logo

అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు

సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్‌ చల్లిస్తారు.

Published : 18 Apr 2024 06:14 IST

కలెక్టరేట్‌ రోడ్డులో చిగురించి కొత్త కొమ్మలు ఏర్పడుతున్న చెట్లు

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్‌ చల్లిస్తారు. అయిదేళ్ల వైకాపా పాలనలో అలాంటివేమీ లేవు. గత ప్రభుత్వంలో తమ ప్రాంతానికి సీఎం, ఇతర మంత్రులు రావాలని కోరుకునేవారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం జగన్‌ వచ్చే రహదారుల్లో చెట్లను అడ్డదిడ్డంగా నరికేస్తుండడం.. వేసవి ముంగిట పచ్చదనం లేకుండా చేస్తుండడంపై జనాగ్రహం వ్యక్తమవుతోంది. గతేడాది ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో సున్నా వడ్డీ పథకం బటన్‌ నొక్కేందుకు వచ్చారు. ఆ సందర్భంగా అమలాపురం ఆర్డీవో కార్యాలయం నుంచి బాలయోగి క్రీడా మైదానం వరకు రహదారికి ఇరువైపులా ఉన్న పలు రకాల చెట్ల కొమ్మలను అధికారులు నరికి వేయించారు. పచ్చగా ఉన్న వాటిని మోడుల్లా మార్చేశారు. గతంలో వేసవి కాలంలో అనేక మంది ప్రయాణికులు ఈ చెట్ల నీడన కొంతసేపు సేదదీరేవారు. సీఎం పర్యటన పుణ్యమా.. అని ఆ సౌకర్యానికి దూరమయ్యారు. ప్రస్తుతం ఆ చెట్లు మళ్లీ చిగురించి కొత్త కొమ్మలు తొడుగుతున్నాయి. మాకు హాని తలపెట్టినా.. మేం మాత్రం మీకు నీడనిచ్చేందుకే ప్రయత్నిస్తామనేలా చెట్లు చక్కని సందేశం ఇస్తున్నట్లున్నాయని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని