logo

ముద్దచర్మ వ్యాధిపై ఆందోళన వద్దు

పాడి రైతులను ముద్ద చర్మ (లంపి స్కిన్‌) వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. ఆవులు, గేదెలకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి సోకిన పశువులు తీవ్ర జ్వరానికి లోనవుతాయి.

Published : 03 Oct 2022 05:47 IST

పశుసంవర్థక శాఖ జేడీ సూర్యప్రకాశరావు

కాకినాడ నగరం, పెద్దాపురం: పాడి రైతులను ముద్ద చర్మ (లంపి స్కిన్‌) వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. ఆవులు, గేదెలకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి సోకిన పశువులు తీవ్ర జ్వరానికి లోనవుతాయి. ఆహారం తినడం మానేస్తాయి. దీంతో పాల ఉత్పత్తి తగ్గిపోవడంతోపాటు ఒక్కోసారి పశువులు తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యాధి తీవ్రత, నివారణకు తీసుకుంటున్న చర్యలపై కాకినాడ జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ ఎస్‌.సూర్యప్రకాశరావుతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి చేసింది.

న్యూస్‌టుడే: వ్యాధి తీవ్రత ఎలా ఉంది?

జేడీ: ఈ వ్యాధి లక్షణాలను పశువుల్లో మొదటిగా ఉత్తరభారత దేశంలోని రాజస్థాన్‌, బిహార్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో గుర్తించారు. మన రాష్ట్రానికి సంబంధించి విజయనగరంలో 4, శ్రీకాకుళంలో 2, విశాఖ జిల్లాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా తెల్ల ఆవుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఎలా వ్యాప్తి చెందుతుంది..?

వ్యాధి సోకిన పశువులపై వాలిన ఈగలు, దోమలు, జోరీగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందుకే కొత్తగా పశువులను కొనుగోలు చేయకుండా కట్టడి చేశాం.

లంపి స్కిన్‌కు వ్యాక్సిన్‌ వేస్తున్న పశువైద్య అధికారులు

వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన తక్షణ నివారణ చర్యలేంటీ?

ముద్ద చర్మ వ్యాధి సోకిన పశువులకు విపరీతంగా జ్వరం వస్తుంది. శరీరం, పొదుగుపై బొమ్మలు (పొక్కులు), కళ్లు, ముక్కు నుంచి ద్రవాలు వస్తాయి. పాల దిగుబడి తగ్గుతుంది. వ్యాధి సోకిన పశువు చర్మంపై పసుపు, వేప నూనె కలిపి రాయాలి. సమీపంలో ఉన్న ఆర్బీకేల్లో పశువైద్య సహాయకులను కలిసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా?

ప్రస్తుతం జిల్లాలో 65 వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 65 శాతం పశువులకు వేశాం. వ్యాక్సిన్లు కోసం సమీప ఆర్బీకేల్లో పశువైద్య సహాయకులు, పశువైద్య ఆసుపత్రుల్లో సంప్రదించాలి.

నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలు ఏంటి?

వ్యాధి సంక్రమించకుండా జిల్లాలో ముందు జాగ్రత్తగా పశు సంతలు మూయించి వేశాం. ఇతర జిల్లాల పశువులు రానీయకుండా ప్రత్యేకంగా చెక్‌ పోస్టులు పెట్టి కట్టడి చేస్తున్నాం. కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఎస్పీ, ఆర్డీవోలు, డీపీవో, మార్కెటింగ్‌ శాఖ ఏడీ, పశుసంవర్థక శాఖ జేడీ, డీడీలతో పర్యవేక్షక కమిటీని నియమించారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు వ్యాధి పరిస్థితిపై పర్యవేక్షిస్తోంది. మండలానికి రెండు బృందాల చొప్పున 42 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ నియమించారు. ఒక్కో బృందంలో ఒక పశు వైద్యుడు, అయిదుగురు పశు వైద్య సహాయకులు, ఒక పారా మెడికల్‌ సిబ్బంది ఉంటారు. వీరంతా గ్రామాల్లో పర్యటించి వ్యాధిపై అవగాహన కల్పించటంతో పాటు చికిత్సకు చర్యలు తీసుకుంటారు.

జిల్లాలో పాల ఉత్పత్తి, ధరల పరిస్థితి ఎలా ఉంది?

జిల్లాలో రోజుకు 1.50 లక్షల నుంచి 1.60 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి వస్తోంది. ఇందులో స్థానిక వినియోగం పోను లక్ష లీటర్లకు పైగా జగనన్న పాల వెల్లువ, ఇతర కేంద్రాలకు విక్రయిస్తున్నారు. 11 శాతం వెన్న ఉన్న పాల ధర లీటరు రూ.84 చొప్పున ఆమూల్‌ సంస్థ కొనుగోలు చేస్తోంది. దీంతో మిగతా డెయిరీ సంస్థలు కూడా అవే ధరలకు పాలను కొనుగోలు చేయటంతో రైతులకు గిట్టుబాటు అవుతోంది.

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts