logo

ఈతకు వెళ్లి అనంత లోకాలకు..

సరదాగా స్నేహితులతో కలిసి కోనేరులో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలో చోటుచేసుకుంది.

Published : 01 Apr 2023 05:20 IST

పదో తరగతి విద్యార్థి విషాదాంతం

సాయిదుర్గ

జి.మామిడాడ (పెదపూడి): సరదాగా స్నేహితులతో కలిసి కోనేరులో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.మామిడాడ జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో పేలూరి సాయి దుర్గ(16) పదోతరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రూపు ఫొటో కార్యక్రమం తరువాత 11 గంటల సమయంలో స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఇంటిలో తమ పుస్తకాల సంచులు పెట్టి స్థానిక కోదండ రామాలయం కోనేరు వద్దకు చేరుకున్నారు. తోటి విద్యార్థులతో కలిసి సాయిదుర్గ కోనేటిలో ఈతకొట్టి మెట్లపై కూర్చున్నాడు. అతనితో వెళ్లిన స్నేహితులు ఇంటికి వచ్చేశారు. అనంతరం కోనేట్లో సాయిదుర్గ మునిగిపోతున్నాడంటూ కేకలు వినిపించడంతో అక్కడున్న మరో ఇద్దరు విద్యార్థులు అతడిని బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం సాయిదుర్గ తల్లిదండ్రులకు తెలియజేయగా వారు బంధువులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికితోడు, తోటి విద్యార్థులే ఇంటి నుంచి కోనేరుకు తీసుకెళ్లి చంపేశారంటూ సాయిదుర్గ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాకమిటీ ఏం చేస్తోంది? విద్యార్థులను ఎందుకు బయటకు పంపారని ప్రధానోపాధ్యాయుడు కోరాడ శ్రీనివాస్‌, ఉపాధ్యాయులను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో మృతుని తల్లిదండ్రులు పేలూరి వెంకన్న, దుర్గ బంధువులతో కలిసి జడ్పీ బాలుర పాఠశాల వద్ద రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ మూడు గంటలపాటు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పెదపూడి ఎస్సై పి.వాసు పాఠశాల వద్దకు చేరుకుని సాయిదుర్గ స్నేహితులను విచారించారు. ఇంతలో కాకినాడ రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, మండల ఇన్‌ఛార్జి విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారిణి అన్నపూర్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. మృతుని తండ్రి పేలూరి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వాసు తెలిపారు.

‘స్నేహితులే నా కొడుకును చంపేశారు’


రోడ్డుపై మృతదేహంతో నిరసన తెలుపుతున్న విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు

సాయిదుర్గను స్నేహితులే ఇంటి నుంచి తీసుకెళ్లి చంపేశారంటూ తల్లిదండ్రులు పేలూరి వెంకన్న, దుర్గలు ఆరోపించారు.  పాఠశాలలో ఫొటో తీసుకుంటానంటూ మంచి దుస్తులు వేసుకుని వెళ్లి ఇంటికి వచ్చిన తన కుమారుడిని కోనేరు వద్దకు తీసుకెళ్లి  ఈత పేరుతో చంపేసి చెరువులో మునిగిపోయాడంటూ అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. ఒంటిపై గాయాలు ఉన్నాయని, వాటి సంగతి తేల్చాలని వెంకన్న డిమాండ్‌ చేశారు. తమ కొడుక్కి ఈత వచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరై మంచి మార్కులతో పాసవుతాడని ఆనందపడే సమయంలో ఇలా జరిగిందని విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని