణాలు


ఇదీ పరిస్థితి

పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ, రోడ్ల మర్మమతులు వంటివి నగరపాలక సంస్థ పట్టించుకోవడం లేదని, అసోసియేషన్‌ తరఫున తామే అన్నీ చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.


తూర్పు, పడమర ముఖద్వారాల వైపు నుంచి ఉన్న ప్రధాన డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. పూడికతో నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు మురుగునీరు పొంగి కాంప్లెక్సులోకి వచ్చేస్తుండటంతో వ్యాపారులు, సిబ్బంది, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.


ఎంజీడబ్ల్యూఎస్‌ బయట ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు ప్రధాన రహదారిపై చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి.


మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రధాన రహదారిలో రాత్రివేళ భద్రత లేకుండా పోతుందని పలువురు జట్ల కార్మికులు, వినియోగదారులు చెబుతున్నారు. బ్లేడ్‌, గంజాయి బ్యాచ్‌లు తిష్ఠవేసి బెదిరింపులకు గురిచేసి పలువురి నుంచి డబ్బులు లాక్కొని పోతున్న సంఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు.

తూర్పు మార్గంలో డ్రెయిన్‌ దుస్థితి


పన్నులు పెంచుకుంటూ పోతున్నారు
- కాలెపు రామచంద్రరావు, ది రాజమహేంద్రవరం హోల్‌సేల్‌ క్లాత్‌మార్కెట్‌ కమిటీ, తాడితోట

ఇక్కడి మార్కెట్‌లో ఒకపక్క వ్యాపారాలు తగ్గిపోయాయి. మరోపక్క నిర్వహణ భారం పెరిగిపోయి వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. పన్నులు కూడా ఏటా 15 శాతం పెంచుకుంటూ పోతుండటం మరింత భారంగా మారింది. పన్ను చెల్లిస్తున్నప్పటికీ కనీసం పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ నగరపాలక సంస్థ చేపట్టడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వపరంగా సహకారం అందించాలి.  


చెత్తపన్ను వేయడం దారుణం
- కె.రాధాకృష్ణమూర్తి, హోల్‌సేల్‌ వస్త్రవ్యాపారి

వ్యాపారాలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న తాడితోట క్లాత్‌ మార్కెట్‌లోని వ్యాపారులకు ప్రభుత్వపరంగా వెసులుబాటు కల్పించాలి. పన్నుల భారం తగ్గించి ఆదుకోవాలి. నగరపాలక సంస్థ తరఫున మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి. భారమంతా వ్యాపారులపై మోపడం సరికాదు. పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టకుండానే నగరపాలక సంస్థ చెత్తపన్ను వేయడం దారుణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని