logo

వన సంరక్షణ మాట మరిచారు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు జలవనరుల సంరక్షణ, మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా నర్సరీల్లో మొక్కలు పెంచి ప్రభుత్వ భూములు, కార్యాలయాలు,

Published : 30 Jun 2022 05:17 IST

మొక్కల పెంపకానికి దక్కని ఉపాధి  సాయం
ఈనాడు, బాపట్ల

హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు జలవనరుల సంరక్షణ, మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా నర్సరీల్లో మొక్కలు పెంచి ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, రహదారుల వెంబడి, ఖాళీ స్థలాలు, బీడు భూముల్లో విరివిగా మొక్కలు నాటాలి. అదేవిధంగా పండ్ల మొక్కలను రైతులకు అందజేసి వాటిని పెంచేలా ప్రోత్సాహం అందించాలి. ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలు ఏర్పాటు చేసి అందులో మొక్కలు పెంచి వర్షాకాలంలో ఉచితంగా అందరికీ పంపిణీ చేయాలి. దీనివల్ల కూలీలకు ఉపాధి కల్పనతో పాటు సామగ్రి విభాగం కింద వచ్చే నిధులను వినియోగించుకోవాలి. అయితే సామగ్రి విభాగం వాటా కింద వచ్చే నిధులను గ్రామసచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్యకేంద్రాలు, అంగన్‌వాడీ భవనాలు, రహదారుల నిర్మాణం తదితర పనులకు వినియోగించడంతో మొక్కల పెంపకానికి నిధుల కొరత వెంటాడుతోంది. దీంతో మొక్కల పెంపకం, వనసంరక్షణ, జలసంరక్షణ పనులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పర్యావరణ పరిరక్షణ సంగతి మరిచినట్లయింది. గతంలో ఉపాధిహామీ పథకం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలు పెంచేవారు. పెంపకానికి అయ్యే ఖర్చు మొత్తం ఉపాధి హమీ పథకం నుంచి నిధులు వెచ్చించేవారు. అయితే నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో అటవీశాఖ మొక్కల పెంపకానికి ముందుకు రాలేదు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది బాపట్లలో మాత్రమే ఉపాధి పథకంలో లక్ష మొక్కలు పెంచారు. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఒక్క మొక్క కూడా పెంచలేదు. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో అటవీశాఖ మొక్కలు ఇస్తే పెంచడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ఉపాధి హామీ పథకంలో మొక్కలు పెంచకపోవడం, కొనుగోలు చేయడానికి సామగ్రి విభాగం కింద నిధులు లభ్యత లేకపోవడంతో ఈ ఏడాది మొక్కలు నాటే కార్యక్రమం ఉండకపోవచ్చని అధికారి ఒకరు తెలిపారు. ఇదే మాదిరి పొలాల్లో రైతులు సేద్యపు కుంటల తవ్వకానికి మూడేళ్ల క్రితం భారీ ఎత్తున నిధులు అందించేవారు. అయితే ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. భూగర్భ జలాల సంరక్షణతో పాటు పైర్లకు అందుబాటులో నీళ్లు అందుబాటులో ఉండే ఈ పథకం గురించి పట్టించుకోకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రూ.100 కోట్లకు పైగా బకాయిలు

గతంలో ఓ రైతు పొలంలో తవ్విన సేద్యపు కుంట

మ్మడి గుంటూరు జిల్లాలో సామగ్రి విభాగం కింద చేసిన సిమెంట్‌ రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం, ఉద్యానమొక్కల పెంపకం వంటి వాటికి రూ.100 కోట్లపైగా బకాయిలు ఉన్నాయి. ఉద్యానతోటల పెంపకం కింద రైతులు పండ్ల మొక్కలు కొనుగోలు చేసి పెంచితే మొక్కల కొనుగోలు, పెంచడానికి ఉపాధి హామీ పథకం కింద నిధులు విడుదల చేస్తారు. రెండేళ్లుగా రైతులకు సొమ్ము చెల్లించడం లేదు. దీంతో ఈ ఏడాది రైతులు ఎవరూ పండ్ల తోటల పెంపకానికి ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సామగ్రి విభాగం వాటా కింద వచ్చే సొమ్మును ప్రాధాన్య క్రమంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని సూచించింది. దీంతో సామగ్రి విభాగం కింద ఇతర పనులకు నిధులు వెచ్చించలేని పరిస్థితి. పండ్ల తోటలు సాగు చేసిన రైతులకు చిలకలూరిపేట క్లస్టర్‌లో బకాయిలు చెల్లించినందుకు సంబంధిత యంత్రాంగంపై విచారణ చేసి బాధ్యులను చేయడంతో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగులు సామగ్రి విభాగం కింద నిధుల విడుదలలో అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. కూలీలకు వేతనాల కింద 60 శాతం సొమ్ము వెచ్చిస్తుండగా, సామగ్రి వాటా కింద 40శాతం సొమ్ము సమకూరుతుంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్దఎత్తున గ్రామాల్లో వివిధ ప్రభుత్వశాఖలకు భవనాలు నిర్మించడానికి ఉపాధి నిధులు వాడుకోవడంతో సామగ్రి విభాగం కింద లోటు కొనసాగుతోంది. ఇప్పట్లో లోటు భర్తీ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈఏడాది మొక్కల పెంపకం లేనట్లేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని