logo

మాతా, శిశు సంరక్షణ కేంద్రం కల సాకారం

సర్వజనాసుపత్రి(జీజీహెచ్‌)లో మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. గత పది సంవత్సరాల కల సాకారం కానుంది.

Published : 05 Oct 2022 06:15 IST

నేడు పనులు పునః ప్రారంభం

ప్రతిపాదిత మాతాశిశు సంరక్షణ కేంద్రం భవనం

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: సర్వజనాసుపత్రి(జీజీహెచ్‌)లో మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. గత పది సంవత్సరాల కల సాకారం కానుంది. ఇందుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.86.80 కోట్లు ఇక్కడ చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యులు(జింకాన) భరించేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వం అందుకు అనుమతిస్తూ గత జూన్‌ నెలలో ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ కేంద్రానికి కానూరి రామచంద్రరావు-జింకాన-మాతా శిశు సంరక్షణ కేంద్రంగా పేరు పెట్టాలని నిర్ణయించారు. పనులు పునఃప్రారంభించేందుకు బుధవారం పూజ కార్యక్రమం జింకాన ఆధ్వర్యంలో జరగనుంది. ఇప్పటికే గుత్తేదారు ఎంపికైనందున ఇక నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

597 పడకలు
అందుబాటులో ఉన్న 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్లార్‌తో పాటు జి+5 బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో ప్రసూతి, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగానికి 300 పడకలు, చిన్న పిల్లల విభాగానికి 200 పడకలు, పీఐసీయూ 27 పడకలు, ఎస్‌ఐసీయూ 30 పడకలు, ఎన్‌ఐసీయూ 40 పడకలు కేటాయించారు. బోధనానిపుణులకు 30 గదులు, ఒకేసారి 300 మంది వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు వీలుగా సమావేశ మందిరం ఏర్పాటు చేయనున్నారు. సర్వజనాసుపత్రిలో ప్రస్తుతం అని విభాగాల్లో 1,200 పడకలున్నాయి. అదనంగా మరో 597 పడకలు సమకూరనున్నాయి.

జింకాన కానుక
పునర్జన్మ వంటి ప్రసూతి వేదనను తట్టుకుని బిడ్డలకు జన్మనిచ్చే మాతృమూర్తులు పడుతున్న ఇబ్బందులను చూసి జింకాన సభ్యులు చలించిపోయారు. శస్త్రచికిత్సల ద్వారా కాన్పులు జరిగిన వారైతే పసికందులు సహా ఒకే పడక పైన ఇద్దరు ఇమడలేక పడే వేదన వర్ణనాతీతమని వారు అంతర్గతంగా చర్చించుకుని ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం రూ.35 కోట్లు, జింకాన రూ.30 కోట్లు భరించేవిధంగా 2019, ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న గుత్తేదారు రూ.6.27 కోట్ల నిర్మాణ పనులు చేసి నిలిపివేశారు. మూడేళ్లు దాటినా ఆ ప్రాజెక్టులో పురోగతి లేకపోవడంతో జింకాన సభ్యులే ప్రాజెక్టు పనులు మొత్తం చేయాలని నిర్ణయించుకున్నారు.  అవసరమైన అనుమతులు వచ్చే విధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రత్యేకంగా కృషి చేశారు. ఇప్పటికే జింకాన పేరున రూ.30 కోట్లు ఉన్నాయి. ఇటీవల అమెరికాలోని డల్లాస్‌లో జింకాన సభ్యులు సమావేశమై సుమారు రూ.45 కోట్లు విరాళం ప్రకటించారు. ఇందులో గవని ఉమాదేవి తన భర్త కానూరి రామచంద్రరావు పేరున సుమారు రూ.22 కోట్లు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి రూ.100 కోట్లకు చేరుకోవచ్చని  భావిస్తున్నారు. దీంతో మరో రూ.25 కోట్లు అవసరం కావడంతో స్థానికంగా ఉన్న వైద్యులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఎన్జీవోల నుంచి నిధులు సమీకరించాలని భావిస్తున్నట్లు జింకాన పూర్వ అధ్యక్షుడు రవికుమార్‌ త్రిపురనేని తెలిపారు.   వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అందరి సహకారం తీసుకుంటున్నామని వివరించారు. తమ విజ్ఞప్తి మేరకు 1994 బ్యాచ్‌కు చెందిన వైద్యులు రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఇప్పటికే ముందుకొచ్చినందున, వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు స్పందించాలని కోరుతున్నారు. వారిచ్చే విరాళాల ఆధారంగా సముచిత గౌరవంతో ఆ వార్డుకు వారి పేరు పెడతామంటున్నారు.

అన్నీ ఒకే భవనంలోనే

కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా మాతాశిశు సంరక్షణ భవనం నిర్మించనున్నారు. అవసరమైన అన్ని సదుపాయాలు ఒకే భవనంలో సమకూర్చేవిధంగా ప్రభుత్వ ఇంజినీర్లు, నిర్మాణ రంగంలో ఉన్న నిపుణుల సలహాలు తీసుకున్నారు. అమెరికాలోని పేరొందిన ఆసుత్రుల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి దీని నిర్మాణానికి తుది రూపం ఇచ్చారు. భవనం ఆకృతుల నుంచి ప్రతి వార్డులోనూ మౌలిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నిర్మించేలా కార్యాచరణ రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని