logo

లోపం ఎక్కడుంది?

సర్వజనాసుపత్రి ప్రసూతి విభాగంలో చేరిన గర్భిణికి గర్భం పోవడానికి ప్రైవేటు రక్తనిధి కేంద్రం నుంచి తెచ్చిన రక్తం ఎక్కించడమే  కారణమా? ఇపుడు అందరి మదిలో తలెత్తుతున్న ప్రశ్న? వైద్యులు దీనిపై తర్జనభర్జన పడుతున్నారు.

Published : 06 Feb 2023 05:33 IST

జీజీహెచ్‌లో రక్తం ఉన్నా బయట నుంచి తెప్పిస్తున్న వైనం
గర్భం పోవడానికి రక్తం ఎక్కించడమే కారణమా?
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే

సర్వజనాసుపత్రి కాన్పుల వార్డు

సర్వజనాసుపత్రి ప్రసూతి విభాగంలో చేరిన గర్భిణికి గర్భం పోవడానికి ప్రైవేటు రక్తనిధి కేంద్రం నుంచి తెచ్చిన రక్తం ఎక్కించడమే  కారణమా? ఇపుడు అందరి మదిలో తలెత్తుతున్న ప్రశ్న? వైద్యులు దీనిపై తర్జనభర్జన పడుతున్నారు. మూడు రోజుల నుంచి లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. విశ్లేషణలు చేస్తున్నారు. జీజీహెచ్‌కి ఈనెల 3వ తేదీ కాన్పు కోసం వచ్చిన ఆమెకు పరీక్షలు నిర్వహించిన అనంతరం రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించి అత్యవసరంగా రక్తం ఎక్కించాలని నిర్ణయించారు. అవసరమైన రక్తాన్ని ప్రైవేటు రక్తనిధి కేంద్రం నుంచి తెప్పించారు. ఆ రక్తం ఎక్కించిన అనంతరం గర్భిణికి జ్వరం వచ్చినట్లు తెలుసుకున్నారు. ఈనెల 4వ తేదీన గర్భం పోయిందని నిర్ధారించి గర్భసంచి శుభ్రం కావడానికి వైద్యులు మందులు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటోంది.

230 యూనిట్లు నిల్వ ఉన్నా..

సర్వజనాసుపత్రిలో రక్త నిల్వలు సరిపడా ఉన్నా ప్రైవేటు రక్త నిధి నుంచి డబ్బులు పెట్టి ఎందుకు తెప్పిస్తున్నారో? ఎవరికీ అంతుపట్టని సమస్యగా మారింది. తాజాగా దాతలు ఇచ్చిన అన్ని గ్రూపుల రక్తం 230 యూనిట్ల నిల్వ ఉంది. ఆస్పత్రి అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుతున్నారు. ప్రసూతి విభాగం నుంచి రక్తం కోసం ఎప్పుడు ఇండెంట్‌ వచ్చినా లేదనకుండా సరఫరా చేస్తున్నారు. జీజీహెచ్‌లో అందరికీ ఉచితంగానే రక్తం ఇస్తారు. రోగి తరఫున ఎవరైనా రక్తదానం చేయమని అడుగుతుంటారు. నిల్వలు ఎక్కువగా ఉంటే రక్తదానం చేయమని అడగరు. అదేవిధంగా అత్యవసర కేసులకు ఎలాంటి షరతులు లేకుండా 24 గంటలూ రక్తం యూనిట్లు ఇస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రైవేటు రక్త నిధి కేంద్రాల నుంచి తెచ్చుకోమని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? రక్తం తెచ్చుకునేందుకు ఎవరు అనుమతిస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? విచారణ చేస్తేనే వాస్తవాలు బయటపడనున్నాయి. వాస్తవానికి సర్వజనాసుపత్రిలో చికిత్స పొందే వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించి, ప్రాణాలను కాపాడే రక్తం ఎవరికి అవసరమైనా సంబంధిత విభాగం నుంచి రక్తనిధి కేంద్రానికి తెలియజేయాలి. ఆ గ్రూపు రక్తం లేకపోతే ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తారు. దీని ఆధారంగా సూపరింటెండెంట్‌ లేదా ఆర్‌ఎంవో అనుమతి తీసుకుని ప్రైవేటు రక్తనిధి నుంచి తెప్పించుకునే వెసులుబాటు ఉంది. జీజీహెచ్‌లోని రక్తనిధి కేంద్రంలో సంప్రదించకుండానే నేరుగా బయటి నుంచి ఎందుకు రక్తం తెప్పించారో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

గతంలోనూ ఇబ్బందులు వచ్చాయి

సర్వజనాసుపత్రి రక్తనిధి కేంద్రం నుంచి సరఫరా చేసిన రక్తం ఎక్కించిన అనంతరం కూడా ఒకటి, రెండు సార్లు రోగులకు రియాక్షన్‌ వచ్చినట్లు తెలిసింది. దీనిపై విశ్లేషణ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రైవేటుగా తెప్పించిన రక్తం ఎక్కించిన అనంతరం గర్భిణి అనారోగ్యానికి గురైంది. గర్భం పోవడానికి చాలా కారణాలుంటాయి. దీనికి కారణం ఏమిటనేది తెలుసుకుంటున్నాం.

ప్రభావతి, సూపరింటెండెంట్‌ జీజీహెచ్‌
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని