logo

జగన్‌.. మాపై ఎందుకింత కక్ష?

గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్‌ రుణాలకు ఎగనామం పెట్టింది.

Published : 25 Apr 2024 05:53 IST

పునాది దశలో నిలిచిపోయిన కాపు సామాజిక భవనాలు
న్యూస్‌టుడే, పిఠాపురం

చిత్రాడలో పునాది దశలో నిలిచిన కాపు కల్యాణ మండపం

త ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్‌ రుణాలకు ఎగనామం పెట్టింది. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌ కాపులకు ఎన్నో హామీలు ఇచ్చినా.. అమలుకు నోచుకోలేదు. ఏటా రూ.2వేల కోట్లు చొప్పున అయిదేళ్లలో రూ.10వేల కోట్లు ఖరు చేస్తాననని హామీ ఇచ్చినా.. మాట నిలబెట్టుకోలేదు. గ్రామాల్లో కాపుల కోసం గత ఎన్నికల్లో నిర్మించ తలపెట్టిన కాపు సామాజిక భవనాలన్నీ జిల్లాలోని పలుచోట్ల పునాది దశలోనే నిలిచిపోయాయి. నిధులు ఆపేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.


ఇదీ పరిస్థితి..

తెదేపా హయాంలో కాపు సామాజిక భవనాల నిర్మాణానికి పిఠాపురం నియోజకవర్గంలో  ఏపీ కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి నిధులు మంజూరు చేశారు. 2018లో వీటి నిర్మాణానానికి శంకుస్థాపనలు చేయగా, ప్రభుత్వం దిగిపోయే సమయానికి పునాది దశలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో పురపాలక సంఘాల ఆధ్వర్యంలో రూ.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ శాఖ నుంచి రూ.25 లక్షలతో వీటి నిర్మాణాలు ప్రారంభించారు. స్థలాలు సేకరణ ఇబ్బందిగా ఉండి నిర్మాణ పనులు అప్పట్లో ఆలస్యంగా మొదలయ్యాయి. పలుచోట్ల ఆరునెలల కాలంలో పునాది దశ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో 2019 మార్చిలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నిధులు ఆగిపోవడంతో గుత్తేదారులు పనులు నిలుపుదల చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులు అటకెక్కాయి. నిధులు విడుదల చేయకపోవడంతో గుత్తేదారులు చేతులు ఎత్తేశారు.  


పనులు మొదలుకాలే..

పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతోపాటు, ఇతర మండలాల్లో కాపు సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఈ సామాజిక  భవనాలు నిర్మించేందుకు నిర్ణయించారు. పిఠాపురం పట్టణంతోపాటు, మండలంలో చిత్రాడ, కందరాడ, విరవ, విరవాడ, కోలంక, రాపర్తి, వెల్దుర్తి, పి.దొంతమూరు, పి.రాయవరం గ్రామాలకు రూ.25 లక్షలు చొప్పున కేటాయించారు. పి.రాయవరంలో మంజూరైన భవనాన్ని తర్వాత వివిధ కారణాలతో రద్దు చేశారు. మిగిలిన చోట్ల పనులు పునాది దశలో ఉండిపోయాయి. గొల్లప్రోలు నగర పంచాయతీతోపాటు, మండలంలోని దుర్గాడ, తాటిపర్తి, చేబ్రోలులో శంకుస్థాపనలు జరగగా, చేబ్రోలు, పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో స్థలం కేటాయించి శంకుస్థాపనలు చేశారు తప్పితే, పనులు మొదలు పెట్టలేదు.


మాట ఇచ్చి మోసం..
-కొండేపూడి సూర్యప్రకాష్‌, పిఠాపురం

వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపుల సంక్షేమాన్ని విస్మరించారు. కాపు కార్పొరేషన్‌ ఉనికిలేకుండా పోయింది.   తెదేపా హయాంలో పిఠాపురం పట్టణంలో సుమారు అర ఎకరం కేటాయించి కాపు కల్యాణ మండపానికి రూ.50 లక్షలు నిధులు నిలుపుదల చేశారు. వైకాపా నాయకులు అయిదేళ్లుగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నారు. ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.


తగిన సమాధానం చెబుతాం..
-అడ్డగర్ల శివ, చిత్రాడ

నియోజకవర్గంలో కాపు కల్యాణ మండపాలకు తెదేపా హయాంలో నిధులు మంజూరయ్యాయి. అన్నిచోట్లా పనులు పునాది దశ వరకు వచ్చాయి. గ్రామాల్లో కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు మొదలయ్యాయి. గుత్తేదారులకు నిధులు చెల్లించక పనులు చేపట్టలేదు. వైకాపా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే భవనాలు పూర్తి కాలేదు. రాబోయే ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పేందుకు కాపులంతా సిద్ధంగా ఉన్నాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని