logo

పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టరు హిమాన్షుశుక్లా పేర్కొన్నారు.

Published : 06 Jun 2023 05:50 IST

సముద్ర తాబేళ్ల రక్షణకు ఫరీదా రూపొందించిన చిత్రాన్ని ఆవిష్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టరు హిమాన్షుశుక్లా పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లైఫ్‌ కార్యక్రమంలో భాగంగా కాట్రేనికోన మండలంలోని కందికుప్ప రిజర్వ్‌ అటవీ లైట్‌హౌస్‌ సమీపంలో జిల్లా అటవీశాఖాధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మడ అడవుల పెంపకంతో తీర ప్రాంత ఆవాసాల ఆర్థిక అభివృద్ధి(మిష్టి) ప్రారంభోత్సవంలో కలెక్టరు, ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రసంగం వర్చువల్‌గా వీక్షించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని అందరితో కలెక్టరు ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మన జిల్లాలోనే మడ అడవులు అధికశాతం విస్తరించి ఉన్నాయన్నారు. సుమారు 70 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందన్నారు. తీర గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఓఎన్‌జీసీ నిధులు, జల్‌జీవన్‌ మిషన్‌లో అనేక పనులు చేపట్టామన్నారు. మడ అడవులను పరిరక్షించుకోవాలన్నారు. జలాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కలవడంతో తీరగ్రామాల ప్రజలు ప్రభావితమవుతున్నారన్నారు. ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వాడకం తగ్గించడానికి ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నారు. యూఎన్‌డీపీ చేపట్టిన కార్యక్రమానికి రూ. 4.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వాటితో మడ అడవులు ఎంతమేర   ఉన్నాయో గుర్తించి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కోనసీమలోని వివిధ గ్యాస్‌ కంపెనీలు మడ అడవుల విస్తరణ, అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు ఇచ్చాయన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ ఫరీదా మాట్లాడుతూ మడ అడవులను రక్షించుకోవడం కర్తవ్యమని అన్నారు. ఎంపీ అనురాధ మాట్లాడుతూ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ విపత్తులు, తుపానుల వేళ తీరగ్రామాల ప్రజల్ని కాపాడేవి మడ అడవులేనన్నారు. కాశి బాలమునికుమారి, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని