logo

‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’

వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్‌ నాయకుడు అల్లు విజయ్‌ కుమార్‌ ఆరోపించారు.

Updated : 28 Mar 2024 06:17 IST

కిర్లంపూడి, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్‌ నాయకుడు అల్లు విజయ్‌ కుమార్‌ ఆరోపించారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు బుధవారం ఆయన ప్రకటించారు. ఈమేరకు జిల్లా వైకాపా అధ్యక్షునికి రాజీనామా పత్రాన్ని పంపించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయిలో సర్పంచులంతా కలిసి సంక్షేమ సంఘంగా ఏర్పడి, పది డిమాండ్లతో ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కనీస స్పందన కరవైందన్నారు. సీఎం జగన్‌ ప్రభుత్వ పరంగా పంచాయతీలకు నిధులు కేటాయించడం గురించి అటుంచితే... కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘాల నిధులనూ బుట్టదాఖలు చేశారని విమర్శించారు. గ్రామాల్లో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పంచాయతీ పాలక వర్గాలు... ఎన్నుకున్న ప్రజలకు కనీస పనులు చేయించలేక, సిగ్గుతో వారికి ముఖం చూపించుకోలేని పరిస్థితి వైకాపా ప్రభుత్వ పాలనలో ఏర్పడిందని విమర్శించారు. జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోట నరసింహం వల్ల పార్టీ పరమైన కార్యక్రమాలకు కనీస సమాచారం కరువైందన్నారు. సీనియర్‌గా ఉన్న తనకు సరైన సమాచారం ఇవ్వట్లేదని, కార్యక్రమాలకు ఆహ్వానం కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపంతో వైకాపాను వీడాల్సి వచ్చిందన్న ఆయన.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పంచాయతీల బలోపేతానికి రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని