logo

అన్నింటా ప్రగతే లక్ష్యం

కొత్త జిల్లా బాపట్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అంకితభావంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు.

Updated : 27 Jan 2023 04:49 IST

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ విజయకృష్ణన్‌

గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ వకుల్‌జిందాల్‌

బాపట్ల, న్యూస్‌టుడే: కొత్త జిల్లా బాపట్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అంకితభావంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో జాతీయ జెండాను కలెక్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో ప్రతిఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ రూపొందించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గొప్ప వ్యవస్థను తీసుకువచ్చారని పేర్కొన్నారు. జిల్లా ఆవిర్భావం జరిగిన తొమిదిన్నర నెలల్లో లబ్ధిదారులకు 5,885.12 కోట్ల నిధులు అందించినట్లు తెలిపారు. వ్యవసాయశాఖ ద్వారా రైతు భరోసా కింద 6,86,278 మంది రైతులకు రూ.883.48 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. సున్నావడ్డీ కింద 90,469 మందికి రూ.17.66 కోట్లు, బీమా కింద 92,119 మందికి రూ.174.2 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. విద్యాశాఖలో జగనన్న అమ్మఒడి కింద 1,19,953 మంది విద్యార్థులకు రూ.179.93 కోట్లు, విద్యాకానుక ద్వారా రూ.22.94 కోట్లు మంజూరు చేశామన్నారు. నాడు-నేడు కింద 543 పాఠశాలల్లో రూ.193 కోట్లతో మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. 14,582 మంది విద్యార్థులకు రూ.36.45 కోట్ల విలువైన ట్యాబ్‌లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో రూ.548.33 కోట్ల వ్యయంతో 30,463 మంది లబ్ధిదారులకు పక్కా గృహాలు నిర్మిస్తున్నామని తెలిపారు. 55 పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రూ.5.28 కోట్ల రాయితీ మంజూరు చేశామన్నారు. నేతన్న నేస్తం కింద 8078 మంది లబ్ధిదారులకు రూ.19.39 కోట్లు, వాహనమిత్ర కింద 6471 లబ్ధిదారులకు రూ.647.10 కోట్లు, మత్స్యకార భరోసా కింద రూ.16,131 మంది మత్స్యకారులకు రూ.92.58 కోట్ల సాయం చేసినట్లు వివరించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా వైఎస్సార్‌ చేయూత కింద 85,846 మంది లబ్ధిదారులకు రూ.439.13 కోట్లు, 2,29,726 మందికి పింఛన్ల కింద రూ.62.85 కోట్లు, ఆసరా కింద రూ.476.75 కోట్లు, సున్నావడ్డీ కింద 31,775 మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.123.86 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ నేతృత్వంలో పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తోందన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఆరుగురు జిల్లా అధికారులు, 89 మంది అధికారులు, 323 మంది మండల, గ్రామస్థాయి సిబ్బందికి కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మైదానంలో పర్యటించి పోలీసు సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్ల నుంచి గౌరవవందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులు రమాదేవి, అన్నమ్మను సత్కరించారు. ఎమ్మెల్యే కోన రఘుపతి, జేసీ శ్రీనివాసులు, ఏఎస్పీ మహేష్‌, డీఆర్వో లక్ష్మీ శివజ్యోతి, ఆర్డీవోలు రవీంద్ర, సరోజిని, పార్థసారథి పాల్గొన్నారు.

ఉత్తమ శకటాలుగా గృహనిర్మాణ, డీఆర్డీఏ.. వేడుకల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై శాఖల వారీగా శకటాలు ప్రదర్శించారు. డీఆర్డీఏ, గృహనిర్మాణ శాఖ శకటాలు ప్రథమ, విద్యాశాఖ శకటం ద్వితీయ స్థానంలో నిలిచారు. పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.  ఉత్తమ శకటాలు, స్టాళ్లకు బహుమతులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని