logo

సంద్రంలో సమర భేరి

కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్‌ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి.

Published : 29 Mar 2024 03:09 IST

విన్యాసాలలో యుద్ధనౌకలు, విమానాలు, హెలికాఫ్టర్లు, ట్యాంకులు

విన్యాసాల్లో పాల్గొన్న ఇండో-అమెరికన్‌ సైనికులు

కాకినాడ గ్రామీణం (సర్పవరం జంక్షన్‌), న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్‌ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. మూడోరోజు గురువారం ఇరు దేశాలకు చెందిన యుద్ధవిమానాలు, హెలీకాఫ్టర్లు సముద్రతీరంలో చక్కర్లు కొడుతూ విన్యాసాలు నిర్వహించాయి. లంగరువేసిన యుద్ధ నౌకల ద్వారా మెకనైజ్డ్‌ లాంగ్‌ క్రాఫ్ట్‌లు, స్పీడ్‌, జెమినీ బోట్లలో సైనికులు తీరానికి చేరుకుని విన్యాసాలు సాగించారు. కాకినాడ తీరంలో ఈనెల 26 నుంచి నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు 31వ తేదీ వరకు కొనసాగుతాయి. శత్రుదేశాల సైనికులు, ఉగ్రవాదులు మన తీరాన్ని ఆక్రమించుకున్నప్పుడు వారి నుంచి మాతృదేశాన్ని కాపాడటం, ప్రకృతి విపత్తులు ఏర్పడి భూభాగం నుంచి ప్రజలకు అవసరమైన సహాయ, సహకారాలు అందించే అవకాశం లేనప్పుడు.. సైనికులు సముద్రమార్గం ద్వారా వచ్చి రక్షించే చర్యలపై విన్యాసాలు నిర్వహిస్తున్నారు. యుద్ధ]్దట్యాంకులు, ఇతర యుద్ధసామగ్రితో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. వందలాది మంది ఇండో-అమెరికన్‌ సైనికులు పాల్గొనే విన్యాసాలకు భద్రతా కారణాల దృష్ట్యా సందర్శకులను అనుమతించడం లేదు. కాకినాడ నుంచి ఉప్పాడకు వెళ్లే సముద్రతీర రహదారితో పాటు.. తీరంలోనికి వాహనదారులు, పర్యాటకులను అనుమతించడం లేదు. విన్యాసాలకు సాయుధులైన సిబ్బందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కాకినాడ డీఎస్పీ హనుమంతురావు, గ్రామీణ సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సివిల్‌, మెరైన్‌, కోస్ట్‌గార్డు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పహారా కాస్తున్నారు.

సముద్రంలో గస్తీ కాస్తున్న యుద్ధ నౌకలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని