logo

ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్‌

రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు.

Published : 25 Apr 2024 05:38 IST

పేపరుమిల్లు ప్రధాన ద్వారం వద్ద మోహరించిన పోలీసులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ప్రధాన ద్వారం వద్ద పోలీసులు మోహరించారు. లోపలి వారిని బయటకు, బయట వారిని లోపలికి రాకుండా గేటు మూసివేశారు. పాత వేతన ఒప్పందం 2020 జూన్‌ 30తో ముగియడంతో కొత్తవేతన ఒప్పందం చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు దఫదఫాలుగా ఆందోళనలు చేస్తూ వచ్చారు. గతనెల 26న సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 2 నుంచి సుమారు 2,800 మంది సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో ఈ నెల 4న కార్మికశాఖ ఏలూరు జాయింట్‌ కమిషనర్‌(జేసీఎల్‌) ఎ.రాణి మాట్లాడినా ఫలితం లేకపోవడంతో 8న యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించేందుకు నిర్ణయించినప్పటికీ వాయిదా పడింది. మళ్లీ 12న రాజకార్మికశాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయంలో చర్చలు జరిపినప్పటికీ యాజమాన్యం సానుకూలంగా లేకపోవడంతో సఫలం కాలేదు. మరుసటి రోజు కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ జగదీష్‌ సమక్షంలో చర్చలు జరిపారు. మిల్లు యాజమాన్య ప్రతినిధుల్లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హాజరు కాకపోవడం.. కొత్తవేతన ఒప్పందం, ఇతర డిమాండ్ల పరిష్కారంపై స్పష్టత ఇవ్వకపోవడంతో చర్చలను వాయిదా వేశారు. ఇటీవల సమస్యను కార్మికులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. ఈ లోగా యాజమాన్యం లాకౌట్‌ ప్రకటిస్తూ నోటీసు బోర్డులో పెట్టడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ లాకౌట్‌ ఎత్తివేయాలి: ఓబులేసు: పేపరుమిల్లుకు అర్ధాంతరంగా లాకౌట్‌ ప్రకటించడం దుర్మార్గమని, తక్షణం ఎత్తివేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారం కోసం కార్మికశాఖ అధికారులు చర్చలు జరిపినప్పటికీ స్పందించని యాజమాన్యం ఇప్పుడు లాకౌట్‌ ప్రకటిస్తున్నామంటూ నోటీసు బోర్డులో పెట్టిందన్నారు. ముందుగా నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా కనీసం కార్మిక సంఘాలకు సమాచారం ఇవ్వకుండా లాకౌట్‌ ప్రకటించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు