logo

Super Star Krishna: నీ జ్ఞాపకాల నీడలో..

బుర్రిపాలెం బుల్లోడు.. తన తేనె లాంటి మనసుతో అందరికీ అభిమానవంతుడయ్యాడు. సాహసమే ఊపిరిగా చిత్రసీమలో అడుగుపెట్టి అసాధ్యుడు అనిపించుకున్నాడు. డేరింగ్‌ డాషింగ్‌ నిర్ణయాలతో సినిమా పరిశ్రమలో అఖండుడయ్యాడు. అపజయాలు ఎదురైనా అధిగమించి నెంబర్‌వన్‌గా నిలిచాడు. నిర్మాతల పాలిట దేవుడు లాంటి మనిషిగా మారాడు. ప్రయోగాలకు ముందడుగు వేసి హీరో అయ్యాడు.

Updated : 16 Nov 2022 09:28 IST

దిగంతాలకు బుర్రిపాలెం బుల్లోడు

కృష్ణతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నజిల్లావాసులు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - తెనాలి, పర్చూరు, అద్దంకి

బుర్రిపాలెం బుల్లోడు.. తన తేనె లాంటి మనసుతో అందరికీ అభిమానవంతుడయ్యాడు. సాహసమే ఊపిరిగా చిత్రసీమలో అడుగుపెట్టి అసాధ్యుడు అనిపించుకున్నాడు. డేరింగ్‌ డాషింగ్‌ నిర్ణయాలతో సినిమా పరిశ్రమలో అఖండుడయ్యాడు. అపజయాలు ఎదురైనా అధిగమించి నెంబర్‌వన్‌గా నిలిచాడు. నిర్మాతల పాలిట దేవుడు లాంటి మనిషిగా మారాడు. ప్రయోగాలకు ముందడుగు వేసి హీరో అయ్యాడు. తన ప్రవర్తనతో అందరి మనసుల్లో అభిమాన సింహాసనంపై కూర్చున్నాడు. అందుకే ఈనాడు ఆయన లేరంటే అభిమానులతో పాటు అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మా మంచి కృష్ణ అంటూ ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు   జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ నివాళి అర్పిస్తున్నారు.

కారంచేడులో ‘సావాసగాళ్లు’ చిత్రం షూటింగ్‌ సందర్భంగా నాటి నిర్మాత రామానాయుడుతో కృష్ణ

బుర్రిపాలెం బుల్లోడిగా అభిమానుల మనసు దోచుకున్నారు. సూపర్‌స్టార్‌తో సినీజగత్తులో కీర్తికిరీటాలను అందుకున్నారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించి జిల్లాకు ఎంతో వన్నె తెచ్చారు. జన్మభూమిని మరవని మహనీయుడు. మెత్తని మనసు, విసుగెత్తని నటన, కొత్తదనం కోసం నిత్యాన్వేషణ తత్వం మొత్తం కలిసి నిండైన అందాల రూపం. ఏ పాత్ర పోషించినా ప్రేక్షకుడిని మెప్పించి సూపర్‌స్టార్‌ అనిపించుకున్న కృష్ణ కనుమరుగయ్యారన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు ఆయన అభిమాన జనం. ఏ భేషజాలూ లేని బోళాతనం ఆయన సొంతం. పలకరించటానికి ఇంటికి వెళ్లినా, బయట ఏదైనా ఉత్సవాలకు అతిథిగా వచ్చినా అభిమానుల మీద కృష్ణ చూపే ప్రేమానురాగాలు అసమానం. ఈ ఆత్మీయతతోనే అందరి మనసులతో ఆయన పెనవేసుకుని ఉన్నారు. ఈ అనుబంధం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల అభిమానులతో మరింత ఎక్కువని 2003 ఫిబ్రవరి 9న గుంటూరు దాసరి కల్చరల్‌ అకాడమీ రజతోత్సవాలకు అతిథిగా వచ్చినప్పుడు స్వయంగా చెప్పారు.

బుర్రిపాలెంలో కృష్ణ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న విద్యార్థులు

గుంటూరులో చిత్రీకరణతో ఘన విజయం: ఉవ్వెత్తున ఎగసిన ఆయన సినీ జీవితంలో కొంతకాలం స్తబ్ధత చోటు చేసుకుంది. అది పాడిపంటలు సినిమాతో చెదిరిపోయి మళ్లీ సూపర్‌ స్టార్‌ ఘన విజయం దక్కించుకున్నారు. ఈ చిత్రంలోని కొన్ని ఘట్టాలను గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో చిత్రీకరించారు. ఎడ్లపందేలు పోటీలను ఇక్కడి మైదానంలో చిత్రీకరించడంతో పెద్దఎత్తున జనం వచ్చారు. ప్రస్తుతం అరవై సంవత్సరాల వయసు సమీపంలో ఉన్న వారికి ఇంకా స్టేడియం మెట్ల మీద నుంచి కృష్ణ ఎడ్లబండి తోలుకెళ్లిన సన్నివేశాలు కళ్ల ముందు మెదలుతుంటాయి. అప్పట్లో రైతన్నలకు మరింత అభిమాన కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పాడిపంటలు సినిమా పెద్దపండగ సంక్రాంతికి విడుదలై ఘన విజయాన్ని దక్కించుకుంది. వ్యవసాయ నేపథ్య కుటుంబాల్లోని వ్యక్తిగా పాత్రలు పోషించి ఆ నటనతో ప్రేక్షకుల హృదయాలలో కృష్ణ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయా పాత్రల చుట్టూ తిరిగిన కథ ఎక్కువగా గుంటూరు, కృష్ణా జిల్లాలతో సంబంధం ఉండటం మరో విశేషం. ప్రస్తుత బాపట్ల జిల్లా కారంచేడులో సావాసగాళ్లు చిత్రీకరణ 1976లో 18 రోజుల పాటు జరగగా, కృష్ణ ఇక్కడే బస చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా 1985లో అద్దంకి ఎన్నికల ప్రచార సభలో  కృష్ణ పాల్గొన్నారు.

అద్దంకి ఎన్నికల ప్రచార సభలో కృష్ణ ప్రసంగం

నరసరావుపేటలో కోడెల నుంచి జ్ఞాపిక అందుకుంటూ..


సినిమా వచ్చిందంటే పండగే

గుమ్మడి సీతారామయ్య, సెంట్రల్‌ జీఎస్‌టీ ఉద్యోగి, గుంటూరు

కృష్ణ అంటే ఎంతో అభిమానం. కృష్ణ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌కు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. ఆయన సినిమా వచ్చిందంటే అభిమానులకు పండగే. అప్పట్లో మద్రాసులోని ఆయన ఇంటికి తరచుగా వెళ్లేవాడిని. కృష్ణ మేనల్లుడు శ్రీనివాస్‌తో ఉన్న అనుబంధంతో ప్రతి ఏటా వెళ్లి ఫొటోలు దిగి వచ్చేవాళ్లం. కృష్ణకు సంబంధించి 250చిత్రాలకుపైగా ఫొటోలు సేకరించాను. కృష్ణ రాజకీయ జీవితానికి సంబంధించి అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ సేకరించాను. పాడిపంటలు సినిమా గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో చిత్రీకరించారు. ఈనాడు సినిమా టైటిల్‌ సాంగ్‌ నేడే ఈనాడే అనే పాటను నాజ్‌ సెంటర్‌లో చిత్రీకరించినప్పుడు జనాన్ని అదుపు చేయడం కష్టమైంది. కృష్ణ అనారోగ్యానికి గురైనప్పుడు కాకానితోటకు విజయనిర్మలతో కలసి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసి వెళ్లారు. అప్పుడు వారి వెంటే ఉన్నాను. పలు సినిమాల విజయోత్సవాలు గుంటూరులో అభిమానుల మధ్య జరిగాయి.  


నరసరావుపేటతో ప్రత్యేక అనుబంధం

2003 ఫిబ్రవరి 9న గుంటూరు దాసరి కల్చరల్‌ అకాడమీ

రజతోత్సవ సభలో మాట్లాడుతున్న కృష్ణ

ప్రముఖ సినీనటుడు కృష్ణకు నరసరావుపేటతో బలమైన అనుబంధం ఉంది. ఆయన నరసరావుపేటకు చెందిన విజయనిర్మలను ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆయనకు అభిమానులు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాదెండ్ల, చిలకలూరిపేట ప్రాంతాల్లో నరసరావుపేట అభ్యర్థి కాసు వెంకట కృష్ణారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో చిలకలూరిపేట నియోజకవర్గం గుంటూరు లోకసభ పరిధిలో ఉండేది. పునర్విభజన తర్వాత నరసరావుపేటలో కలిసింది. తర్వాత 1997లో నరసరావుపేట ద్వితీయ శతాబ్ధి ఉత్సవాలకు విజయనిర్మలతో కలిసి హాజరయ్యారు. ఆ రోజున అప్పటి మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కృష్ణ దంపతులకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని