logo

అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కేంద్రం

నూతనంగా అభివృద్ధి చేస్తున్న అధ్యాపకుల శిక్షణ కేంద్రం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Published : 20 Mar 2023 05:33 IST

ఆర్ట్స్‌ కళాశాల ఎన్‌సీసీ బ్లాక్‌ ఆధునికీకరణ
న్యూస్‌టుడే, దేవీచౌక్‌

నూతనంగా అభివృద్ధి చేస్తున్న అధ్యాపకుల శిక్షణ కేంద్రం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం కళాశాలలోని ఎన్‌సీసీ బ్లాక్‌కు మరమ్మతులు చేసి శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం చేపట్టిన ఆధునికీకరణ పనులు పూర్తి కావొచ్చాయి. కళాశాలలో గదుల కొరత కారణంగా దీనిని తరగతి గదులుగా వినియోగించాలని తొలుత ఆలోచించారు. తర్వాత కమిషనరేట్‌ సూచనల మేరకు అధ్యాపకుల శిక్షణ కోసం వినియోగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నాలుగు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో ఇదొకటి.

ఇక్కడే వసతి..

నోడల్‌ రిసోర్స్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌సీ)గా ఉన్న కళాశాలలో ఇప్పటికే పది శిక్షణ తరగతులు జరిగాయి. అందులో అయిదు రెసిడెన్షియల్‌, అయిదు నాన్‌ రెసిడెన్సియల్‌ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధ్యాపకులకు ప్రస్తుతం హోటల్స్‌లో వసతి ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఖర్చు తగ్గించుకునేందుకు వసతితో కూడిన శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కళాశాలకు చెందిన అధ్యాపకుడైనా ఇక్కడ శిక్షణ పొందవచ్చు.

ఎన్‌ఆర్‌సీ పరిధిలో ఉన్న 13 ప్రభుత్వ కళాశాలలకు చెందిన అధ్యాపకులకు అవకాశం కల్పిస్తున్నారు. సుమారు రూ.51 లక్షలతో తీర్చిదిద్దుతున్న ఈ భవనంలో 18 గదులతోపాటు రెండు మినీ సెమినార్‌ హాల్స్‌, పరిపాలన కార్యాలయం, డైరెక్టర్‌ కార్యాలయం అందుబాటులోకి రానున్నాయి. ఈ శిక్షణ కేంద్రంలో 17 లైఫ్‌ స్కిల్స్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకుల్లో అదనపు విజ్ఞానం పెంపొందించే విధంగా శిక్షణ ఉంటుంది. ఇప్పటికే ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు కాగా, ఆ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే విద్యా
సంవత్సరం నుంచి ఈ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తుందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సీహెచ్‌ కృష్ణ తెలిపారు.

ఎన్‌ఆర్‌సీ పరిధిలో కళాశాలలు

రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్‌ కళాశాల, కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలమూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల, ఎస్‌కేఆర్‌ మహిళా కళాశాల, రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిడదవోలు వీఆర్‌కే కళాశాల, నిడదవోలు ఎస్‌వీడీ మహిళా కళాశాల, కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని