logo

మగధీరా.. ముందుకు రారా

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి మగధీరులు నానాటికీ వెనక్కిపోతున్నారు. అన్నింటిలో సగం, ఆకాశంలో సగమంటూ చెప్పుకునే మహిళలు శస్త్రచికిత్సల్లో ముందంజలో నిలుస్తున్నారు.

Updated : 09 Dec 2022 06:46 IST

కు.ని.శస్త్రచికిత్సలకు వెనకడుగు
ఈనాడు-అమరావతి

జీజీహెచ్‌లోని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల వార్డు

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి మగధీరులు నానాటికీ వెనక్కిపోతున్నారు. అన్నింటిలో సగం, ఆకాశంలో సగమంటూ చెప్పుకునే మహిళలు శస్త్రచికిత్సల్లో ముందంజలో నిలుస్తున్నారు. కొన్ని రకాల అపోహలు, అనుమానాలతోనే పురుషులు ఆసక్తి కనబరచటం లేదని వైద్యులు అంటున్నారు. జిల్లాలో అత్యధిక శస్త్రచికిత్సలు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో జరుగుతున్నాయి. ఇక్కడ గడిచిన మూడేళ్లగా పరిశీలిస్తే మగాళ్లకు సంబంధించి మూడునెలలు, ఆరునెలలకు ఓ  శస్త్రచికిత్స కూడా జరగడం లేదు. అదే మహిళలైతే ప్రతి రోజు సగటున ఆరేడుగురికి తగ్గకుండా చేయించుకుంటున్నారు..

మహిళల నుంచే అభ్యంతరం

మగవాళ్లు చేయించుకునే వ్యాసెక్టమీలపై కొందరు మహిళలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నా భర్త ఆపరేషన్‌ చేయించుకుంటే కుటుంబం ఎలా గడుస్తుంది? ఆపరేషన్‌ చేయించుకుంటే బరువులు ఎత్తకూడదని, ఎక్కువ కాలం పనులు చేయకూడదని ఇలా రకరకాల అపోహలతో ముఖ్యంగా ఆడవాళ్లే మగవారిని నిరుత్సాహపరుస్తున్నారు. అపోహలు వీడి భార్యాభర్తలు ఒక అంగీకారానికి వచ్చి చేయించుకునే శస్త్రచికిత్సనూ పట్టించుకోవడం లేదు.

చేయించుకునేది మధ్య, ధనికవర్గాలే

వ్యాసక్టమీ ఆపరేషన్లు చేయించుకునే ఐదారుగురు కూడా మధ్య, ధనికవర్గాలకు చెందిన వారే. వారిలోనూ విద్యావంతులే ఇవి చేయించుకుంటున్నారు. పేదవర్గాలు, నిరక్షరాస్యులు, ఏమాత్రం చదువుకోనివారు వెయ్యికి ఒక్కరూ చేయించుకోవటం లేదని జీజీహెచ్‌వర్గాలు తెలిపాయి. మహిళలకు చేసే ట్యూబెక్టమీతో పోలిస్తే మగవారికి చేసేది చాలా చిన్న శస్త్రచికిత్స.  వారు దీన్ని చేయించుకుంటే మహిళలకు ఎక్కువ లైఫ్‌ ఇచ్చినవాళ్లవుతారని, అప్పటికే వారు పిల్లలను కనటానికి సిజేరియన్లు అయి ఉండటం, ఆతర్వాత పిల్లల పెôపకం వంటివి చేయటం వల్ల రక్తహీనత బారినపడి బక్కచిక్కిపోతారు. వీరికే ఏరికోరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయిస్తే ఇబ్బందని వైద్యులు అంటున్నారు.

సిజేరియన్‌తో పాటే శస్త్రచికిత్సలు

సిజేరియన్‌తో బిడ్డకు జన్మనిచ్చిన వారు కొందరు తమకు ఇక పిల్లలు కలగకుండా శస్త్రచికిత్స చేయాలని కోరతారు. వారికి చేసే శస్త్రచికిత్సలను ఎల్‌ఎస్‌సీఎస్‌ అంటారు. ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. మిగిలిన శస్త్రచికిత్సలతో పోలిస్తే వీటి సంఖ్య రెండు, మూడు రెట్లు అధికంగా ఉంటోంది. వీటి వల్ల సంబంధిత మహిళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ప్రచారం ఏదీ?

కు.ని.ఆపరేషన్లపై ప్రభుత్వం చేసే ప్రచారం చాలా తక్కువగా ఉంటోంది. సినిమాథియేటర్లు, హోర్డింగ్‌లపైనే పరిమితంగా ప్రచారం చేస్తోంది. ప్రతి ఊళ్లో ఉండే ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు కలిసి ట్యూబెక్టమీ ఆపరేషన్లపై మహిళలను చైతన్యం చేస్తున్నారు. కానీ మగవారిని అలా చైతన్యవరిచేవారు లేరు. ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.


అపోహలతోనే ఆసక్తి చూపటం లేదు

కౌన్సిలింగ్‌ ఇచ్చి పురుషులను ఒప్పించాలని చూసినా కొందరు మహిళలు మా వారికి వద్దని పేచీపెడుతున్నారు. మహిళలకు ఐదు నిమిషాలు, పురుషులకైతే మూడు నిమిషాల్లో ఈ ఆపరేషన్‌ చేసేయొచ్చు. దీనికి కేవలం వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. ఇబ్బందులేమీ ఉండవు.

ఆచార్య మండవ శ్రీనివాసరావు, కుటుంబ నియంత్రణ విభాగం, జీజీహెచ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని