logo

మెరుగైన జీవన శైలితోసంపూర్ణ ఆరోగ్యం

మెరుగైన జీవన శైలి, క్రమశిక్షణ కలిగిన ఆహార అలవాట్లతో రోగాలకు దూరంగా ఆరోగ్యంతో జీవించవచ్చని వైద్యులు బిట్రా అశోక్‌కుమార్‌, ఎం.రాజ్యలక్ష్మి సూచించారు. రాజమహేంద్రవరంలోని జేఎన్‌ రోడ్డులో గల ఏకేసీ రోటరీ రివర్‌ సిటీ హాలులో ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో శనివారం గుండె సంబంధిత, బీపీ, కొవిడ్‌ అనంతర అనారోగ్య సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

Published : 25 Sep 2022 03:16 IST

‘ఈనాడు-ఈటీవీ’ అవగాహన సదస్సులో వక్తలు

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

సూచనలిస్తున్న డాక్టర్‌ రాజ్యలక్ష్మి, వేదికపై డాక్టర్‌ అశోక్‌ కుమార్‌, ఈనాడు యూనిట్‌ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్‌ప్రసాద్‌

మెరుగైన జీవన శైలి, క్రమశిక్షణ కలిగిన ఆహార అలవాట్లతో రోగాలకు దూరంగా ఆరోగ్యంతో జీవించవచ్చని వైద్యులు బిట్రా అశోక్‌కుమార్‌, ఎం.రాజ్యలక్ష్మి సూచించారు. రాజమహేంద్రవరంలోని జేఎన్‌ రోడ్డులో గల ఏకేసీ రోటరీ రివర్‌ సిటీ హాలులో ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో శనివారం గుండె సంబంధిత, బీపీ, కొవిడ్‌ అనంతర అనారోగ్య సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్‌ప్రసాద్‌ సదస్సు ప్రారంభించారు. వైద్యులు పవర్‌ పాయింట్‌ ప్రజటేషన్‌ ద్వారా సూచనలు చేశారు. గుండె, బ్రెయిన్‌ స్ట్రోక్‌ రాకముందు, వచ్చిన తరువాత ఉండే లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలను వివరించారు. సదస్సు అనంతరం ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

అప్రమత్తతే శ్రీరామరక్ష

కొవిడ్‌ తరువాత చాలామందిలో ఆరోగ్య సమస్యలొస్తున్నాయని, ఎక్కువగా నరాలు, ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ తదితర అవయువాలపై ప్రభావం చూపుతోందని వైద్యురాలు ఎం.రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కొవిడ్‌ అనంతరం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వైద్యుడిని సంప్రదించాలన్నారు. స్థూలకాయం, గుండె సమస్యలు, బీపీ, మధుమేహం ఉన్నవారిలో రెండు వారాల కంటే అధికంగా వైరస్‌ లక్షణాలుంటాయన్నారు. కొవిడ్‌ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువని, తీవ్రమైన తలనొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలన్నారు.

సదస్సుకు హాజరైన ప్రజలు

వ్యాయామంతో గుండె జబ్బులు దూరం

నిరంతర వ్యాయామంతో గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చని వైద్యుడు బి.అశోక్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం అన్ని వయసుల వారికీ గుండె సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పొగ తాగడం పూర్తిగా ఆపేయకపోతే గుండెలో పంపింగ్‌ వ్యవస్థలో బ్లాకులు ఏర్పడి గుండెపోటు వచ్చే ప్రమాదముందన్నారు. ఒకసారి గుండె పోటు వచ్చినవారు నిరంతరం పరీక్షలు చేయించుకుని వైద్యుడి సూచనల మేరకు ఏరోబిక్‌ కసరత్తులు చేస్తే మంచిదన్నారు. సమతుల ఆహారం తీసుకోవడంతోపాటు ప్రొటీన్లు, విటమిన్లు తగినన్ని ఉండేలా చూసుకోవాలన్నారు. పొట్టపైనుంచి తల వరకు ఏ ప్రాంతంలో అధికంగా నొప్పి, భారంగా.. ఆయాసంగా ఉంటే గుండె నొప్పిగా భావించవచ్చన్నారు. ఒత్తిడితో బీపీ పెరిగితే రక్తం గడ్డకట్టి సరఫరా సక్రమంగా లేక గుండె ఆగిపోయే ప్రమాదముందన్నారు. మధుమేహం ఉన్నవారికి గుండె సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉందన్నారు. మహిళల కన్నా పురుషుల్లో హార్ట్‌ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువన్నారు.


ఎంతో ఉపయుక్తం

‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో అనేక విషయాలు తెలుసుకున్నాం. కొవిడ్‌ అనంతరం వస్తున్న సమస్యలు, వ్యాధి ముదరకముందే వాటి నుంచి ఎలా బయట పడాలో వంటివి తెలుసుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. తెరపై అవయవాల బొమ్మలను చూపిస్తూ వైద్యులు గుండె, కొవిడ్‌ అనంతరం వచ్చే ఇబ్బందుల గురించి వివరించడం ద్వారా బాగా అవగాహన ఏర్పడింది.

-జీఎన్‌ మూర్తి, రాజమహేంద్రవరం


అవగాహన అభినందనీయం

యాభై ఏళ్లు దాటిన వారికి అధికంగా వచ్చే గుండె సమస్యలపై నిపుణులతో అవగాహన కల్పించడం అభినందనీయం. గుండె నొప్పి ఎలాంటప్పుడు వస్తుంది.. కారణాలు.. దాని లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను చక్కగా వివరించారు. ఒకప్పుడు గుండె నొప్పి ఉన్నవారు కసరత్తులు చేస్తే మళ్లీ స్ట్రోక్‌ వస్తుందేమోననే అపోహ ఉండేది. ప్రస్తుతం అది తొలగిపోయింది. బరువులు ఎత్తే వ్యాయామం మినహా అన్ని రకాల కసరత్తులు చేసుకోవచ్చని వైద్యులు వివరించారు.

-చంద్రబోసు, నిడదవోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని