logo

WhatsApp: ఫోన్‌ పోయిందా..హాయ్‌ అని వాట్సాప్‌ చేయండి..

మొబైల్‌ చోరీకి గురైందా..? ఆదమరుపులో ఎక్కడైనా వదిలేశారా..? ఎక్కడైనా పోగొట్టుకున్నారా..? ఇకపై కంగారు పడాల్సిన అవసరం లేదు.

Updated : 09 Feb 2023 08:14 IST

మొబైల్‌ చోరీ కేసుల ఛేదనకు పోలీసుల కొత్త విధానం

న్యూస్‌టుడే, కంబాలచెరువు(రాజమహేంద్రవరం): మొబైల్‌ చోరీకి గురైందా..? ఆదమరుపులో ఎక్కడైనా వదిలేశారా..? ఎక్కడైనా పోగొట్టుకున్నారా..? ఇకపై కంగారు పడాల్సిన అవసరం లేదు. పోలీసుస్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేయాల్సిన పని లేదు. మీ సేవలో ఫిర్యాదు చేసిన రసీదు, ఫోన్‌కు సంబంధించిన వివరాలు దగ్గర పెట్టుకుని హెల్ప్‌ లేదా హాయ్‌ వాట్సాప్‌ సందేశం పంపితే చాలు.. మొత్తం మొబైల్‌ నుంచే ఫిర్యాదు చేయవచ్చు. చాట్‌బాట్‌ పేరిట కొత్త విధానాన్ని జిల్లా పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. వివరాలను ఇన్‌ఛార్జి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి బుధవారం వెల్లడించారు.

పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా కేవలం ఒక్క వాట్సాప్‌ సందేశంతో పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లకు సంబంధించి ఫిర్యాదుకు పోలీసులు ఈ విధానం అందుబాటులోకి తెచ్చారు. మొబైల్‌ పోగొట్టుకున్నవారు 94932 06459 నంబరుకు వాట్సాప్‌లో హెచ్‌ఐ(హాయ్‌), లేదా హెచ్‌ఈఎల్‌పీ(హెల్ప్‌) అని సందేశం పంపితే తూర్పుగోదావరి జిల్లా పోలీసు పేరున ఒక లింకు వస్తుంది. అందులో క్లిక్‌ చేసి వివరాలన్నీ నమోదు చేస్తే ఫిర్యాదు స్వీకరిస్తారు. ఫోన్‌ గుర్తించిన తరువాత నమోదు చేసిన వివరాల ఆధారంగా దానిని బాధితులకు ఇవ్వనున్నారు.


గూగుల్‌ లింకులో ఇవి కీలకం: వాట్సాప్‌లో హెల్ప్‌ అని సందేశం పంపిన తరువాత వచ్చిన లింకు క్లిక్‌ చేయగానే ఒక ఫారం కనిపిస్తుంది. 1.ఈ-మెయిల్‌ ఐడీ, 2.ఫిర్యాదుదారు పేరు, 3. చిరునామా, 4.ఫోన్‌ చోరీ/పోగొట్టుకున్న తేదీ, సమయం, చోరీ అయిన స్థలం, 5.మొబైల్‌ ఫోన్‌ పోయిన విధానం, 6.ఫిర్యాదు దారుని పోలీసుస్టేషన్‌ పరిధి, 7.ఫోన్‌ కొనుగోలు చేసిన రసీదు/ఫోన్‌ బాక్సుపై ఐఎంఈఐ నంబరు ఫొటో, 8.ఐఎంఈఐ నంబరు, 9. మీసేవాలో ఫిర్యాదు చేసిన రసీదు, 10.ఫిర్యాదుదారుని ఏదైనా గుర్తింపు పత్రం, 11.పోయిన ఫోన్‌ నంబరు, 12. పోయిన మొబైల్‌ ఫోన్‌ మోడల్‌, కంపెనీ, రంగు, 13.  ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తిని సంప్రదించే ఫోన్‌ నంబరు.. ఈ వివరాలను నమోదు చేశాక చివర్లో సబ్మిట్‌  చేయాలి. పోలీసులు దీనిపై విచారణ చేసి రికవరీలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని