logo

‘సారా’కు దూరంగా.. బతుకుపై నిశ్చింతగా..

సారా తయారీ, రవాణా, విక్రయంతో జీవనం సాగిస్తూ పోలీసులు, అధికారులు ఎప్పుడు దాడి చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతికే వారి జీవితాల్లో అధికారులు కొత్త వెలుగులు నింపుతున్నారు.

Updated : 28 Nov 2022 06:45 IST

అధికారుల చేయూతతో స్వయం ఉపాధికి బాట  
న్యూస్‌టుడే, మల్లమ్మసెంటర్‌ (నరసరావుపేట)

చెక్కు పంపిణీ చేస్తున్న పాలనాధికారి శివశంకర్‌ తదితరులు (పాత చిత్రం)

సారా తయారీ, రవాణా, విక్రయంతో జీవనం సాగిస్తూ పోలీసులు, అధికారులు ఎప్పుడు దాడి చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతికే వారి జీవితాల్లో అధికారులు కొత్త వెలుగులు నింపుతున్నారు. ఉపాధి మార్గాలు చూపుతూ జీవన భద్రత కల్పిస్తున్నారు. పల్నాడులో నాటుసారా కేంద్రాలుగా పేరున్న గ్రామాల్లోని నిరుపేదలకు అధికారులు నవోదయ, ఆపరేషన్‌ పరివర్తన్‌ 2.0 కార్యక్రమాల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతున్నారు. కలెక్టరు, ఎస్పీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, డీఆర్‌డీఏ నేతృత్వంలో బాధితులకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి తదితరాల కింద రుణాలు, బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందజేసి ఉపాధికి బాటలు వేస్తున్నారు.

పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి, యడ్లపాడు, వెల్దుర్తి, పిడుగురాళ్ల, ఈపూరులతోపాటు పలు మండలాల్లోని గ్రామాల్లో ఎక్కువగా సారా తయారవుతోంది. దీని తయారీ, రవాణా, విక్రయాల్లో మహిళలే ఎక్కువగా పాల్గొంటున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వీరికి సరైన ఉపాధి మార్గం లేక నాటాసారానే వృత్తిగా మార్చుకున్నారు. మద్యానికి అధిక మొత్తంలో నగదు వెచ్చించలేక నాటాసారా కాయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గతంలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సంయుక్తంగా నవోదయ, ఆపరేషన్‌ పరివర్తన్‌ 2.0 కార్యక్రమాల ద్వారా నాటాసారా తయారీను కట్టడి చేశారు. సారా తయారీ ముడిసరకులు రవాణా చేసే వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. గతంలో పల్నాడులో నెలకు 70 నుంచి 100 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నెలకు 10 కేసులు కంటే తక్కువ మాత్రమే నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలో పరిస్థితి ఇలా...

పల్నాడు జిల్లాలో మొత్తం 77 గ్రామాలు నాటాసారా తయారీ కేంద్రాలుగా గుర్తించారు. వీటిని మూడు కేటగిరీలు ఎ, బి, సి గా విభజించారు. ఎ కేటగిరిలో నాటాసారా తయారీ, రవాణా, విక్రయదారులు, బి కేటగిరిలో రవాణా, విక్రయదారులు, సి కేటగిరీలో విక్రయదారులు ఉండేలా విభజించి కట్టడి చేపట్టారు. ఎ కేటగిరిలో 32 గ్రామాలు, బి లో 15, సిలో 30 గ్రామాలు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఉపాధి కోల్పోయిన బాధితులకు బాసటగా నిలిచేందుకు 384 మందిని ఎంపిక చేశారు. అందులో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఆధారంగా డ్వాక్రా గ్రూపుల ద్వారా 198 మందికి రుణాల ద్వారా ఉపాధి కల్పించారు. ముందస్తుగా 102 మందికి, అనంతరం 96 మందికి బ్యాంకు రుణాలు, శ్రీనిధి ఎస్సీ, ఎస్టీ ఉన్నతి లోన్లు, వడ్డీ లేని రుణాలు ద్వారా ఒక్కొక్కరికి రూ.50 వేలతో ఆటోలు, కిరాణాషాపులు, చికెన్‌ షాపులు, దుస్తుల వ్యాపారం, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయించి ఉపాధి కల్పిస్తున్నారు.


సద్వినియోగం చేసుకోండి

 

సారా వ్యాపారంతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపినా బాధితులకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మళ్లీ సారా వ్యాపారం చేయకుండా ప్రత్యామ్నాయంగా ఉపాధి పొంది కుటుంబాలను పోషించుకోవాలి. కుటుంబ ఉన్నతికి తోడ్పాటు అందించాలి.

బాలూనాయక్‌, డీఆర్‌డీఏ పీడీ


ప్రభుత్వం చేయూతఅందించింది

గతంలో సారా వ్యాపారం చేస్తూ భయపడుతూ జీవనం సాగించేవాళ్లం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ప్రభుత్వం అందించిన బ్యాంకు రుణాల ద్వారా దుస్తుల వ్యాపారం చేసుకుంటున్నాం. నెలకు రూ.5 వేల పైనే రాబడి ఉంది. కష్టపడి పనిచేసుకుంటే ఆనందంగా ఉంది. ఇప్పుడు పోలీసుల భయం లేదు.

వెంకటేశ్వరమ్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని