logo

భట్నవిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో ఆదివారం రాత్రి 11.50 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 30 Apr 2024 06:22 IST

నలుగురు యువకులు దుర్మరణం
మరో నలుగురికి తీవ్ర గాయాలు

ప్రమాదంలో ధ్వంసమైన ఆటో

అమలాపురం గ్రామీణం, మామిడికుదురు, పి.గన్నవరం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో ఆదివారం రాత్రి 11.50 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. అమలాపురం గ్రామీణ సీఐ వీరబాబు వివరాల ప్రకారం.. మామిడికుదురు, పి.గన్నవరం మండలాలకు చెందిన ఎనిమిది మంది ఒకే ఆటోలో యానాం వెళ్లి అక్కడ ఓ పుట్టినరోజు వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా భట్నవిల్లిలో ఆటో, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్నాయి. మామిడికుదురు మండలం నగరానికి చెందిన కొల్లాబత్తుల జతిన్‌ (26), సాపే నవీన్‌ (19), పాసర్లపూడికి చెందిన నెల్లి నవీన్‌కుమార్‌ (22) పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన ఆటో నడుపుతున్న వల్లూరి అజయ్‌ (18) దుర్మరణం చెందారు. మృతదేహాలను పోలీసులు అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పంచనామా పూర్తిచేసి సోమవారం రాత్రి బంధువులకు అప్పగించారు. గాయాలపాలైనవారిని అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

జతిన్‌, నవీన్‌, నవీన్‌కుమార్‌, అజయ్‌ (పాత చిత్రాలు)

నలుగురికి తీవ్రగాయాలు: పాశర్లపూడికి చెందిన మల్లవరపు వినయ్‌బాబు, మర్లపూడి లోకేశ్‌, పెదపట్నంలంకకు చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి, నగరానికి చెందిన మాదాసి ప్రశాంత్‌కుమార్‌లకు తలపై తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు మద్యం తాగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై శేఖర్‌బాబు తెలిపారు.

పుట్టిన రోజు చేసుకోకుండానే...

మామిడికుదురు మండలం నగరంలోని కొల్లాబత్తుల జతిన్‌ (హ్యాపీ) సోమవారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆదివారం తాటిపాకలో దుస్తులు కొనుగోలుచేసి స్నేహితులతో కలిసి ఆటోలో యానాం వెళ్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పుట్టినరోజుకు ఏర్పాట్లు చేసుకున్న అతన్ని మృత్యువు కబళించడంతో కుటుంబసభ్యులు దుఃఖసంద్రంలో మునిగారు. ఆరేళ్ల క్రితం పెళ్లయిన జతిన్‌కు భార్య ఆశాదేవి, అయిదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కుమారుడు ఉన్నారు. ఎలక్ట్రీషియన్‌గా ఉపాధి పొందుతూ అందరితో కలివిడిగా ఉండే జతిన్‌ దూరమవడంతో కుటుంబ సభ్యులు విలవిల్లాడిపోతున్నారు.

అందివస్తాడనుకుంటే..

అందరితో కలివిడిగా ఉండే నగరంలోని కోటమెరకకు చెందిన నవీన్‌ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నాడు. అందివచ్చిన కొడుకు అందనంత దూరం వెళ్లిపోతాడని ఊహించలేదని తాపీపని చేసుకునే తండ్రి శ్రీనివాస్‌, అమ్మమ్మ మేరీరత్నం విలపించారు. ఉపాధి రీత్యా కువైట్‌లో ఉంటున్న మృతుని తల్లి రత్నకుమారికి కొడుకు లేడన్న విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక కుటుంబ సభ్యులంతా మదనపడుతున్నారు.

ఆటోతో ఉపాధి..  నాలుగైదు నెలల క్రితం ఆటో కొనుక్కుని ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న పాశర్లపూడికి చెందిన నవీన్‌కుమార్‌ మృతితో కుటుంబ సభ్యులు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. అదే ఆటోలో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తూ మృత్యువాతపడడంతో విషాదం అలముకుంది. తండ్రి ఏడుకొండలు, కుటుంబ సభ్యుల రోదనలతో ఇల్లు మారుమోగింది. మస్కట్‌లో ఉంటున్న తల్లి మంగాదేవికి కొడుకు లేడనే విషయాన్ని చెప్పగా ఆమె అక్కడ స్పృహ కోల్పోయారు.

స్నేహితుడి ఇంటికి వెళ్లివస్తానని చెప్పి..

వల్లూరి అజయ్‌ తండ్రి శ్రీనివాసరావు ఉపాధినిమిత్తం మూడు నెలల క్రితం గల్ఫ్‌ వెళ్లారు. తల్లి కుమారి, సోదరుడు ఇక్కడే ఉంటున్నారు. ఇటీవలే ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన అజయ్‌ ఆదివారం రాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాను.. ఉదయం వస్తానని  చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని