logo

సీతారాములకు పునరావాస కష్టాలు

త్రేతాయుగంలో సీతారాములు 14ఏళ్లు మాత్రమే వనవాసంలో కష్టాలు పడితే.. కలియుగంలో 14ఏళ్లు దాటినా పునరావాస కష్టాలు తీరడంలేదు. అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండలంలోని తూర్పుపాలెంలో 200ఏళ్ల నాటి సీతారామస్వామి దేవాలయం ఉంది. ప్రస్తుతం అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.

Updated : 01 Aug 2022 05:31 IST

శిథిలావస్థలో దేవాలయం

కొరిశపాడు (మేదరమెట్ల), న్యూస్‌టుడే: త్రేతాయుగంలో సీతారాములు 14ఏళ్లు మాత్రమే వనవాసంలో కష్టాలు పడితే.. కలియుగంలో 14ఏళ్లు దాటినా పునరావాస కష్టాలు తీరడంలేదు. అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండలంలోని తూర్పుపాలెంలో 200ఏళ్ల నాటి సీతారామస్వామి దేవాలయం ఉంది. ప్రస్తుతం అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గోడలు బీటలువారి కూలేందుకు సిద్ధంగా ఉంది. ఆ కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆలయ గోడలు ఎప్పుడు పడిపోతాయోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అయినా అక్కడే పూజా కార్యక్రమాలు నిర్వర్తించాల్సి వస్తోందని ఆలయ పూజారి వాపోతున్నారు. యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తూర్పుపాలెంలో రిజర్వాయర్‌ నిర్మించడంతో 15ఏళ్ల క్రితం దీనిని ముంపు గ్రామంగా గుర్తించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఎత్తిపోతల పథకం ఇప్పటి వరకు పూర్తికాలేదు. నిబంధనల ప్రకారం గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకూడదు.  ఆలయం ముంపు గ్రామంలో ఉండడంతో మరమ్మతులు చేయించలేదు. 2018-19లో ఆలయ మరమ్మతుల కోసం దేవాదాయశాఖ రూ.45 లక్షలు కేటాయించింది. కానీ నిబంధనల కారణంగా నిధులు ఖర్చు చేయలేదు. దీంతో అవి వెనక్కి మళ్లాయి. తూర్పుపాలెం గ్రామస్థులకు పునరావాస కాలనీ ఏర్పాటు చేసి ఆ ప్రదేశంలో దేవాలయం నిర్మిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని