logo

బ్యాంకులో రూ.1.50 కోట్ల బంగారం మాయం

సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలోని యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో 40 మంది రుణ గ్రహీతలకు చెందిన సుమారు రూ.1.50 కోట్ల బంగారం మాయమైన సంఘటన వెలుగు చూసింది.

Published : 27 Jan 2023 04:47 IST

మేనేజరు, సహాయ మేనేజరు సస్పెన్షన్‌
ఆందోళనలో బంగారం తనఖా పెట్టిన రుణ గ్రహీతలు

రెంటపాళ్లలోని యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా భవనం

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలోని యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో 40 మంది రుణ గ్రహీతలకు చెందిన సుమారు రూ.1.50 కోట్ల బంగారం మాయమైన సంఘటన వెలుగు చూసింది. సుమారు 1,950 మంది ఖాతాదారులు పంట సాగు ఖర్చులు, కుటుంబ అవసరాల నిమిత్తం గ్రాముల కొద్దీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు పొందారు. కొన్ని నెలలు గడిచాక కొద్దొగొప్పొ నగదు చేతికి రాగానే బంగారం విడిపించుకునేందుకు రెంటపాళ్ల, కట్టమూరుకు చెందిన కొందరు రుణ గ్రహీతలు మూడు వారాల కిందట బ్యాంకుకు వెళ్లారు. రుణం, వడ్డీ మొత్తాన్ని బ్యాంకులో జమ చేసినా మేనేజరు, అప్రైజరు బంగారాన్ని అప్పగించకుండా రేపుమాపంటూ కాలయాపన చేశారు. అనుమానించిన రుణ గ్రహీతలు బ్యాంకు అధికారులను, అప్రైజరును నిలదీయడంతో కొందరి బంగారం కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం బయటకు పొక్కనీయవద్దని, ఉద్యోగాలు ఊడతాయని బ్రతిమలాడారు. బంగారం ఖరీదు చెల్లిస్తామని సముదాయించారు. వారి విన్నపానికి కరిగిన కొందరు రుణ గ్రహీతలు బంగారం వాపసు తీసుకున్నట్లు దస్త్రాల్లో సంతకాలు చేశారు. వారం గడిచాక బాధితుల సంఖ్య పెరిగింది. ఈ విషయమై శాఖ మేనేజరు రాంబాబు నాయక్‌ బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంతో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ రెండు రోజుల కిందట తనిఖీ చేశారు. 40 మందికి చెందిన సుమారు రూ.1.50 కోట్ల బంగారం మాయమైనట్లు నిర్ధరించారు. బ్యాంకు అధికారులు, సిబ్బందిని విచారించారు. బంగారం గోల్‌మాల్‌కు అప్రైజరు ఇమ్మడిశెట్టి సంపత్‌కుమార్‌ కారణమని బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులను గుర్తించేందుకు సీసీ ఫుటేజిలను పరిశీలించాలని భావించగా, మూడు నెలలుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదని తెలిసింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన మేనేజరు రాంబాబునాయక్‌, సహాయ మేనేజరు రవికుమార్‌లను బుధవారం విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. రుణ గ్రహీతలు ఆందోళన చెందవద్దని, బంగారం తిరిగి అందిస్తామని చెప్పారు. రెంటపాళ్ల, కట్టమూరు, పీసపాడు, గోగులపాడు, కొంపెర్లపాడు గ్రామాలకు చెందిన రుణ గ్రహీతల్లో కలవరం మొదలైంది.


ప్రభుత్వ బ్యాంకులో మోసాలా..!

త మార్చిలో పది సవర్ల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.2.30 లక్షల రుణం తీసుకున్నామని, ఈ నెల 24న వడ్డీతో కలిపి రూ.2.49 లక్షలు చెల్లించామని ఖాతాదారు అంజలిదేవి పేర్కొన్నారు. బంగారం ఇవ్వకుండా కొన్నిరోజులు బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని, ప్రభుత్వ బ్యాంకులో మోసమైతే ఇక ఎవరిని నమ్మాలని వాపోయారు. బంగారం కుదువపెట్టి రూ.2.30లక్షల రుణం తీసుకున్నా.. ఈనెల ఐదున బాకీ చెల్లించినా బంగారం ఇవ్వకుండా రెండు వారాలుగా మభ్యపెడుతున్నారని మారిశెట్టి గోవిందరావు పేర్కొన్నారు. బంగారం ఖరీదు ఇస్తామని సెటిల్‌మెంటుకు పిలిచారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని