logo

పది పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ వెల్లడించరు. ఆమె శుక్రవారం విలేకరులతో ఏర్పాట్లపై మాట్లాడుతూ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు 138 కేంద్రాల్లో 27,714 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.

Published : 01 Apr 2023 05:38 IST

మాట్లాడుతున్న డీఈవో శైలజ

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ వెల్లడించరు. ఆమె శుక్రవారం విలేకరులతో ఏర్పాట్లపై మాట్లాడుతూ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు 138 కేంద్రాల్లో 27,714 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి వివరించారు. అవి ఆమె మాటల్లోనే.. పరీక్షకు 14,693 మంది బాలురు, 13,019 మంది బాలికలు హాజరవుతారు. సీ కేటగిరి కేంద్రాలు 16 ఉండగా, నాలుగింటిలో సీసీ కెమారాల పర్యవేక్షణ ఉంటుంది. చీఫ్‌ సూపరింటెండెంట్లు 138, డిపార్టుమెంటల్‌ అధికారులు 138, రూట్‌ అధికారులు 15, అసిస్టెంట్‌ రూట్‌ అధికారులు 15, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 5, సిట్టింగ్‌ స్క్వాడ్‌ 12 బృందాలు ఏర్పాటు చేశాం. 1400 మంది ఉపాధ్యాయులకు ఇన్విజిలేటర్లుగా విధులు కేటాయించాం. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుంది. విద్యార్థులను 8.45 గంటలకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నాం. విద్యార్థుల వివరాలతో ఓఎంఆర్‌ ఇస్తారు. వాటిని విద్యార్థులు పరిశీలించుకుని ఏవైనా తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్‌ దృష్టికి తేవాలి. చరవాణులు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు కేంద్రంలోకి అనుమతి లేదు. విద్యార్థులతో పాటు విధుల్లో ఉన్న సిబ్బందికి ఈ నిబంధన వర్తిస్తుంది. విధులకు సమయానికి రిపోర్టు చేయాలి. ఈ విషయంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించినా, ప్రధానోపాధ్యాయులు రిలీవ్‌ చేయకపోయినా నిబంధనల మేరకు శాఖాపర చర్యలు తప్పవు.

హాల్‌టికెట్లు తప్పనిసరిగా తెచ్చుకోవాలి: విద్యార్థులు హాల్‌టికెట్లతో తప్పనిసరిగా హాజరుకావాలి. పెన్‌, పెన్సిల్‌, స్కేల్‌ వంటివి తెచ్చుకోవచ్చు. హాల్‌టికెట్‌ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు హాల్‌టికెట్లు చూపితే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈసారి పరీక్షలో ఇచ్చే ప్రశ్నపత్రంపైనా నంబరింగ్‌ ఉంటుంది. విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. అదనపు పత్రాలు అడిగితే 12 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు ఏ విద్యార్థి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉండదు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు: అన్నీ పరీక్ష కేంద్రాల్లో బెంచ్‌లు, తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. కంట్రోల్‌ రూం అందుబాటులో ఉంటుంది. ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు చరవాణి 99513 97109, 92475 77313 సంఖ్యలను సంప్రదించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని