logo

Yanamala: జగన్‌ దృష్టిలో ‘నా’ అంటే నాశనం: యనమల

‘ముఖ్యమంత్రి జగన్‌ ప్రతి ప్రసంగంలోనూ నా ఎస్సీలు..నా బీసీలు..నా మైనార్టీలు అంటారు.. ఆయన దృష్టిలో ‘నా’ అంటే నాశనం.. ఆయా వర్గాలను నాశనం చేయడమే జగన్‌ లక్ష్యం’’ అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు.

Updated : 19 Nov 2023 07:40 IST

తెదేపాతోనే వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం
రాష్ట్ర బీసీ నేతల సమావేశంలో ప్రతినిధులు

మాట్లాడుతున్న యనమల.. వేదికపై బుద్ధా వెంకన్న, రెడ్డి సుబ్రహ్మణ్యం, వాసు, అనుశ్రీ సత్యనారాయణ, సతీష్‌

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, టి.నగర్‌: ‘ముఖ్యమంత్రి జగన్‌ ప్రతి ప్రసంగంలోనూ నా ఎస్సీలు..నా బీసీలు..నా మైనార్టీలు అంటారు.. ఆయన దృష్టిలో ‘నా’ అంటే నాశనం.. ఆయా వర్గాలను నాశనం చేయడమే జగన్‌ లక్ష్యం’’ అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. వెనుకబడిన వర్గాలంటే ఆ కుటుంబానికి చిన్నచూపన్నారు. రాజమహేంద్రవరంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన రాష్ట్ర బీసీ నాయకుల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తెదేపాకు బీసీలు వెన్నెముకని.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. బీసీలు సంఖ్యాపరంగా సుమారు 60 శాతం ఉన్నా.. ఆర్థిక దన్ను లేకపోవడంతో రాజకీయంగా ఎదగడం లేదన్నారు. చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించేందుకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని సూచించారు. ఆ బాధ్యత ఆయా కుల సంఘ నాయకులు తీసుకుని పోరాటాలు చేయాలని.. అందుకు తాము అండగా ఉంటామన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోకపోతే బడుగు బలహీనవర్గాలే నష్టపోతామన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలపై దాడులు, అక్రమ కేసులు పెరిగాయన్నారు. సమావేశంలో జనసేన నగర ఇన్‌ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ, భాజపా నాయకులు కురగంటి సతీష్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌, వివిధ పార్టీల నాయకులు, సామాజిక వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.


నిధుల్లేని కార్పొరేషన్లు ఎందుకు?
-రెడ్డి సుబ్రహ్మణ్యం, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్‌

జనగణన చట్టబద్దంగా చేయాలి. ఎన్నికలు వస్తుండటంతో రాష్ట్రంలో తూతూ మంత్రంగా ఓ యాప్‌ తయారుచేసి కులగణన చేస్తామని సీఎం చెబుతున్నారు. దీనికి చట్టబద్దత లేదు. 56 కార్పొరేషన్ల మంత్రి వేణుగోపాలకృష్ణ ఉన్నా.. ఆయా ఛైర్మన్లకు కూర్చొనేందుకు కుర్చీ ఉండదు. నిధుల్లేని కార్పొరేషన్లు ఎందుకు? అయిదేళ్లలో రూ.75 వేల కోట్ల బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు జగన్‌ దారి మళ్లించారు.


వసతి గృహాలు ఎత్తేశారు..
-తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 23 బీసీ వసతిగృహాలను ఎత్తేశారు. గోపాలపురం, రాజానగరం, రాజమమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గాల్లో ఎన్టీఆర్‌ హయాంలో కులవృత్తులకు ఇచ్చిన భూములను కబ్జా చేశారు.‘ఇటీవల సీనియర్‌ మంత్రి ధర్మానను కలిశాం.. సమస్యల గురించి ప్రస్తావించగా.. మా దగ్గర అధికారం ఎక్కడుంది? ఒకటి జగన్‌.. రెండు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని