logo

అలవాటు పడ్డారు.. విక్రయాలు మొదలెట్టారు

గంజాయి తాగడానికి అలవాటు పడిన యువకులు దాని విక్రయాలను ప్రారంభించి పోలీసులకు దొరికిపోయారు. సులువుగా నగదు సంపాదించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

Published : 31 Mar 2023 05:35 IST

ఆరుగురు నిందితుల అరెస్టు, పరారీలో ఒకరు
15 కిలోల గంజాయి స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ డాక్టర్‌ కె.స్రవంతిరాయ్‌.

వెనుక ముసుగులో ఉన్న వారు నిందితులు, టేబుల్‌పై గంజాయి బస్తాలు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే : గంజాయి తాగడానికి అలవాటు పడిన యువకులు దాని విక్రయాలను ప్రారంభించి పోలీసులకు దొరికిపోయారు. సులువుగా నగదు సంపాదించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. తెనాలి రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ డాక్టర్‌ కె.స్రవంతిరాయ్‌ వివరాలు వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. పట్టణ ఐతానగర్‌ ప్యాడిసన్‌పేట సామాజిక భవనం వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో టూ టౌన్‌ పోలీసులు దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చిల్లర విక్రయాలకు నిందితులు పొట్లాలు కడుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ప్రధాన నిందితుడు ఐలా శ్రీనివాస్‌తో పాటు శివశంకర్‌, చంద్రశేఖర్‌, టి.సునీల్‌, సంజయ్‌, వి.సునీల్‌లను అరెస్ట్‌ చేసి, సరకు స్వాధీనం చేసుకున్నారు. సాల్మన్‌రాజు అలియాస్‌ కాట్రాజు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు ఐలా శ్రీనివాస్‌పై గతంలో గంజాయి, హత్యాయత్నం, దొంగతనం కేసులు పాత గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్నాయి. రైల్వే పోలీసులు కూడా ఇతనిపై కేసులు నమోదు చేసి ఉన్నారు. కాగా ఐలా శ్రీనివాస్‌(26) అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో విష్ణు అనే వ్యక్తి వద్ద గంజాయి కిలో రూ.5 వేల వంతున కొనుగోలు చేసి తెనాలి తీసుకొచ్చాడు. ఇక్కడ తన స్నేహితులు, గంజాయికి అలవాటు పడి ఉన్న వారితో చిల్లర విక్రయాలు చేయించి వచ్చిన లాభంలో తలా కొంత పంచుకుంటున్నారు. వీరు పది గ్రాముల గంజాయి ప్యాకెట్‌ను రూ.200లకు విక్రయిస్తున్నారు. గంజాయి విక్రయించే వారితో పాటు దానిని వినియోగించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, ప్రజలు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరు పరుస్తామన్నారు. సమావేశంలో సీఐ వెంకటరావు, ఎస్సై శివరామయ్య, సిబ్బంది నరసింహారావు, సాంబశివరావు, ప్రసాద్‌, బాషా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని