logo

నేడు గొప్పలు.. నేడు తిప్పలు

అక్షర కోవెలకు చక్కటి సొబగులు.. ఇంటిని తలపించే ఆహ్లాద వాతావరణం.. తద్వారా సమర్థ బోధనకు నాడు-నేడు పథకంతో శ్రీకారం చుట్టామని పాలకులు ఊదర గొడుతున్నా.. అందుకు భిన్నమైన పరిస్థితులు క్షేత్రంలో కనిపిస్తున్నాయి.

Published : 01 Apr 2023 05:20 IST

అక్షర కోవెలకు చక్కటి సొబగులు.. ఇంటిని తలపించే ఆహ్లాద వాతావరణం.. తద్వారా సమర్థ బోధనకు నాడు-నేడు పథకంతో శ్రీకారం చుట్టామని పాలకులు ఊదర గొడుతున్నా.. అందుకు భిన్నమైన పరిస్థితులు క్షేత్రంలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా నిర్మాణాలకు సిమెంట్‌ కొరత వెంటాడుతోంది. కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో నిధులు అందక పనులు నిలిచిపోతే... మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణ సామగ్రి అందుబాటులో లేదు. మరికొన్నిచోట్ల అదనపు పాఠశాలల భవనాలు అర్ధాంతరంగా నిలిచి సరైన వసతుల్లేక విద్యార్థులు ఆరుబయట, వరండాల్లో చదవాల్సి వస్తోంది. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నా అధికారులు... అవసరమైన మేర సామగ్రి దరి చేర్చని వేళ ఇబ్బందులు తప్పడం  లేదు. 10 రోజులుగా నాడు-నేడు రెండో దశ పనుల బిల్లులు చెల్లింపులు జరుగుతున్నా నిర్మాణ సామగ్రి కొరత వెంటాడుతోంది. వీటి గురించి ఇంజినీరింగ్‌ అధికారులను ప్రధానోపాధ్యాయులు అడుగుతుంటే అదిగో.. ఇదిగో అని కాలయాపన చేస్తున్నారే తప్ప సమకూర్చడం లేదని వాపోతున్నారు.

ఈనాడు, రాజమహేంద్రవరం,
న్యూస్‌టుడే, కాకినాడ నగరం, పిఠాపురం


నిధులున్నా.. సిమెంటు లేదు...

ముమ్మిడివరం బళ్లగేటు సెంటర్‌ పాఠశాలలో ఆరు నెలులుగా వినియోగించని సిమెంటు బస్తాలు

అల్లవరం మండలంలో ఓ జడ్పీ ఉన్నత పాఠశాలకు నిరుడు ఆగస్టులో రావాల్సిన రూ.13.51 లక్షలు వారం కిందట జమయ్యాయి. ఈ నిధులతో పనులు ప్రారంభిద్దామని ఇంజినీరింగ్‌ అధికారులను సిమెంటు సరఫరా చేయాలని కోరగా.. గోదాములో నిల్వలు సిద్ధంగా లేవని, మరో పాఠశాల వద్ద మొదటి విడతలో పంపిణీ చేసిన సిమెంటు ఉందని.. తెప్పించుకుని పని ప్రారంభించమని సూచించారు. ఇప్పటికే ఆ సిమెంటు గడ్డకట్టుకు పోయి నిరుపయోగంగా ఉందనీ.. దాంతో పనులు ఎలా ప్రారంభించాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాపోతున్నారు.


నాలుగు నెలలుగా బిల్లుల్లేవ్‌..

పిఠాపురం: ఓబీఎస్‌ పాఠశాలలో తుప్పు  పట్టిన ఇనుము, ఇసుక

పిఠాపురం పురపాలికలో నాడు-నేడు పనులు నత్తను తలపిస్తున్నాయి. నాలుగు నెలలుగా బిల్లులు అందక పనులు నిలిచి పిల్లలకు అవస్థలు తప్పడం లేదు. పిఠాపురంలో ఓబీఎస్‌ మున్సిపల్‌ పాఠశాలలో ఎనిమిది అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.95.99 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో ఆరు గదుల నిర్మాణమే జరుగుతోంది. ఇప్పటికి రూ.20.03 లక్షల పనులు జరుగ్గా రూ.10 లక్షల బిల్లు బకాయి ఉంది. నిర్మాణానికి తెచ్చిన ఇనుము తుప్పు పడుతుండగా.. అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

నిధులు ఇవ్వడం లేదండి

గోకవరం జడ్పీఉన్నత పాఠశాలలో కొలిక్కిరాని అదనపు గదుల నిర్మాణ పనులు

గోకవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.96 లక్షలతో ఎనిమిది తరగతి గదుల నిర్మాణాన్ని గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించినా నేటికీ పూర్తికాలేదు. కొన్ని నెలలుగా నిధులు రాకపోవడంతో పనులు నిలిపివేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మేరకు వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాబార్డు నిధులతో చేపట్టిన అదనపు తరగతి గదులదీ ఇదే పరిస్థితి.


రూపాయి రాక ఇలా...

నాడు - నేడు పనులకు ఇచ్చే నిధుల్లో 30 శాతం మేర లేబర్‌, మెటల్‌కు.. ఇతర 70 శాతం నిర్మాణ సామగ్రికి కేటాయిస్తున్నారు. 30 శాతం సొమ్ము మాత్రమే నేరుగా పాఠశాల ఖాతాలో జమ అవుతుంది. నిర్మాణ సామగ్రికి కేటాయించిన 70 శాతం నిధులు నిర్దేశిత సంస్థలకు వెళ్తాయి. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు 15 రోజులు ముందుగా ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పెడితే.. సామగ్రి సరఫరా చేస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నా.. క్షేత్రంలో ఆ ఊసే లేదు. సకాలంలో ఇసుక, సిమెంటు, ఇనుము ఇతర సామగ్రి
రాకపోవడం, అవి చేరాక బిల్లులు కాకపోతే ఆ సామగ్రి పాడవడం పరిపాటిగా మారింది.


ప్రత్యేక దృష్టిసారిస్తాం...

నాడు నేడు పనులకు సిమెంట్‌ సమస్య ఉన్న వాస్తవమే. పనుల పురోగతిపై ఇప్పటికే కలెక్టర్‌ సమీక్షించి పలు సూచనలు చేశారు. పాఠశాలల వారీగా సిమెంట్‌ ఎక్కడ ఎంత మేర అవసరమో ఇండెంట్‌ ఇస్తే త్వరతిగతిన తెప్పించేందుకు చర్యలు తీసుకుటాం. మేమూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి పనులు వేగవంతం చేస్తాం. నిధులు ఎప్పటికప్పుడు మంజూరవుతున్నాయి.

కె.అన్నపూర్ణ, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ


కాకినాడ జిల్లాలో..  

రెండో విడత ఎంపికైన పాఠశాలలు : 776
పనుల సంఖ్య: సుమారు 1,100
నిధుల మంజూరు: రూ.322 కోట్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు