logo

మహిళల ఆర్థిక స్వావలంబనకు రూ.2 వేల కోట్లు

జిల్లాలోని గ్రామీణ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి చెప్పారు. ఈ ఏడాది రూ.2 వేల కోట్ల రుణాలు అందించి ఆర్థికంగా వారిని పరిపుష్టి చేయడమే లక్ష్యమన్నారు.

Published : 28 Nov 2022 05:47 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని గ్రామీణ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి చెప్పారు. ఈ ఏడాది రూ.2 వేల కోట్ల రుణాలు అందించి ఆర్థికంగా వారిని పరిపుష్టి చేయడమే లక్ష్యమన్నారు. అర్హత ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల కల్పనతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా సమకూరే లబ్ధితో జీవనోపాధులు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి మహిళ నెలకు కనీసం రూ.10వేలు ఆదాయం పొందేలా ఏర్పాట్లు చేస్తున్నామని, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో పట్టాలు పొందిన సంఘాల సభ్యులకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. సుమారు రూ.50 లక్షల పెట్టుబడితో మాల్స్‌ ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలోని 40 వేల డ్వాక్రా సంఘాల్లోని 80 వేల మంది గ్రామీణ మహిళలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే పథకాలు, ప్రగతిపై డీఆర్‌డీఏ పీడీ శ్రీరమణి ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో వెల్లడించారు.

టీపొడి, కారం వ్యాపారం చేస్తున్న సామర్లకోట మండల మహిళా సమాఖ్య

న్యూస్‌టుడే: బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాలు ఎప్పటికి పూర్తి చేస్తారు?

డీఆర్‌డీఏ పీడీ : ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.1,000 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు కల్పించాలని లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకు 10,432 సంఘాలకు రూ.650 కోట్ల మేర రుణాలు అందించాం. నాలుగు నెలల్లో లక్ష్యాన్ని అధిగమిస్తాం. ఈ రుణాలు స్వయం ఉపాధికి వినియోగించేలా క్షేత్రస్థాయిలో చైతన్యం తీసుకొస్తున్నాం.

మహిళా మార్ట్‌లను ఏవిధంగా తీర్చిదిద్దుతారు..?

మహిళల పొదుపు చేసిన డబ్బుల్లో కొంత మొత్తంతో కార్పొరేట్‌ సంస్థల స్థాయిలో మార్ట్‌లను ఏర్పాటు చేస్తున్నాం. రూ.50 లక్షలు పెట్టుబడి నిధితో వీటిని నెలకొల్పుతున్నాం. ఇప్పటికే ఉప్పాడతో ఏర్పాటు చేశాం. త్వరలో తొండంగి మండలం, ఎ.కొత్తపల్లి, తాళ్లరేవులో వీటిని ఏర్పాటు చేయనున్నాం. వీటిని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.

జగనన్న కాలనీల్లో స్థలాలు పొందినవారికి ఎప్పటిలోగా రుణాలు అందిస్తారు?

జిల్లాలో 35 వేల మంది డ్వాక్రా మహిళలకు పట్టాలిచ్చారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఇప్పటి వరకు 22,087 మందికి రూ.35 వేల చొప్పున పావలా వడ్డీ రుణాలు అందజేశాం. మిగతావారికీ త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

స్త్రీనిధి రుణాలు ఇవ్వడంలో జాప్యమెందుకు?

ప్రతి సంఘంలోని 8 మందికి ఈ బ్యాంకు ద్వారా ఒక్కొక్కరికి రూ.60 వేలు చొప్పున రుణం ఇస్తున్నాం. 36 వేల మందికి రూ.178.29 కోట్లు రుణ లక్ష్యం కాగా.. ఇప్పటికి 14,240 మందికి రూ.61.67 కోట్లు మేర రుణాలు అందజేశాం.

మండల సమాఖ్యలను వ్యాపార రంగంలో ఎలా ప్రోత్సహిస్తున్నారు?

ప్రతి మండల సమాఖ్య ద్వారా వ్యాపారాలు చేయించాలని నిర్ణయించాం. ఇప్పటికే సామర్లకోట, పెద్దాపురం, జగ్గంపేట మండల సమాఖ్యలు వ్యాపారాలు ప్రారంభించాయి. తొలుత రూ.5 లక్షల వ్యయంతో వీటిని నిర్వహిస్తున్నారు. టీపొడి, కారం, వస్త్రాలు, మసాల సామగ్రి తయారు చేస్తున్నారు. మరిన్ని సమాఖ్యలకు తోడ్పాటును అందిస్తాం.

చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల్లో ఎంత మందితో వ్యాపారాలు చేయిస్తున్నారు?

జిల్లాలో మూడు విడతలుగా లక్ష మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఒక్కొక్కరికి రూ.56,250 చొప్పున చేయూత పథకంలో లబ్ధి చేకూరింది. వీరిలో 21,755 మంది వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చారు. వీరితో కిరాణా, ఫ్యాన్సీ, హోటల్‌, తదితర వ్యాపారాలు చేయిస్తున్నాం. వీరికి అదనంగా బ్యాంకు రుణం అందించేందుకు కృషి చేస్తున్నాం.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎందుకు అమలు చేయడంలేదు?

కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీతో పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు కల్పిస్తోంది. పీఎం ఫార్మనైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రొసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా గరిష్ఠంగా రూ.50 లక్షలు, కనిష్ఠంగా రూ.25 లక్షల వరకు యూనిట్లు మంజూరు చేయనున్నారు. కానీ మహిళలు రూ.10 లక్షలు, రూ.15 లక్షల యూనిట్ల ఏర్పాటుకే ముందుకు వస్తున్నారు. వీరికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. కేంద్రం ఈ పథకం కింద 35 శాతం రాయితీ కల్పిస్తోంది.

జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు ఎటువంటి తోడ్పాటు ఇస్తున్నారు?

పీడీ : జిల్లాలో ఈ ఏడాది జగనన్న తోడు పథకం కింద 10,995 మందికి రుణాలు కల్పించాలని లక్ష్యంగా చేసుకున్నాం. బ్యాంకు ద్వారా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ఇప్పటి వరకు 10,454 మంది చిరువ్యాపారులకు రుణాలు కల్పించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని