logo

మత్తు ఊబిలో.. భవిత గాలిలో!

వ్యసనం యువతను దారి మళ్లిస్తోంది.. ఉన్నత లక్ష్యాలను గురితప్పేలా చేస్తోంది. మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థి దశ నుంచే కొందరు బానిసలవడం కలవరపెడుతోంది.

Updated : 08 Jun 2023 06:01 IST

యువతకు గంజాయి.. వ్యసనాల ఎర
అంతర్రాష్ట్ర మాఫియా అడ్డదారులన్నీ ఇక్కడే..
ఫలితమివ్వని నిర్మూలన చర్యలు
ఈనాడు, కాకినాడ; న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

వ్యసనం యువతను దారి మళ్లిస్తోంది.. ఉన్నత లక్ష్యాలను గురితప్పేలా చేస్తోంది. మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థి దశ నుంచే కొందరు బానిసలవడం కలవరపెడుతోంది. మత్తు మాఫియా వీరిని పావులుగా వాడుకుంటోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై దృష్టిసారించామని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా.. గంజాయి నిల్వలు తగలబెడుతూ మత్తు రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నం. ఆంధ్ర- ఒడిశా సరిహద్దులు (ఏవోబీ)తోపాటు.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం నుంచి గంజాయి నిల్వలు తరలివస్తున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో అక్రమ రవాణా, వినియోగం ప్రభావం ఇటీవల ఎక్కువైంది. నిర్మూలన చర్యలు ఫలితమివ్వడంలేదు.


మత్తు.. చిత్తు..

కోటనందూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న 250 కేజీల గంజాయి నిల్వలు (పాత చిత్రం)

దేశంలో మత్తులో జోగుతున్న 127 జిల్లాలను గతంలో ఓ సర్వే ద్వారా కేంద్రం గుర్తించింది. అందులో ఉమ్మడి తూర్పుగోదావరి కూడా ఉంది. గంజాయి, నల్లమందు, ఎండీఎంఏ ఇతరత్రాల ప్రభావం ఇక్కడుంది.
* గంజాయి మాఫియా సరకు అక్రమ రవాణాకు అమాయక గిరిజనాన్ని, పేదలను ఎన్నుకుంటోంది. అలానే యువతకు మత్తు, కాసుల ఎరచూపి ఊబిలోకి దింపుతోంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోంది.
* కాకినాడలోని ఓ కళాశాలలో ఫోరెన్సిక్‌ కోర్సు చదువుతున్న యువకుడు మొదట్లో గంజాయి అక్రమ రవాణాకు అలవాటు పడ్డాడు.. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయమై ఎండీఎంఏ డ్రగ్‌ను తెచ్చి విద్యార్థులకు విక్రయించే స్థాయికి ఎదిగాడు. సరకు తరలించే క్రమంలో 48.6 గ్రాముల మత్తుమందుతో పోలీసులకు చిక్కాడు.
* అమలాపురంలో గంజాయి మత్తులో ఉన్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. ముమ్మిడివరంలో గంజాయి చిల్లరగా అమ్ముతున్న ముమ్మిడివరం, ఆత్రేయపురం, రావులపాలెం ప్రాంతాల యువకులు గతంలో పోలీసులకు చిక్కారు. కాకినాడ పోలీసులు గతేడాది 15 ఎండీఎంఏ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలోని విద్యాలయాలు- వసతిగృహాల్లో తనిఖీలు, విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించడం గతి తప్పుతున్న పరిస్థితిని స్పష్టంచేస్తోంది.
* మత్తుకు బానిసలై ఒత్తిడి, అనారోగ్యానికి గురవడం.. చదువులో వెనుకబాటు, నేరాలకు పాల్పడటం వంటివి వెలుగుచూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ కింద అవగాహన చర్యలు చేపడుతోంది. బాధితులకు కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలోని వ్యసన విముక్తి కేంద్రాల్లో కౌన్సెలింగ్‌, వైద్యం అందిస్తున్నారు.


అంతా అడ్డదారే..

ఏలూరు రేంజి పరిధిలోని ఆరు జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలు (పాత చిత్రం)

* స్మగ్లర్ల ప్రోత్సాహంతో ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో గంజాయి విచ్చలవిడిగా సాగవుతోంది. ఈ నిల్వలు ఉమ్మడి విశాఖ మీదుగా తూర్పుగోదావరి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. * ఆపరేషన్‌ పరివర్తన పేరుతో పోలీసులు చేపట్టిన చర్యల వల్ల సాగుకు కొంత అడ్డుకట్ట పడినా.. ఒడిశా రాష్ట్రంలోని మారుమూల, మావో ప్రభావిత ప్రాంతాల్లో కట్టడి సాధ్యపడటంలేదు. మల్కన్‌గిరి జిల్లాలోని నిల్వలను పడవల్లో సీలేరు నది దాటించి మైదానంలోకి తెస్తున్నారు. ద్రవ, బిళ్లల రూపంలో గంజాయిని రూపు మార్చి హద్దులు దాటిస్తున్నారు. * నర్సీపట్నం- ఏలేశ్వరం.. నర్సీపట్నం- పాయకరావుపేట- తుని.. గోకవరం- రంపచోడవరం- మారేడుమిల్లి- భద్రాచలం మీదుగా ఎక్కువగా సరకు దాటుతోంది. అక్రమ వ్యాపారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల బాగా విస్తరించింది.


గంజాయి గుట్టు ఇదీ..

విద్యార్థులకు అమ్ముతున్నది ఇలాంటి పొట్లాల్లోనే..

* 3 రకాలు: ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో శీలావతి, రాజహంస (కల్లి), కలపత్రి (కాడ) రకాల గంజాయి సాగుచేస్తున్నారు. * 5 అంశాలు: గంజాయి అక్రమ వ్యాపారంలో సాగు.. ఉత్పత్తి.. నిల్వ.. రవాణా.. అమ్మకాలే కీలకం

* 11 మార్గాలు: ఏవోబీలో సాగవుతున్న గంజాయిని కాలినడకన, పడవలు, గాడిదలు, గుర్రాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, జీపులు, ట్రక్కులు, బస్సులు, రైలు మార్గాల్లో దాటిస్తున్నారు. * 16: గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఆంధ్రలోని పలు ప్రాంతాల వారితోపాటు.. తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా, కేరళ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, గుజరాత్‌, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన ముఠా సభ్యులను పోలీసులు వివిధ కేసుల్లో అరెస్టు చేశారు.

చిన్న చేపలే చిక్కుతున్నాయ్‌

ఉమ్మడి జిల్లా మీదుగా పలు రాష్ట్రాలకు గంజాయి నిల్వలు తరలిపోతున్నా.. పోలీసులకు చిక్కుతున్నది చిన్న చేపలే. అంతర్రాష్ట్ర ముఠాలకు స్థానిక రాజకీయ నాయకుల దన్ను ఉండడంతో వ్యవహారం అడ్డంకులు లేకుండా సాగిపోతుంది. అడపాదడపా సరకు తరలిస్తున్నవారు పట్టుబడుతున్నా అంతర్రాష్ట్ర ముఠాలు, తెరవెనుక సూత్రధారులు చిక్కడంలేదు.


కఠిన చర్యలు తీసుకుంటాం

గంజాయి తరలించినా, సేవించినా, అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటుచేశాం. విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టిసారించాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.

షేక్‌ ఖాదర్‌ బాషా, ఏఎస్పీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని