logo

ఏడు పదుల వయసులో భూమి కోసం పోరాటం

ఏడు పదుల వయసులో సరిగ్గా నడవలేకున్నా తన వ్యవసాయ భూమి కోసం ఓ వృద్ధురాలు అధికారుల చుట్టూ తిరుగుతోంది.

Published : 21 Mar 2023 05:45 IST

ఎలుకల మందుతో వచ్చిన కావూరు అక్కమ్మ

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఏడు పదుల వయసులో సరిగ్గా నడవలేకున్నా తన వ్యవసాయ భూమి కోసం ఓ వృద్ధురాలు అధికారుల చుట్టూ తిరుగుతోంది. అధికారులే తనకు అన్యాయం చేస్తున్నారని.. న్యాయం జరగకుంటే చనిపోతానంటూ తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన వృద్ధురాలు కావూరు అక్కమ్మ ఎలుకల మందు తీసుకుని సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి రావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘తాడికొండ గ్రామంలో 534 సర్వే నంబర్‌ 255-సి1 లో మాకు 1.06 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఈ ఆస్తిని కొందరు నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మాకు కాకుండా చేస్తున్నారు. గత నెలలో గుంటూరు ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందించగా ఆయన నేరుగా తాడికొండ రెవెన్యూ అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అధికారులు తాను చనిపోయానని ఆర్డీవోకు సమాధానమిచ్చారు. దీనిపై అధికారులను మందలించి ఆ భూమిని నాకు కేటాయించాలని సూచించారు. అధికారులను వెళ్లి కలిస్తే కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయని, మీరు కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకోవాలని సూచించారు. ఈ వయసులో చేసేదేమీ లేక అధికారులకు విన్నవించుకునేందుకు వచ్చాను. న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యం’ అని కన్నీటిపర్యంతమైంది. స్థానికంగా ఉన్న పోలీసులు ఆమె వద్ద నుంచి ఎలుకల మందు తీసుకుని, అక్కమ్మను కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆర్డీవోను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని